
రాష్ట్రంలోనే పేరుగాంచిన కురవి వీరభద్రుడు
ఆదిశైవ ఆచారం ప్రకారం పూజలు
పొర్లుదండాలు,ప్రాణాచారం (పానసారం) వరాలు
భద్రకాళికి బోనం చేస్తే గండాలు తొలగుతాయి
గిరిజన, గిరిజనేతరుల దేవుడుగా వీరన్న
గిరిజనులు, గిరజనేతరులు ఉమ్మడిగా కొలిచే దేవుడు కురవి వీరభద్రుడు. వీరన్నా అని శరణు కోరితే కోరికలు నెరవేరతాయని, గండాలు తొల గుతాయని, భూతపిశాచాలు వదులుతాయనీ విశ్వాసం.. ఇక్కడ పూజలు, భక్తుల మొక్కులు చెల్లించడం, వాటిని నెరవేర్చేందుకు చేసే పూజలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రతిఏటా శివరాత్రి నుంచి మొదలుకొని మూడు నెలలపాటు జరిగే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు..
శైవాగమం...
శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదిశైవులు శైవాగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం సంపూర్ణాభిషేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు.
అన్నపూజా కార్యక్రమం...
ప్రతి దేవాలయంలో శివుడికి నైవేద్యం, పండ్లు పెడతారు. కానీ ఇక్కడ పెరుగు, అన్నం కలిపి శివలింగానికి అలంకరణ చేస్తారు. ఇలా చేస్తే వీరభద్రుని కొలిచే భక్తులకు బాగా పంటలు పండుతాయని, అన్నం లోటు లేకుండా చూస్తాడని నమ్మకం. కరువు కాటకాలు వచ్చిన సందర్భాల్లో కూడా కురవి వీరభద్రుని భక్తులు ఏనాడు ఇబ్బందులు పడలేదని, అంతావీరన్న మహిమ అంటారు భక్తులు.
భద్రకాళికి బోనం...
కోరిన కోర్కెలు తీరడంతో వీరభద్ర స్వామికి ఉపవాసాలు, నియమాలతో పూజలు నిర్వహించిన భక్తులు.. స్వామివారి పూజ ముగియగానే పక్కనే ఉన్న భద్రకాళీ అమ్మవారికి బోనాలను సమర్పించుకుని నైవేద్యం పెడతారు. అలాగే ఏటపోతులు, కోళ్లను బలి ఇచ్చి మొక్కు చెల్లించుకుంటారు.
పొర్లుదండాలు, పానసారం...
పిల్లలు లేనివారు సంతాన్రపాప్తి కోసం స్నానం చేసి తడిదుస్తులతో ఆలయ ఆవరణలో పానసారం పట్టి స్వామివారిని వేడుకుంటారు. అలాగే పొర్లుదండాలు పెట్టడం, భూత పిశాచాలు పట్టిన వారు, అనారోగ్యానికి గురైన వారు సైతం తడిబట్టలతో పానసారం పట్టి, ధ్వజస్తంభం ఎక్కించి కట్టివేస్తారు.
కోరమీసం పెడితే గౌరవం...
కోరమీసం సమర్పిస్తే గౌరవం, అధికారం కల్గుతుందనేది నానుడి. అందుకోసమే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు, ఉద్యోగ దరఖాస్తు చేసేటప్పుడు. వ్యాపారులు తమ వ్యాపారప్రారంభించేటప్పుడు, విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు చేసే ప్రయత్నానికి ముందు.. కురవి వీరభద్రునికి కోరమీసం సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరికలు తీరగానే బంగారం లేదా వెండితో కోరమీసాల ఆకృతి తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారు.
కళ్యాణ బ్రహ్మోత్సవాల వివరాలు
ఫిబ్రవరి 25, మంగళవారం
ఉదయం 9–00 గంటలకు పసుపు కుంకుమలు. ఆలయ పూజారి ఇంటినుంచి పసుపు కుంకుమలు రావడంతో జాతర పనుల ఆరంభం. సా. గం. 7కు గణపతిపూజ, పుణ్యాహవచనం పంచగవ్య్రపాశన, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణం. రాత్రి 10 గంటలకు
బసవముద్ద.
26 బుధవారం మహాశివరాత్రి.
ఉదయం 4–00ల నుండి స్వామివారి దర్శనం. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 వరకు పూర్ణాభిషేకం, సాయంత్రం 4 నుండి శ్రీ స్వామివారు అలంకారంతో దర్శనం, పాదాభిషేకం, శివాలయంలో ఉదయం 5 నుంచి, రాత్రి 12 వరకు శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకాలు. సాయంత్రం 7కు గ్రామసేవ, ఎదురుకోలు. రాత్రి గం 12–30కు శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం
27 గురువారం, 28 శుక్రవారం
నిత్యం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ.. సాయంత్రం 6 గంటలకు హోమం, సేవలు, గ్రామసేవ
మార్చి 1, శనివారం ఉదయం 6 నుంచి 12వరకు అభిషేకాలు సాయంత్రం 6–30 గంటలకు తెప్పొత్సవం (కురవి పెద్ద చెఱువు నందు)
3, సోమవారం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ సాయంత్రం 6 గంటలకు రథోత్సవం,
మంగళవారం ఉదయం 10–30కు పూర్ణాహుతి.
సాయంత్రం 4గంటలకు బండ్లు తిరుగుట, పారువేట. రాత్రి 10–00 గంటలకు ద్వజ అవరోహణ, బసవముద్ద.
– ఈరగాని భిక్షం
సాక్షి, మహబూబాబాద్/కురవి
Comments
Please login to add a commentAdd a comment