కూచిపూడి కళాకారిణి రంగప్రవేశం నాటి ఫొటో; దీపికారెడ్డి; నాటి రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటూ...
నవరసాలను పలికించే కళ్లు. చూపు తిప్పుకోనివ్వని ఆహార్యం.
అకుంఠిత దీక్ష... నిరంతర సాధన. అంతకు మించిన అంకితభావం.
యాభై ఏళ్ల కిందట కట్టిన మువ్వలు నేటికీ లయబద్ధంగా రవళిస్తూనే ఉన్నాయి.
కూచిపూడి నాట్యానికి... ఆమె చేయాల్సింది ఏదో మిగిలి ఉన్నట్లుంది.
నటరాజు మరింతగా సేవ కోరుకుంటున్నాడు. సంగీత నాటక అకాడమీ బాధ్యతనిచ్చాడు.
కూచిపూడి నాట్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన దీపికారెడ్డి పౌరాణిక కథాంశాలకే పరిమితం కాకుండా ఆధునిక సామాజికాంశాలకు రూపకల్పన చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్’గా నియమితురాలైన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘నాట్యం అనేది అద్భుతమైన కళ. ఈ భారతీయ కళను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలి.
మనం ఎన్ని ప్రదర్శనలిచ్చాం అని లెక్కపెట్టుకోవడం కాదు, మనం ఎంతమంది కళాకారులను తయారు చేశామనేది ముఖ్యం. కళాకారులు నటరాజుకు సమర్పించే నమస్సుమాంజలి కళను విస్తరింపచేయడం ద్వారానే’ అన్నారు. ‘నాట్యం, సంగీతం వంటి కళలన్నీ నగరాల్లో కేంద్రీకృతమైపోతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పిల్లలకు సరిగ్గా అందడం లేదు. ఈ కొత్త బాధ్యత ద్వారా ఈ కళలను జిల్లాల వారీగా ప్రణాళికలు వేసుకుని గ్రామాలకు చేరుస్తానని’ చెప్పారామె.
కళ ఇచ్చిన మధుర జ్ఞాపకాలు!
‘‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశాననే మాట నిజమే. కానీ ఈ కళ నాకు ఇచ్చిన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. ఖజురహో డాన్స్ ఫెస్టివల్స్‌లో నా పెర్ఫార్మెన్స్ చూసిన ఒక క్రిటిక్ మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి ‘మీకు సరస్వతీదేవి పుట్టింది’ అన్నారు. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ ఆయనకు మనసులోనే ప్రణమిల్లుతుంటాను. మరొకటి... ఢిల్లీలో నేషనల్ డాన్స్ ఫెస్టివల్‌లో ద్రౌపది పాత్ర అభినయించాను. ఆ మరుసటి రోజు ఆడియెన్స్ గ్యాలరీకి వెళ్తున్నప్పుడు... ముందు రోజు నా ప్రోగ్రామ్ చూసిన వాళ్లు గుర్తు పట్టి ఎక్సైట్‌మెంట్‌తో ‘ద్రౌపదిరెడ్డీ... ద్రౌపది రెడ్డీ’ అని గట్టిగా పిలిచారు. వీటన్నింటినీ మించిన జ్ఞాపకం సెర్బియాలో జరిగింది. సెర్బియా– టర్కీ టూర్‌లో బెల్‌గ్రేడ్‌లో ప్రదర్శన, విపరీతమైన చలి.
నాట్యం చేసేటప్పుడు పాదరక్షలేవీ ఉండవు కదా. నాట్యం ఎలాగో చేసేశాను. కానీ ఫెలిసిటేషన్ సమయంలో పాదాలు నేల మీద ఆన్చలేకపోయాను. ఒక పాదం నేల మీద ఉంటే మరో పాదం నేలను తాకకుండా పాదాలను మార్చుకుంటూ ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి తన కోటు తీసి నేల మీద పరిచి ఆ కోటు మీద నిలబడమన్నాడు. ఇవన్నీ ఈ నాట్యం ఇచ్చిన మధురానుభూతులే కదా! ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారైతే ‘రుక్మిణి– కృష్ణ’ ప్రదర్శన చూసి ‘దిస్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ డ్రామా ఐ హావ్ సీన్’ అంటూ ‘న్యత్యభారతి’ అని ప్రశంసించారు. అంతకంటే ఇంకేం కావాలి. నేను అందుకున్న అవార్డులు ఇచ్చిన సంతోషానికి మించిన ఆనందక్షణాలివి. ఎస్పీబీగారు మెసేజ్‌లు పెట్టరు. మాట్లాడి వాయిస్ రికార్డు పంపిస్తారు. అలా నాకు పంపిన వాయిస్ రికార్డులన్నీ దాచుకున్నాను.
నాట్యమే ఊపిరి
నాకు హాబీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నాట్యం చేయడం, కొత్త ప్రయోగాల గురించి ఆలోచించడం, నాట్యం గురించి మాట్లాడడం... ఇష్టం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏ మధ్య రాత్రిలోనో ఓ కొత్త ఐడియా వస్తుంది. అప్పుడే ఆ ఐడియాను పేపర్ మీద రాసుకుని, నాట్యం చేస్తూ ఫోన్‌లో రికార్డు చేసుకోవడం, ఉదయానికంతా కొత్త రూపకాన్ని సిద్ధం చేయడం నాకలవాటు. కోవిడ్ సందర్భంగా రూపకం, ప్రకృతి సంరక్షణ కోసం ప్రకృతి రక్షతి రక్షితః, శాంతి జీవనం, రితు సంహార, తెలంగాణ వైభవం, వైద్యో నారాయణో హరి... వంటివన్నీ అలా రూపొందినవే.
ఆరోగ్యం పెట్టిన పరీక్ష
మహిళలకు అందరికీ మల్టీ టాస్కింగ్ వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఇల్లు, పిల్లలను ఒకవైపు తన వృత్తి ప్రవృత్తులను మరో వైపు బాలెన్స్ చేసుకోవడంలో సక్సెస్ అవుతాం. కానీ తల్లిగా నేను బిడ్డ దగ్గర ఉండాల్సిన క్షణాల్లో ఉండలేకపోయానే అనే గిల్ట్ పారిస్ టూర్ సమయంలో ఎదురైంది. నిజానికి ఆ టూర్ రెండు రకాలుగా పరీక్ష పెట్టింది. బయలుదేరే సమయానికి పాపకు జ్వరం. అలాగే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇరవై ప్రదర్శనలిచ్చాం. ఒకరోజు నాకు నాలుగు నూట నాలుగు జ్వరం. మందులు వేసుకున్నా కూడా కంట్రోల్ కాలేదు. మేకప్ వేసుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. నిలబడితే కాళ్లు వణుకుతున్నాయి. ఆర్గనైజర్స్ మొత్తం సిద్ధం చేశాక ‘నాకు జ్వరం, డాన్స్ చేయలేను’ అనడానికి మనసొప్పుకోలేదు. ఆర్కెస్ట్రా వాళ్లతో ‘ఒకవేళ నేను కళ్లు తిరిగిపడిపోతే వెంటనే లైట్లు ఆఫ్ చేయండి’ అని చెప్పి నాట్యం మొదలుపెట్టాను. పళ్లెం మీద నాట్యం అది. ఆ నటరాజే నాతో చేయించాడని నమ్ముతాను ఇప్పటికీ’’ అంటూ కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు దీపికారెడ్డి.
అమ్మమ్మ తాతయ్యల పెంపకం
దీపికారెడ్డి తాత నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. తండ్రి వీఆర్ రెడ్డి న్యాయవిద్యలో సంస్కరణలు తెచ్చిన విద్యావేత్త, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు ఆర్థిక బాధలు లేవు. కానీ, పేదరికం తెచ్చే కష్టాలు తెలుసన్నారామె. ‘‘వరంగల్‌లో తాతగారింట్లో పెరగడం వల్ల పేదవాళ్లకు ఆయన చేసిన సహాయాన్ని స్వయంగా చూశాను. నాట్య సాధన కోసం కొంతకాలం మా గురువుగారు వెంపటి చినసత్యం గారింట్లో ఉన్నాను. వాళ్లు నన్ను చాలా బాగా చూసు కున్నారు. అక్కడ నాట్యంతోపాటు చక్కటి డిసిప్లిన్ కూడా అలవడింది. నేలమీద పడుకోవడం, బావిలో నీరు తోడటం అలవాటయ్యాయి. తాత గాంధేయవాది.
మమ్మల్ని అధికారిక వాహనాల్లో తిరగనివ్వలేదు. మా ప్రయాణం సైకిల్ రిక్షా, సిటీ బస్సులోనే. అమ్మమ్మ, తాత, గురువుగారు... ఈ ముగ్గురి స్ఫూర్తితో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నా శిష్యులకూ అదే నేర్పాను. నాట్యం నేర్చుకోవడానికి ఫీజు కట్టలేని అమ్మాయిలకు ఫ్రీగా నేర్పిస్తున్నాను. దేశం నలుమూలలా ప్రదర్శనలిచ్చాను, అలాగే విదేశాల్లోనూ. నా శిష్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, డాన్స్ స్కూళ్లు నడుపుతూ కళాకారులను తీర్చి దిద్దుతున్నాను. కళ ఎంతగొప్పదంటే కళాకారులు గురువును మర్చిపోరు. గురుపూర్ణిమ రోజు వచ్చిన మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వడానికి సమయం సరిపోలేదు. ప్రదర్శన ఉన్న రోజుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వేడుకలకు వెళ్లలేకపోయేదాన్ని. నాట్యం కారణంగా దూరమైన సంతోషాలకంటే నాట్యం కారణంగా అందిన సంతోషాలే ఎక్కువ’’ అన్నారామె.
నటరాజు కొలువైన ఆలయం
జూబ్లీ హిల్స్‌లో ఉన్న ‘దీపాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ లో అడుగుపెట్టగానే దీపికారెడ్డి యాభై ఏళ్ల నాట్యప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారమైనట్లు ఉంటుంది. ఆమె గురువు వెంపటి చినసత్యం ఫొటో, 1976లో రంగప్రవేశం చేసినప్పటి ఫొటోతో మొదలు జ్ఞానపీఠ సినారె, ఇద్దరు రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధాని, ఐదుగురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్పీకర్‌లు, రాష్ట్రమంత్రుల చేతుల మీదుగా అందుకున్న పురస్కారాల చిత్రాలు కొలువుదీరి ఉన్నాయి. నాట్యం చేస్తున్న పరమశివుడి విగ్రహం నిత్యపూజలందుకుంటోంది. ఆమె శిష్యులు నేడు రవీంద్రభారతిలో ఇవ్వా ల్సిన ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు.
అమ్మానాన్నల సంతోషం!
అత్యంత సంతోషకరమైన క్షణాలలో మొదటగా చెప్పాల్సింది సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకోవడమే. రాష్ట్రపతి భవన్‌లో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు మా అమ్మానాన్న కళ్లలో సంతోషం చూశాను. అమ్మానాన్నలు అంతగా సంతోషపడిన ఆ సందర్భమే నాకు మరపురాని క్షణం. ఇక ఎప్పుడూ సంతోషపడే విషయం ఏమిటంటే భర్త, పిల్లలు నాకు ప్రోత్సాహమిస్తూ సపోర్టుగా ఉండడం. తల్లిదండ్రులకు నేను చెప్పేదొక్కటే. పిల్లలకు సంగీతం, నాట్యం... ఏదో ఒక కళను సాధన చేయించండి. అది జ్ఞాపకశక్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సాధనతో ఏకాగ్రత అలవడుతుంది. ఏ రంగంలో అయినా చక్కగా రాణించగలుగుతారు. నా స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ హోల్డర్సే. అలాగే కళ కోసం చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
– దీపికారెడ్డి, చైర్‌పర్సన్, సంగీత నాటక అకాడమీ, తెలంగాణ
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : గడిగె బాలస్వామి
Comments
Please login to add a commentAdd a comment