సాహసమే అతడి ఊపిరి | Krishna Biography Tollywood Superstar Krishna Life And Career | Sakshi
Sakshi News home page

సాహసమే అతడి ఊపిరి

Published Wed, Nov 16 2022 4:55 AM | Last Updated on Wed, Nov 16 2022 4:55 AM

Krishna Biography Tollywood Superstar Krishna Life And Career - Sakshi

1962లో తొలి బాండ్‌ సినిమా ‘మిస్టర్‌ నో’ రిలీజ్‌ అయ్యింది. షేన్‌ కానరీ హీరో. తర్వాత నాలుగేళ్లకు అలాంటి సినిమా తీయాలని నిర్మాత డూండీకి అనిపించింది. హీరో ఎవరు? ఎన్‌.టి.ఆర్‌... ఊహూ.  ఏ.ఎన్‌.ఆర్‌.. కాదు. ‘తేనె మనసులు’ సినిమా చూశాడాయన. క్లయిమాక్స్‌లో కారు చేజ్‌. స్కూటర్‌ వేగంగా నడుపుతున్న కొత్త హీరో నదురు బెదురు లేకుండా డూప్‌ జోలికి పోకుండా చేజ్‌ చేసి ఒక్క గెంతులో కారులో దూకాడు. డేరింగ్‌ డేషింగ్‌ స్టంట్‌. ఇతడే నా బాండ్‌ అనుకున్నాడు డూండీ. ‘గూఢచారి 116’ రిలీజైంది. స్కూటర్‌ మీద నుంచి కారు మీదకు గెంతిన ఒక్క గెంతు ఆ నటుణ్ణి సూపర్‌స్టార్‌ని చేసింది. షేన్‌ కానరీ గొప్పవాడు. 32 ఏళ్లకు బాండ్‌ అయ్యాడు. కృష్ణ మరీ గొప్పవాడు. 23 ఏళ్లకే బాండ్‌ అయ్యాడు.

తెనాలిలో కుర్రకారు చూడాల్సిన సినిమాలంటే ఇంకేం ఉంటాయి. అయితే ఎన్‌.టి.ఆర్‌. లేకుంటే ఏ.ఎన్‌.ఆర్‌. కృష్ణ ఎన్‌.టి.ఆర్‌ ఫ్యాన్‌. ఏలూరులో ఫిజిక్స్‌ మెయిన్‌గా బిఎస్సీ చదువుతూ ఎన్‌.టి.ఆర్‌ సినిమాలు చూసి మైమరిచాడు. 60 సినిమాలు పూర్తి చేసుకున్న ఏ.ఎన్‌.ఆర్‌ను  సి.ఆర్‌.రెడ్డి కాలేజీకి సన్మానానికి పిలిస్తే ఆయనకు దక్కిన రాజభోగం గమనించాడు. ‘సినిమాకు ఇంత యోగమా’ అనుకున్నాడు. చెప్పాలంటే తెనాలి గాలిలోనే ఏదో కళ ఉంది. కృష్ణ ఊరు– బుర్రిపాలెంకు అది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక గాలి గట్టిగా తగిలింది. సినిమా గాలి.

‘ఆడబతుకు’, ‘మంగమ్మ శపథం’, ‘దేవత’ 1965లో రిలీజైన ఎన్‌.టి.ఆర్‌ సినిమాలు. ‘ఆత్మగౌరవం’, ‘ప్రేమించి చూడు’, ‘సుమంగళి’ ఏ.ఎన్‌.ఆర్‌ చిత్రాలు. ఇద్దరూ 42 ఏళ్ల వయసులో ఉన్నారు. పోటాపోటీగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అప్పటికే తరం మారి, తలకట్టు మారి, తెలుగు తెర కొత్త ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంది. అభిమానులు సంఘాలు పెట్టుకోవడానికి  కొత్త హీరో అన్వేషణలో ఉన్నారు. తెలుగు నేలపై గాలి మారిందని చెప్పడానికి ఒకడు రావాలి. అదే సంవత్సరం 22 ఏళ్ల కృష్ణ తొలి సినిమా ‘తేనె మనసులు’ రిలీజ్‌ అయ్యింది.  దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి హిట్‌ కొట్టాడు. ఆశ్చర్యం. దేవ్‌ ఆనంద్‌ పోలికలున్న రామ్మోహన్‌కు పేరొచ్చింది. అచ్చెరువు. ఏ పోలికలు లేని ఒరిజనల్‌ రూపు, ఊపు ఉన్న నటుడికే ఆ తర్వాత పట్టం దక్కింది. పట్టం దక్కినవాడు కృష్ణ.

ఎన్‌.టి.ఆర్‌కు ఒక సంస్థానం ఉంది. తమ్ముడు త్రివిక్రమరావు పక్కన ఉన్నాడు. పుండరీ కాక్షయ్య ఉన్నాడు. నిర్మాతల సమృద్ధి ఉంది. అక్కినేనికి దుక్కిపాటి, విక్టరీ మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, ఆదుర్తి ఉన్నారు. కృష్ణకు? ఉన్నవల్లా ధైర్యం, సాహసం, పట్టుదల, పంతం. రోజూ లేవగానే మేకప్‌ వేసుకుని సెట్‌లో ఉండాలి. చెవులకు యాక్షన్, కట్‌ వినిపించాలి. ఊళ్లో ఏదో ఒక హాల్లో తన సినిమా ఆడుతూ ఉండాలి. అందుకు ఏం చేయాలి?  నిర్మాత నుంచి సినిమా పుడుతుంది.  నిర్మాతకు ఇబ్బంది రాకపోతే తనకు ఏ ఇబ్బందీ రాదు. ఆ సూత్రం తెలిశాక కృష్ణ నిర్మాతల హీరో అయ్యాడు. రేపు షూటింగ్‌. డబ్బు లేదు. తానే ఏర్పాటు చేసేవాడు. రిలీజయ్యాక సినిమా పోయింది.  రెమ్యూనరేషన్‌ వదులుకున్నాడు. ఎవరో నిర్మాత గొల్లుమంటున్నాడు. పిలిచి డేట్స్‌ ఇచ్చాడు.  కృష్ణకు కూడా ఇప్పుడు మెల్లగా ఒక సంస్థానం ఏర్పడింది. ఇద్దరు తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు తోడు నిలిచారు. డూండీ, వి.రామచంద్రరావు, కె.ఎస్‌.ఆర్‌.దాస్, ఆరుద్ర, త్రిపురనేని మహారథి తన పక్షం అయ్యారు. నెక్స్‌›్ట ఏంటి? కృష్ణ ఒకటి గమనించాడు... ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌లు నిర్మాతలు వస్తే హీరోలుగా నటిస్తారు. రాకపోతే తామే నిర్మాతలై హీరోలుగా నటిస్తారు. అంటే వారు హీరోలుగా నటిస్తూనే ఉంటారు. తాను కూడా నిర్మాతగా మారితే? తన హీరోయిజంను తానే నిరూపించుకుంటే?  

అదిగో డెక్కల చప్పుడు చేస్తూ నురగలు కక్కుతూ దౌడు తీస్తున్న గుర్రం. పైన ఎర్ర టోపి, చేత రివాల్వర్‌తో కృష్ణ. సినిమా పేరు ఏమిటా అని పల్లెటూళ్లో పాదచారి ఆగి పోస్టర్‌ చూశాడు. మోసగాళ్లకు మోసగాడు!

‘అమరవీడు’ సంస్థానం ఫ్రెంచ్‌ సేనల వశం అయ్యాక ఇద్దరు విశ్వాసపాత్రులు ఆ సంస్థానం నిధిని అడవిలో దాచారు. దాని కోసం మోసగాళ్లు వేటాడుతున్నారు. వారిని తలదన్నే మోసం చేసి నిధిని ప్రజలకు చేర్చాలి. అదీ ‘మోసగాళ్లకు మోసగాడు’ కథ. మన దేశంలో ఆలమందల్ని పిల్లనగ్రోవితో కట్టడి చేస్తారు. అమెరికాలో గుర్రాలతో కాపు కాస్తారు. ఆ కౌబాయ్‌లు మనకు లేరు. ఆ వాతావరణం మనది కాదు. సినిమా జాతకం చిటికెలో తేల్చే చక్రపాణి ‘ఈ సినిమా ఎవరికి అర్థమవుతుందయ్యా’ అని చికాకు పడ్డాడు సెట్‌కొచ్చి. కాని తీసెడివాడు కృష్ణ. మన దేశంలో తొలి కౌబాయ్‌ సినిమా. అదీ కలర్‌లో. మద్రాసులో రైలుకు మూడు ప్రత్యేక డబ్బాలు తగిలించి యూనిట్‌ రాజస్థాన్‌కు చేర్చి షూటింగ్‌ జరిపితే గుర్రాలు సకలించాయి. తుపాకులు గర్జించాయి. రక్తం చిమ్మింది. శత్రువులు మట్టి కరిచారు. నిధి ప్రజలకు చేరింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైతే ప్రేక్షకులు గుప్పిళ్ల కొద్దీ చిల్లర, మడతలు పడ్డ రూపాయి నోట్లు కౌంటర్లో ఇచ్చి టికెట్లను పెరుక్కొని హాల్లో సీట్లు వెతుక్కోడానికి పరిగెత్తారు. చక్రపాణి జోస్యం తొలిసారి పొల్లుపోయింది. కృష్ణ ఇప్పుడెవరనుకున్నారు? ఆంధ్రా జేమ్స్‌బాండ్‌ కృష్ణ. ఆంధ్రా కౌబాయ్‌ కృష్ణ. డేరింగ్‌ డాషింగ్‌ కృష్ణ.

ఘంటసాలకు నాటుమందు పడలేదు. ప్రాణం మీదకొచ్చింది. పరిస్థితి అర్థమైన అక్కినేని రామకృష్ణను కనుగొన్నాడు. ఘంటసాల స్థానంలో రామకృష్ణను అక్కినేని ఎంకరేజ్‌ చేస్తే శోభన్‌బాబు, కృష్ణంరాజు కూడా అతణ్ణే ఎంచుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌కు ఈ టెన్షనే లేదు. రఫీనే రంగంలో దించగలడు. కాని కృష్ణకు ఒక గొంతు కావాలి. పాటల్లో తనకో సపోర్ట్‌ కావాలి. ఇండస్ట్రీకి ఎవరో కొత్త గాయకుడు వచ్చి స్ట్రగుల్‌ అవుతున్నాడని విని పిలిపించారు. ‘మీరు వర్రీ కాకండి. ఎంత లేదన్నా నాకు సంవత్సరానికి నాలుగు సినిమాలుంటాయి. అన్నిటికీ మీరే పాడండి. నా సింగర్‌గా ఉండండి’ అని హామీ ఇచ్చాడు. ఆ కొత్త గాయకుడు ఉత్సాహంగా కృష్ణకు పాడాడు. ‘విశాల గగనంలో చందమామా... ప్రశాంత సమయములో కలువలేమా’....  విన్న ప్రేక్షకులు, రేడియో శ్రోతలు తలలు ఊపారు. తనివి తీరడం లేదని కార్డు ముక్కలు రాసి పోస్ట్‌డబ్బాలో పడేశారు. ఆ కొత్త గాయకుడు ఇంకా ఉల్లాసంగా పాడాడు. ‘తనివి తీరలేదే... నా మనసు నిండలేదే’...  అలా కృష్ణ, తర్వాతి కాలంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగా తెలిసిన ఆ కొత్త గాయకుడు స్థిరపడి అనేక జూబ్లీల కాలం ప్లాటినమ్‌ డిస్క్‌లతో గమకాలాడారు.

ఎన్‌.టి.ఆర్‌కు ‘పాతాళభైరవి’ ఉంది. అక్కినేనికి ‘దేవదాసు’ ఉంది.  స్టార్‌లుగా కొనసాగాలంటే ప్రయత్నం, కృషి సరిపోతుంది. కాని సుదీర్ఘకాలం నిలబడాలంటే నటుడుగా ప్రూవ్‌ చేసుకోవాలి. మాగ్నమ్‌ ఓపస్‌ ఉండాలి. తనకు అదేమిటి అనే ఆలోచన వచ్చింది కృష్ణకు. ‘అసాధ్యుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా పాటలో కనిపించినప్పటి నుంచి ఆ పాత్ర మీద మనసు ఉంది. ఆ సినిమా తీయాలన్న సంకల్పం ఉంది. కాని అందుకు గేట్‌ అడ్డం ఉంది. ఆ గేట్‌ పేరు ఎన్‌.టి.ఆర్‌.  ఎప్పటి నుంచో ఆయన అల్లూరి సీతారామరాజు తీస్తానంటున్నాడు. తీయడం లేదు. కృష్ణ ఆగదల్చుకోలేదు. 

కృష్ణ నటించు ‘అల్లూరి సీతారామరాజు’.
ఈ వార్త ఇండస్ట్రీ అంతా గుప్పుమంది. ఆ తర్వాత వార్తలే వార్తలు. 30 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో షూటింగ్‌ అట. యూనిట్‌ కోసం చింతపల్లిలో 5 ఎకరాల జొన్నచేను కొని సాపు చేసి కాలనీ కట్టారట. ఫీల్డులోని కేరెక్టర్‌ ఆర్టిస్టులంతా ఇందులో నటిస్తున్నారట. మన్యం వీరుడి కోసం కృష్ణ ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధ పడ్డాడట. అన్నింటికి మించి సినిమా స్కోప్‌లో తీస్తున్నారట. 1973 డిసెంబర్‌లో షూటింగ్‌ మొదలైతే కారెక్టర్‌ ఆర్టిస్టులంతా చింతపల్లిలో ఉండటం చేత మద్రాసులో రెండువారాలు షూటింగులు ఆగిపోయాయి. అదీ ఆ సినిమా తడాఖా. 

మెల్లమెల్లగా పోస్టర్లు, అల్లూరి గెటప్‌ బయటకు వచ్చాయి. ఖాకీ చెడ్డీ, మోచేతుల వరకూ తెల్ల చొక్కా, పైన ముతక తువ్వాలు, చేతి బెత్తంతో జనులకు కనిపించిన అల్లూరి సీతారామరాజు తెలుగు వారికి మాత్రం సినిమా వారు తమ ఊహలకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన ఆహార్యం వల్ల ఇప్పుడున్న రూపానికి మారిపోయాడు. ఎన్‌.టి.ఆర్‌ ప్రోద్బలంతో అల్లూరికి ఆ సినీ రూపం ఇచ్చిన ఆర్టిస్ట్‌ మాధవపెద్ది గోఖలే. అన్నట్టు అతనిదీ కృష్ణ ఊరే. తెనాలి.

‘ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరికా? రూథర్‌ఫర్డ్‌... నేనే కాదు. మా భారతీయులు ఎవ్వరూ ఏనాడూ ఇతరులను జయించాలని రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు. రాళ్లల్లో కలిసిపోయారు. యవనులు, హూణులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర అలానే అంతమవుతుంది’... అల్లూరి సీతారామరాజు డైలాగులతో హాల్లో జనం ఉద్వేగపడుతున్నారు. కన్నీరు కారుస్తున్నారు. ఆవేశ పడుతున్నారు. పౌరుషంతో ఉప్పొంగుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి మావాడు. ఆ పాత్రకు జీవం పోసిన కృష్ణ మావాడు. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. కృష్ణ పేరు ముందు ఇప్పుడు ‘నట’ చేరింది. ‘నటశేఖర’ కృష్ణ.

అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌ నిర్మాతలుగా ఉంటూ కృష్ణతో సినిమాలు తీయలేదు. కృష్ణ తాను నిర్మాతగా అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌లతో సినిమాలు తీశాడు. ఎన్‌.టి.ఆర్‌తో తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’ పెద్ద హిట్‌. అక్కినేనితో ‘హేమాహేమీలు’ తీశాడు. అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌లను ఫలానా సినిమా తీయవద్దని కృష్ణ ఎప్పుడూ అనలేదు. కాని కృష్ణ తీస్తున్న సినిమాల విషయంలో వారు ఇరువురూ అభ్యంతరం చెప్పారు. ఎన్‌.టి.ఆర్‌ కృష్ణను పిలిచి ‘అల్లూరి సీతారామరాజు’, ‘కురుక్షేత్రం’ సినిమాలు విరమించమని కోరాడు. కృష్ణ ‘దేవదాసు’ తీస్తే అక్కినేని పోటీగా తన ‘దేవదాసు’ను రీరిలీజ్‌ చేశాడు. కృష్ణతో నటించే సినిమాలలో తనకు ప్రాధాన్యం ఉండటం లేదని పేపర్‌ ప్రకటన ఇచ్చి మరీ శోభన్‌బాబు తప్పుకున్నాడు.

కృష్ణ ఆగలేదు. ఆగడం కృష్ణకు తెలియదు.

నూరవ చిత్రం... రెండు వందలవ చిత్రం...

ఇప్పుడతడు సూపర్‌స్టార్‌ కృష్ణ.

‘బృహన్నల’ వేషం వేయడానికి బాడీ లాంగ్వేజ్‌ కోసం నృత్య శిక్షణ తీసుకున్నాడు ఎన్‌.టి.ఆర్‌. ‘దేవదాసు’ రూపం కోసం అన్నపానీయాలు మానేశాడు అక్కినేని. కృష్ణ అలాంటి నటుడు కాదు. అతడు ఎంతో అందమైన అమాయకమైన నటుడు. అప్పటికప్పుడు చేయదగింది చేసి ప్రేక్షకులకు కనెక్ట్‌ చేస్తే చాలు అనుకుంటాడు. అందుకే మార్నింగ్‌ కాల్షీట్‌లో గూఢచారిగా మారి భూమి మీద స్కైలాబ్‌  పడకుండా కాపాడతాడు. మధ్యాహ్నం కాల్షీట్‌లో ఓడ కెప్టెన్‌గా సముద్రం అడుగున ఉన్న నిధిని బయటకు తీస్తాడు. ‘పాడిపంటల’ రైతు అతడే. ‘నేనొక ప్రేమపిపాసిని’ అని పాడే భగ్న ప్రేమికుడు అతడే. పాత్రను అమాయకపు నిజాయితీతో చేరవేస్తాడు కనుకనే ప్రేక్షకులు విపరీతంగా అభిమానించారు. ‘ఏకలవ్య’ సినిమాలో ‘మోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ పాటలో శాస్త్రీయ నృత్యం చేస్తాడు కృష్ణ. అది చూసి ప్రేక్షకులు వచ్చీరాని నృత్యం చేసే సొంత పిల్లల్ని కావలించుకున్నట్టు కృష్ణను కావలించుకుంటారు. అదే కృష్ణ విజయం.

నటులుగా ఉంటూ దర్శకులుగా పెద్ద హిట్స్‌ ఇచ్చిన రాజ్‌ కపూర్, ఎన్‌.టి.ఆర్‌ల వరుసలో కృష్ణ నిలుస్తాడు. ‘సింహాసనం’ అందుకు ఉదాహరణ. నటుడుగా ఉంటూనే నిర్మాతగా రెండు భాషల్లో (తెలుగు, హిందీ) కృష్ణ తీసినన్ని సినిమాలు తీసినవారు లేరు.  ఎంత వయసు వచ్చినా ఇమేజ్‌ చెక్కు చెదరకుండా కాపాడుకోవడం కృష్ణకు సాధ్యమైంది. కారెక్టర్‌ ఆర్టిస్టుగా కృష్ణ కొన్ని సినిమాలు చేశాడు. కాని జనం మాత్రం ‘హీరో కృష్ణ’ అని మాత్రమే పిలిచారు.

అనవసర వివాదాలు, వాచాలత్వాలు లేకుండా కృష్ణ జీవితం ఎంతో హుందాగా గడిచింది. ‘యాక్షన్‌’ అనగానే బెబ్బులిలా మారే ఈ నటుడు తెర వెనుక మితభాషిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. భార్య విజయ నిర్మలను ఇంటికి పరిమితం చేయాలనుకోక దర్శకురాలిగా ప్రోత్సహించి ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా నిలిపాడు. ఎక్కడ సంపాదించాడో అక్కడే ఖర్చు పెట్టాడు. కన్నపిల్లల్ని తిరిగి సినిమా రంగానికే అప్పజెప్పాడు.
గాలివాటానికి దొర్లిపోయే మనుషులు చరిత్రలో నిలవ్వొచ్చు. కాని ఎదురుగాలిని సవాలు చేస్తూ చరిత్రను సృష్టిస్తారు కొందరు. కృష్ణది అలాంటి కోవ. చేవ. అందుకే తెలుగువారికి ఎప్పటికీ అతడు డేరింగ్‌ డాషింగ్‌ కృష్ణ.
– కె.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement