పెద్దయ్యాక ఏమౌతావ్? పిల్లల్ని అడుగుతాం. వాళ్లకేం తెలుసు ఏమవ్వాలో?! ఏదో ఒకటి చెబుతారు. అవడానికి ఏమేం ఉన్నాయో.. ముందు మనం చెప్పాలి వాళ్లకు. శ్యామ్ చెబుతున్నాడు. యు కెన్ బి ఎనీ థింగ్’అంటూ.. పెద్దయ్యాక ఏమేం అవొచ్చో ‘ర్యాప్’ డ్యాన్స్‌తో చూపిస్తున్నాడు. శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు.
శ్యామ్ వైట్‌కి ఆరేళ్లు. నల్లవాళ్లబ్బాయి. ర్యాప్‌తో సీన్‌లోకి వచ్చాడు! ‘ఆల్ఫాబెట్ ర్యాప్’ అని.. వాళ్ల డాడీ శ్యామ్ పాడి, ఆడిన ఆ వీడియోకి పేరు పెట్టాడు. ఆఫ్రికన్ స్టెయిల్‌లో చేతులు, తల ఆడిస్తూ ఎ ఫర్ ఆర్కిటెక్ట్, బి ఫర్ బయోకెమిస్ట్.. అని శ్యామ్ తీసిన దిద్దనక రాగాల ర్యాప్‌ను చూసి మిషల్ ఒబామా కూడా నవ్వును ఆపుకోలేకపోయారు! వాడి ఫీలింగ్స్, ఆ ఊగడం అది.
‘‘నాకు తెలుసు. ఇవి ఒత్తిళ్లతో కూడిన కాలాలు. ఈ వీడియో నా ముఖంపై స్ట్రెస్‌ను పోగొట్టి నన్ను ఆహ్లాదపరిచింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మనమంతా మన కిడ్స్ కోసం ఒక్కక్షణం ఆగి ఆలోచించేలా చేస్తాడు శ్యామ్. భవిష్యత్తులో వాళ్లను ఎలా చూడాలని అనుకుంటున్నామో మనకో ఆలోచన ఉంటుంది. అయితే శ్యామ్ ‘ఎబిసి ర్యాప్’ వెర్షన్ వేరేలా ఉంది. తనేం అంటాడంటే.. ‘యు కెన్ బి ఎనీ థింగ్’ అంటాడు. అవును. పిల్లల్ని తమకు ఇష్టమైన కలను కనమని శ్యామ్ చెబుతున్నాడు’’ అని మిషెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
శ్యామ్ కెమెరాను చూస్తూ నిలబడి పాడుతుంటాడు. తండ్రి బాబీ వైట్ కొడుకు వెనుక బల్ల ముందు కూర్చొని బీట్ ఇస్తుంటాడు. అదొక లయబద్ధమైన స్ఫూర్తి గీతం. రెండున్నర నిముషాల క్లిప్. ఇలా మొదలౌతుంది.
ముందు తండ్రి అతడిని అడుగుతాడు. పెద్దయ్యాక ఏమౌతావ్ అని. ఏమైనా అవ్వొచ్చు అంటాడు శ్యామ్! ‘అంటే?’ అని తండ్రి అడుగుతాడు. ఇక శ్యామ్ ప్రారంభిస్తాడు. యు కెన్ బి ఎ ‘ఎ’.. యు కెన్ బి యాన్ ఆర్కిటెక్ట్! క్యాచ్ ఎ బిల్డింగ్ టు కిస్ ద స్కై. (నువ్వు ఆర్కిటెక్ట్ అవొచ్చు. ఆకాశాన్ని కిస్ చెయ్చొచ్చు.) యు కెన్ బి ఎ ‘బి’. యు కెన్ బి ఎ బయోకెమిస్ట్. మేక్ మెడిసిన్స్.. సేవ్ లైవ్స్. (నువ్వు బయోకెమిస్ట్ కావొచ్చు. మందులు కనిపెట్టి, ప్రాణలను నిలపొచ్చు). యు కెన్ బి ఎ ‘సి’. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. (నువ్వు సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావచ్చు. ప్రోగ్రామ్స్ రాయొచ్చు)... ఇలా ఎ టు జడ్.. ర్యాప్ సాగుతుంది. శ్యామ్ పాటకు, స్టెప్స్‌కి చక్కగా జోడీ కుదిరింది. కొరియోగ్రఫీ కూడా శ్యామ్‌దే! ఎ నుంచి జడ్ వరకు ఎలా చెప్పగలిగాడు అనిపిస్తుంది. కెమెరా వైపు చూస్తూ శ్యామ్ ర్యాప్ కొట్టడానికి టెలీ ప్రాంప్టరేం లేదు.
