భర్త రాజ్ కౌశల్‌తో మందిరా బేడీ
ఎంత ఏడ్చినా ఇంటి దగ్గరే ఏడ్వాలి. ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ దగ్గరే మొత్తుకోవాలి. చివరి యాత్ర మొదలుకాక ముందే స్త్రీల అనుబంధం ముగుస్తుంది మన సమాజంలో. అంతిమ సంస్కారాలలో పాల్గొనే హక్కు ఆమెకు లేదా? నటి మందిరా బేడీ తన భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. దానికి జవాబూ చెబుతున్నారు. అంతిమ వీడ్కోలు చెప్పే హక్కు స్త్రీలకు ఎందుకు లేదు అనేది ఇప్పుడు ప్రశ్న.
2018లో వారణాసిలో ఒక ఘటన జరిగింది. ఆ ఊళ్లో నివాసం ఉండే 95 ఏళ్ల సంతోరి దేవి కొన ఊపిరితో ఉండగా తాను మరణించాక అంతిమ సంస్కారాలు కుమార్తె పుష్పవతి పాటిల్ చేయాలని కోరింది. అంతే కాదు తన బంధువుల్లోని స్త్రీలే అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలని చెప్పింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్క కూతురు పుష్పవతి పాటిల్. ఇద్దరు కొడుకులు ఉన్నా కూతురే ఎందుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి అనంటే ‘మగవాళ్లకే ఆ హక్కు ఉండటం నాకు ఇష్టం లేదు’ అని ఆ పెద్దావిడ చెప్పింది. ఆమె పిల్లలను అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా పెంచింది. అందుకే మరణించాక కూతురే దహన కర్మలు నిర్వహించింది. సోదరులు అందుకు మద్దతుగా నిలిచారు. ఈ వార్త గొప్ప ప్రచారం పొందింది.
దక్షణాదిలో కూడా రెండు మూడు సందర్భాలలో కూతుళ్లే చితి మంట పెట్టడం వంటి వార్తలు వచ్చాయి. ఇటీవల కరోనా సమయంలో తండ్రి పాడెను మోసిన కుమార్తెల చిత్రాలు వచ్చాయి. దుఃఖ సమయంలో ఎవరి దుఃఖ ప్రకటన వారిదిగా ఉంటుంది. కొందరు తమ వారిని చిట్టచివరి క్షణం వరకూ చూసుకోవాలని అనుకోవచ్చు. దగ్గరగా ఉండి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారి ఆత్మలు సంతృప్తి పడతాయి అనుకోవచ్చు. లేదా తమకు శాంతి అనుకోవచ్చు. అది వ్యక్తిగతం. కాని అది సామాజికం అని ఇతరుల స్పందన వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మందిరా బేడి విషయంలో అదే అయ్యింది.
భర్త అంతిమ సంస్కారాల సమయంలో ..
నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది...
నటి మందిరా బేడీ భర్త, దర్శకుడు అయిన రాజ్ కౌశల్ జూన్ 30న 49 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించాడు. ఇలాంటి సంఘటన ఎవరికైనా చాలా పెద్ద విషాదమే. మందిరా బేడికి ఇద్దరు సంతానం. ఆ దంపతులు ఆ సంతానంతో దిగే ఫొటోలు, పిల్లల గురించి మందిరా చెప్పే విశేషాలు సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూస్తూనే వచ్చారు. అలాంటిది సడన్‌గా భర్త చనిపోవడం చాలా పెద్ద షాక్‌కు గురి చేసి ఉంటుంది మందిరాకు. ఆమె భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొంది. పాడె ముందు నిప్పుకుండ పట్టుకుని నడిచింది. చితి మండే వరకూ దహనవాటికలోనే ఉంది. అయితే ఈ ఫొటోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చాయో విమర్శలు మొదలయ్యాయి నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది అని.
ఆ బట్టలు ఏమిటి?
‘స్త్రీలు దుఃఖాన్ని నిభాయించుకోలేరు... అంతిమ సంస్కారాలు చూడలేరు... ఆ సమయంలో వారు పాల్గొంటే చనిపోయిన వారి ఆత్మకు సద్గతి లభించదు’... అని కామెంట్లు వచ్చాయి. సరే.. అవి సంప్రదాయవాదుల కామెంట్లు అనుకున్నా కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఆ బట్టలేమిటి అని కూడా అన్నారు. ఆ సమయంలో మందిర జీన్స్ ప్యాంట్, వైట్ టాప్ వేసుకుని ఉండటమే ఇందుకు కారణం అట. స్త్రీలు వెళ్లడానికి అనుమతి లేని చోట వెళ్లకపోవడమే కరెక్ట్ అని విమర్శలు వచ్చాయి.
ఆ మాట చెప్పడానికి మీరెవరు?
అయితే మందిరా మీద ఇలాంటి అటాక్ మొదలైన వెంటనే మహిళా వాదులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. స్త్రీలు ఎలా దుఃఖపడాలో, ఏ మేరకు దుఃఖ పడాలో, ఆప్తుల మరణంలో ఏ చర్యలు చేయాలో చేయకూడదో మగవాళ్లు ఎంత కాలం డిసైడ్ చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. గాయని సోనా మహాపాత్ర, టీవీ యాంకర్ మిని మాథుర్ వీరిలో ఉన్నారు. ‘దుఃఖంలో ఉన్న స్త్రీని అనడానికి వీరెంత బుద్ధిలేనివారో అనిపిస్తోంది’ అని వారు అన్నారు. టెలివిజన్ నటి శ్వేతా తివారి అయితే ‘మందిరా... మేము నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని వ్యాఖ్యానించింది. డాన్సర్ ముక్తి మోహన్ ‘మానవాళిలో సగం మనం. కాని ఇప్పటి వరకూ ఈ సగానికి సరైన మర్యాద, గౌరవం దక్కలేదు. మనల్ని మనమే దెబ్బ తీసుకున్నాం. అందరూ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. మనం ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు’ అని వ్యాఖ్యానించింది.
కొరివి పెట్టే కొడుకు పుట్టాలనుకునే రోజులు పోయి ఒక్క అమ్మాయి పుడితే సంతోషపడి బాగా పెంచుకుందాం అనుకుని ఆపరేషన్ చేయించుకున్నవారు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక్క అమ్మాయి ఉన్న ఇంటికి ఉన్న అంగీకారం ఆ ఒక్క అమ్మాయో లేదా భార్యో ఇటువంటి సందర్భాల్లో ఇది తన కర్తవ్యం అనుకుంటే అంగీకరించాల్సిన వాతావరణం ఏర్పడాల్సి ఉంది. స్త్రీలు ఏర్పరిచేలానే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment