ప్రతీకాత్మక చిత్రం
వారంలో ఓ రోజు ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ అన్నింటికీ సెలవు ప్రకటించి తీరాలి. మెదడుకు రెక్కలు విచ్చుకుని విహరించే అవకాశం కల్పించాలి. ఒకేసారి రోజంతా అన్ని స్క్రీన్‌లకూ ఆఫ్ అంటే కొంత కష్టం కావచ్చు. టీవీ, కంప్యూటర్‌లైతే మన చేతిలోనే ఉంటాయి. ఫోన్ కాల్స్ మన చేతిలో ఉండవు. ఇంట్లో ఒక ఫోన్ స్విచాఫ్‌లో ఉంటే ‘ఫోన్ ఆఫ్‌లో ఉందేమిటి’ అంటూ మరొకరి ఫోన్‌కు కాల్స్ వస్తుంటాయి.
కాబట్టి మొదట్లో ఒక గంటతో మొదలు పెట్టండి. రెగ్యులర్‌గా ఫోన్ చేసే స్నేహితులు, బంధువులకు ‘ఇది స్విచాఫ్ అవర్’ అని మెసేజ్ పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. గంటతో మొదలు పెట్టి క్రమంగా ‘స్విచాఫ్ డే’గా మార్చాలి. ‘స్విచాఫ్ డే’ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే రోజవుతుంది. కుటుంబ బంధాలు ఆనందాల హరివిల్లుగా మారుతాయి.
అనగనగా ఓ రోజు కాదు. ఈ ఆధునిక కాలంలోనే ఓ రోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది. వారంలో ఓ రోజు పనికి సెలవు తీసుకున్నట్లే ఇది కూడా. పనికి దూరంగా ఉన్నట్లే ఫోన్‌కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? మెదడు ఓపెన్ అవుతుంది. సొంతంగా ఆలోచించడం మొదలవుతుంది. ఒకదానితో మరొక విషయాన్ని బేరీజు వేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ మాత్రపు ఖాళీని మెదడుకు ఇచ్చి చూద్దాం.
సెలవు రోజు ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా ఆర్డర్ చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఆ రోజుకు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి కాలనీలో రోడ్లన్నీ చుట్టి వస్తే... మనం నివసించే ప్రదేశం ఎలా ఉందో తెలుస్తుంది. కొత్తగా కడుతున్న ఓ భవనం కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఏముండేది? ఓ ప్రశ్న మదిలో మెదలుతుంది. కానీ సమాధానమే తట్టదు.
గడచిన పదేళ్లుగా ఇదే కాలనీలో ఉన్నప్పటికీ వారంలో పది–పదిహేను సార్లు ఇదే దారిలో ప్రయాణించినప్పటికీ మనం ఈ ప్రదేశానికి చిరపరిచితులం కాలేకపోయామా అనే సందేహం కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి మనం చిరపరిచితులయ్యాం, కానీ మనకే ఈ ప్రదేశం చిరపరిచితంగా మారలేకపోయింది. ఒక్క రోజైనా చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుని ఈ దారిలో నడిచి ఉంటే కదా! ఏ విషయమైనా మెదడు గ్రహింపునకు వచ్చేది. అనుక్షణం కళ్లు, చెవులు, మెదడు ఫోన్‌తో ఎంగేజ్ అయి ఉంటాయి.
అలవాటు పడిన దారిలో దేహం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా టీవీ స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచంలోని విషయాలన్నింటినీ మెదడులోకి గుప్పించడంలోనే రోజు పూర్తవుతుంటే... ఇక మెదడు సొంతంగా ఆలోచించేదెప్పుడు? ఆ మాత్రం వెసులుబాటు దొరికినప్పుడే మెదడు తన సృజనాత్మకతను బయటపెడుతుంది.
చదవండి: Health Tips: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా.. అయితే.. అందులోని ఆ గుణం వల్ల..
Comments
Please login to add a commentAdd a comment