కిడ్నీ సమస్యలకు ప్రధానంగా డయాబెటిస్, హైబీపీ కారణమవుతుంటాయి. మూత్రపిండాల వ్యాధి వచ్చినవారిని పరిశీలిస్తే... మధుమేహం కారణంగా 39%, హైబీపీ వల్ల 60% మంది, మిగతా ఒక శాతం ఇతరత్రా కారణాలతో కిడ్నీ సమస్యలకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అంటే కేవలం డయాబెటిస్, హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా చాలామందిలో మూత్రపిండాలను కాపాడవచ్చన్నమాట. మూత్రపిండాల విధులివి..
కిడ్నీలు నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడుతూ మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒక్కసారి మూత్రపిండం పనితీరు మందగించి, అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. మూత్రపిండం గానీ పూర్తిగా విఫలమైతే జీవితాంతం కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఇలా చేసే ‘డయాలసిస్’ ప్రక్రియ కోసం నెలకు సుమారు రూ. 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతాయి. కిడ్నీ దెబ్బతినగానే మన దేహంలోని కీలక అవయవాలైన గుండె వంటివి దెబ్బతిని.. గుండె జబ్బులు, ఇరత కీలక అవయవాలు దెబ్బ తినటం మొదలవుతుంది.
చదవండి: మతిమరుపు నివారణకు మందులు లేవు..ఇలా చేస్తే మాత్రం..
దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేసుకోవాలన్నా.. రోగికి సరిపోయే కిడ్నీ దాతలు దొరకటం చాలా కష్టం. తీరా కష్టపడి ఆ ప్రక్రియ చేయించాక కూడా జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ. వెరసి ఎన్నోఇబ్బందులూ, దుష్ప్రభావాలు. ఇలాంటి ప్రమాదాలూ, అనర్థాలూ దరిచేరకుండా ఉండాలంటే... కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అంటే చిక్సిత కంటేæ నివారణే మేలని గుర్తుంచుకోవాలి.
కిడ్నీల రక్షణ కోసం కొన్ని సూచనలు..
► టైప్–1 రకం బాధితులు డయాబెటిస్ బారినపడిన ఐదేళ్ల నుంచి... ప్రతీ ఏటా తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.
► టైప్–2 బాధితులైతే తమకు డయాబెటిస్ ఉందని గుర్తించిన మరుక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత నుంచి కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
చదవండి: Beauty Tips: దీనిని వాడితే డబుల్ చిన్ మాయం!
ఇవే ఆ పరీక్షలు...
1) మూత్రంలో ఆల్బుమిన్ పోతోందా? ఆల్బుమిన్ అనేది మన దేహంలోని ఒక రకం ప్రోటీను. ఇది మూత్రంలో పోతూ ఉంటే ‘సుద్ద’ పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా ‘సుద్ద’ ఎక్కువగా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుందన్నమాట. అలాంటప్పుడు ‘ఆల్బుమిన్’ పరీక్షను తప్పనిసరిగా ప్రతి ఏటా చేయించాలి.
2) రక్తంలో సీరమ్ క్రియాటినిన్ పరీక్ష: మూత్రపిండాల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పే కీలక పరీక్ష ఇది. అయితే కేవలం క్రియాటినిన్ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు కూడా సీరమ్ క్రియాటినిన్ పెరగపోవచ్చు. కాబట్టి క్రియాటినిన్ ఆధారంగా వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్ – ఈజీఎఫ్‌ఆర్)ను లెక్కించి.. కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందనే అంచనా వేస్తారు. సీరమ్ క్రియాటినిన్‌ను పరీక్షించి.. దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి అంశాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్’ లెక్కిస్తారు.
కిడ్నీలను కాపాడుకోవాలంటే?
డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర మోతాదులనూ, అధిక రక్తపోటునూ కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెర రోగులు ‘హెచ్‌బీఏ1సీ’ (గైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్ష ఫలితం 7 కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
చివరగా... డయాబెటిస్, హైబీపీ... ఈ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ తమ బీపీ 130/80 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ∙రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి. ∙రక్తహీనత తలెత్తకుండా కూడా చూసుకోవాలి. ∙మూత్రంలో సుద్దపోతుంటే గుర్తించి తక్షణం తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకోవాలి.
-డాక్టర్ పి. విక్రాంత్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment