ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రాముఖ్యత ఇదే.. | Maha Shivratri 2022: Significance Of Dwadasha Jyothirlingalu Check Details | Sakshi
Sakshi News home page

Maha Shivratri 2022: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రాముఖ్యత ఇదే..

Published Sun, Feb 27 2022 5:15 PM | Last Updated on Sun, Feb 27 2022 5:31 PM

Maha Shivratri 2022: Significance Of Dwadasha Jyothirlingalu Check Details - Sakshi

శివుడు భోళాశంకరుడిగా, భక్త వశంకరుడిగానూ ప్రసిద్ధుడు. భస్మాసురుడికి సైతం వరాలిచ్చేంత భోళాతనం శివుడికే చెల్లింది. కఠిన నియమాలను పాటించనక్కర్లేదు. నిండుమనసుతో పూజిస్తే చాలు, భక్తులను ఇట్టే అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే.  కన్నప్పను కటాక్షించిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్తసులభుడు. శివుడు సనాతనుడు. వేదాలు శివుడిని రుద్రుడిగా ప్రస్తుతించాయి. 

నిజానికి వేదకాలానికి ముందే శివారాధన వ్యాప్తిలో ఉండేదనేందుకు ఆరాధారాలు ఉన్నాయి. పురాణేతిహాసాల్లో శివుని మహిమను వెల్లడించే గాథలు విరివిగా కనిపిస్తాయి. శివుని గాథలన్నింటినీ క్రోడీకరించిన శివపురాణం శైవులకు ఆరాధ్యగ్రంథం. 

మాఘ బహుళ చతుర్దశి రోజున క్షీరసాగరమథనంలో పుట్టిన గరళాన్ని తన కంఠంలో బంధించి శివుడు లోకాలను రక్షించాడు. అందుకే ఈ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ మహాశివరాత్రి శైవులకు అత్యంత పవిత్ర పర్వదినం. భారతదేశం నలుచెరగలా పురాతన శైవక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. వీటికి తోడు దేశంలో దాదాపు ప్రతిగ్రామంలోనూ శివాలయాలు కనిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ శైవక్షేత్రాలే కాకుండా, ఊరూరా వెలసిన శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. నమక చమక స్తోత్రపారాయణాలతో హోరెత్తుతాయి. మహాశివరాత్రి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసం, జాగరణ చేస్తూ రోజంతా శివనామ స్మరణలో గడుపుతారు. యథాశక్తి ఆలయాల్లో అభిషేక, అర్చనాది సేవలు జరిపిస్తారు. 

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్‌
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్‌
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్‌
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్య్రంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి

ఇది జ్యోతిర్లింగ స్తోత్రం. ఇందులో ప్రస్తావించిన క్షేత్రాలు: సోమనాథ క్షేత్రం సౌరాష్ట్ర– అంటే గుజరాత్‌లోని గిర్‌సోమనాథ్‌ జిల్లాలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మల్లికార్జున క్షేత్రం ఉంది. ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారు. మహాకాళేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనే నర్మదాతీరంలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ ఒకే శివలింగం రెండు భాగాలుగా ఉండి, ఓంకారేశ్వర, అమలేశ్వర అనే రెండు పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటుంది. బిహార్‌లోని దేవగఢ్‌ జిల్లాలో బైద్యనాథ క్షేత్రం ఉంది. క్షీరసాగర మథనం తర్వాత ధన్వంతరి అమృతాన్ని ఇక్కడి శివలింగంలోనే భద్రపరచాడని ప్రతీతి. మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమశంకర క్షేత్రం ఉంది. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు ఇక్కడ విశ్రమించాడని పురాణాల కథనం.

తమిళనాడులోని సాగరతీరాన రామేశ్వర క్షేత్రం ఉంది. రావణసంహారం తర్వాత శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణం చెబుతోంది. మహారాష్ట్రలోని దారుకావనంలో నాగేశ్వర క్షేత్రం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన విశ్వేశ్వర క్షేత్రం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగం చిన్నగుంటలా ఉంటుంది. అందులో మూడుబొటన వేళ్లలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా మూడు చిన్న లింగాలు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లో మందాకినీ నది సమీపంలో హిమాలయాల్లో కేదారేశ్వర క్షేత్రం ఉంది. మంచుకారణంగా ఏడాదికి ఆరునెలలు మాత్రమే ఇందులో భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్‌ జిల్లాలో ఎల్లోరా గుహల సమీపంలో ఘృష్ణేశ్వర క్షేత్రం ఉంది.

చదవండి: అతడూ ఆమె: ‘ఒసేయ్‌..నా కళ్లజోడు తెచ్చివ్వు’! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement