జాతరలు, మేలాల సందర్భంగా కొంతమంది తప్పిపోవడం, కుటుంబం నుంచి విడిపోవడం లాంటి అనేక సంఘటనలు గతంలో చాలా చూశాం. ఇలాంటి ఉదంతాలపై అనేక సినిమాలు కూడా రూపొందాయి. లక్షల జనసమూహంతో ప్రజలు ఒకచోట చేరే మహాకుంభ్ మేళా ఉత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో తప్పిపోకుండా ఉండేందుకు ఒక జంట స్పెషల్ సొల్యూషన్ వెదుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025కు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. 144 సంవత్సరాల తర్వాత, పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ ధార్మిక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తేతమ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
'లవ్ ఎట్ ఇట్స్ పీక్'
కుంభమేళాకు వచ్చిన వీరు తాము తప్పిపోకుండా ఉండేందుకు ఒకరికొకరు తాడుతో కట్టేసుకున్నారు. భారీ జనసమూహం మధ్య, తాము కనెక్ట్ అయ్యేలా, విడిపోకుండా చూసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దృశ్యాలు పలువుర్ని విపరీతంగా ఆకర్షించాయి. మహిళ తన తలపై ఏదో బరువు మోస్తోంది. వెనక కాస్త పెద్దవాడిగా కనిపిస్తున్న పురుషుడు వెడుతున్నాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్‌మారింది.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ- @log.kya.sochenge లో ఇది షేర్ అయింది.మహా కుంభ్‌కు హాజరైన ఒక జంట ఐక్యంగా ఉండేలా చూసుకోవడానికి తమను తాము తాడుతో కట్టుకున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ, భక్తి అందర్నీ ఆకర్షించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభ్‌లో ఇటువంటి హృదయపూర్వక దృశ్యాలు ఐక్యతాసారాన్ని ప్రతిబింబిస్తాయంటూ ఈ పేజ్ పేర్కొంది. ఇప్పటికే ఇది 40.1 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట క్రియేటివిటికీ, ప్రేమకు ముగ్ధులై పోయారు. ‘‘పొద్దున్నలేస్తే సెలబ్రిటీల విడాకుల వార్తలతో విసిపోతున్న మనకు ఈ రకమైన క్లిప్‌లు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నాయి” అని ఒకరు, "ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు’’ అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment