kidney issue
-
కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
ఢిల్లీ: మహారాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ సురేశ్ ‘బాలు’ ధానోర్కర్(47) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ఆయన తండ్రి అనారోగ్యంతో మరణించగా.. ఇవాళ ఆయన కూడా మరణించడం ఆ కుటుంబంలో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నింపింది. సురేశ్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీలో రాళ్లకు చికిత్స తీసుకునేందుకు మే 26న సురేశ్ ధానోర్కర్ నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత ఆదివారం ఆయన్ను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ తెలిపారు. సురేష్ ధానోర్కర్ తండ్రి నారాయణ్ ధానోర్కర్ (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో గత శనివారం మరణించారు. ఆస్పత్రిలో ఉండడంతో.. ఆదివారం జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ హాజరుకాలేకపోయారు. మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేశ్ ధానోర్కరే. బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సురేశ్ భార్ పేరు ప్రతిభ. ఆమె 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. స్వస్థలం వారోరాలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Sad to learn that our @INCIndia parliamentary colleague, Suresh Narayan Dhanorkar (MP from Chandrapur constituency in Maharashtra) passed away overnight, the second demise of a Congress MP during the 17th Lok Sabha. He was only 47. My condolences to his loved ones. Om Shanti. pic.twitter.com/qwCQ8XamEc — Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2023 ఇదీ చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. అధికారికి షాక్ -
షుగరూ, హైబీపీ అదుపులో ఉంటే కిడ్నీలూ పదిలమే
కిడ్నీ సమస్యలకు ప్రధానంగా డయాబెటిస్, హైబీపీ కారణమవుతుంటాయి. మూత్రపిండాల వ్యాధి వచ్చినవారిని పరిశీలిస్తే... మధుమేహం కారణంగా 39%, హైబీపీ వల్ల 60% మంది, మిగతా ఒక శాతం ఇతరత్రా కారణాలతో కిడ్నీ సమస్యలకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అంటే కేవలం డయాబెటిస్, హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా చాలామందిలో మూత్రపిండాలను కాపాడవచ్చన్నమాట. మూత్రపిండాల విధులివి.. కిడ్నీలు నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడుతూ మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒక్కసారి మూత్రపిండం పనితీరు మందగించి, అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. మూత్రపిండం గానీ పూర్తిగా విఫలమైతే జీవితాంతం కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఇలా చేసే ‘డయాలసిస్’ ప్రక్రియ కోసం నెలకు సుమారు రూ. 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతాయి. కిడ్నీ దెబ్బతినగానే మన దేహంలోని కీలక అవయవాలైన గుండె వంటివి దెబ్బతిని.. గుండె జబ్బులు, ఇరత కీలక అవయవాలు దెబ్బ తినటం మొదలవుతుంది. చదవండి: మతిమరుపు నివారణకు మందులు లేవు..ఇలా చేస్తే మాత్రం.. దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేసుకోవాలన్నా.. రోగికి సరిపోయే కిడ్నీ దాతలు దొరకటం చాలా కష్టం. తీరా కష్టపడి ఆ ప్రక్రియ చేయించాక కూడా జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ. వెరసి ఎన్నోఇబ్బందులూ, దుష్ప్రభావాలు. ఇలాంటి ప్రమాదాలూ, అనర్థాలూ దరిచేరకుండా ఉండాలంటే... కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అంటే చిక్సిత కంటేæ నివారణే మేలని గుర్తుంచుకోవాలి. కిడ్నీల రక్షణ కోసం కొన్ని సూచనలు.. ► టైప్–1 రకం బాధితులు డయాబెటిస్ బారినపడిన ఐదేళ్ల నుంచి... ప్రతీ ఏటా తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది. ► టైప్–2 బాధితులైతే తమకు డయాబెటిస్ ఉందని గుర్తించిన మరుక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత నుంచి కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చదవండి: Beauty Tips: దీనిని వాడితే డబుల్ చిన్ మాయం! ఇవే ఆ పరీక్షలు... 1) మూత్రంలో ఆల్బుమిన్ పోతోందా? ఆల్బుమిన్ అనేది మన దేహంలోని ఒక రకం ప్రోటీను. ఇది మూత్రంలో పోతూ ఉంటే ‘సుద్ద’ పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా ‘సుద్ద’ ఎక్కువగా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుందన్నమాట. అలాంటప్పుడు ‘ఆల్బుమిన్’ పరీక్షను తప్పనిసరిగా ప్రతి ఏటా చేయించాలి. 2) రక్తంలో సీరమ్ క్రియాటినిన్ పరీక్ష: మూత్రపిండాల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పే కీలక పరీక్ష ఇది. అయితే కేవలం క్రియాటినిన్ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు కూడా సీరమ్ క్రియాటినిన్ పెరగపోవచ్చు. కాబట్టి క్రియాటినిన్ ఆధారంగా వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్ – ఈజీఎఫ్ఆర్)ను లెక్కించి.. కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందనే అంచనా వేస్తారు. సీరమ్ క్రియాటినిన్‌ను పరీక్షించి.. దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి అంశాల ఆధారంగా ‘ఈజీఎఫ్ఆర్’ లెక్కిస్తారు. కిడ్నీలను కాపాడుకోవాలంటే? డయాబెటిస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర మోతాదులనూ, అధిక రక్తపోటునూ కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెర రోగులు ‘హెచ్‌బీఏ1సీ’ (గైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్ష ఫలితం 7 కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చివరగా... డయాబెటిస్, హైబీపీ... ఈ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ తమ బీపీ 130/80 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ∙రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి. ∙రక్తహీనత తలెత్తకుండా కూడా చూసుకోవాలి. ∙మూత్రంలో సుద్దపోతుంటే గుర్తించి తక్షణం తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకోవాలి. -డాక్టర్ పి. విక్రాంత్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ -
సింగపూర్‌కు జయలలిత తరలింపు?
తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆమెకు మధుమేహం ఎక్కువ స్థాయిలో ఉండటం, దానికి తోడు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉండటంతో చికిత్స కోసం ఆమెను సింగపూర్ పంపుతున్నట్లు ఆస్పత్రి వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఛానళ్లు పేర్కొన్నాయి.ఆమెకు జ్వరం తగ్గింది గానీ ప్రస్తుతం ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు అంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమెకు సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు అపోలో ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. అమ్మకు అంతా బాగానే ఉందని, అందువల్ల ఆమెను సింగపూర్ తరలించడం లేదని.. అపోలో ఆస్పత్రి నుంచి కూడా త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా మాత్రం ఇంతవరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఆస్పత్రి బయట పలువురు మంత్రులతో పాటు అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెకు బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. సీఎం జయలలిత త్వరితగతిన కోలుకోవాలని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.