గుర్తుపెట్టుకున్నాడు! ర్యాపింగ్ నైపుణ్యాలను మధ్యమధ్య కుమారుడికి కొంత అద్దాడు తండ్రి. ‘యు కెన్ బి ఎ ‘డి’. ఎ డెంటిస్ట్. బికాజ్ ఎవ్రీబడీ లవ్స్ టు స్మైల్ అన్నప్పుడు.. నవ్వినట్లుగా పెదవులను సాగదీయమని చెబుతాడు. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌లో చివరికి వచ్చేసరికి ఎవరికైనా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. వీడియో చూస్తూ ఉన్నప్పుడు మనకూ అనిపిస్తుంది ఈ పిల్లాడు ఎక్స్, వై, జడ్‌లకు ఏం చెబుతాడో అని. జడ్ కి ‘జలస్‌లీ స్ట్రైవ్’ అంటాడు. అసూయతో రగిలిపోతూ కష్టపడి సాధించమని. ‘వై’కి యువర్ ఓన్ బాస్ అంటాడు. నువ్వే నీకు బాస్‌వి కమ్మని. ‘ఎక్స్’ ప్రత్యేకంగా చెప్పలేదు. సమ్ ‘ఎక్స్’.. ఏదైనా అవ్వు కానీ, సోమరిగా మాత్రం ఉండిపోకు అని చెబుతాడు. ర్యాప్ ముగియగానే తండ్రి ఆనందం పట్టలేక గట్టిగా పిడికిలితో బల్లను గుద్దుతాడు.
ఈ తండ్రీ కొడుకులది యు.ఎస్.లోని టెన్నెనీ రాష్ట్రంలోని మెంఫిస్. శ్యామ్ తన కడుపులో ఉండగా శ్యామ్ తల్లి పుస్తకాలు బాగా చదివారట. రెండేళ్ల వయసులోనే శ్యామ్ పుస్తకాలు చదివేందుకు ప్రయత్నించేవాడని కూడా ఈ ‘యు కెన్ బి ఎనీథింగ్’ ర్యాప్‌కి వచ్చిన స్పందనకు చూసి ఆ తల్లి ఉప్పొంగిపోతూ చెబుతున్నారు. స్టెఫానీ ఆమె పేరు. గత సెప్టెంబరులోనే శ్యామ్‌కు ఆరో ఏడు వచ్చింది. తండ్రి రాసి ఇచ్చిన ఏబీసీ ర్యాప్‌ను లిరిక్ లైన్స్ గుర్తుపెట్టుకుని పాడటానికి శ్యామ్ యాభైసార్లకు పైగా మననం చేసుకున్నాడు. ఇప్పటికింకా వైరల్ అవుతూనే ఉన్న ఈ వీడియోకు గత ఐదు రోజుల్లో యూట్యూబ్‌లో రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్‌బుక్‌లో మూడు లక్షలసార్లు షేర్ అయింది. నువ్వు ఏమైనా అవొచ్చు అంటున్న శ్యామ్.. ఇంతకీ తను ఏమవ్వాలని అనుకుంటున్నాడు? ఆర్కెటెక్ట్ అవుతాడట. ఆకాశాన్ని చుంబించే భవంతులకు ప్లాన్‌లు గీయడం కోసం.
Comments
Please login to add a commentAdd a comment