The Missing Dutch Girls In Panama 9 Years Ago Ongoing Mystery - Sakshi
Sakshi News home page

ఇప్పటికీ అంతు తేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ.. అడవిలో ఏం జరిగింది?

Published Sun, Jul 23 2023 12:56 PM | Last Updated on Sun, Jul 23 2023 5:21 PM

The Missing Dutch Girls In Panama 9 Years Ago Ongoing Mystery - Sakshi

అదో అందాల వనం.. చుట్టూ కొండకోనల సోయగం.. చిన్నగా పిలిస్తే ప్రతిధ్వనించేంత నిశ్శబ్దం.. పెద్దగా అరచినా ఉలకని నిర్మానుష్యం.. ఆ రోజు ఏమైందో.. అక్కడున్న ప్రతి చెట్టూ చేమకూ, వాగూ వంకకూ బాగా తెలుసు. కానీ ఆనవాళ్లు ఆధారాలై.. జరిగిన కథను చెప్పలేకపోయాయి. జరిగే ఫెరాన్నీ ఆపలేకపోయాయి. ఎంతో ఆహ్లాదంగా మొదలైన ఆ ప్రయాణం.. చివరికి అమానుషంగా ముగిసిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం బలైన క్రిస్‌ క్రెమర్స్‌(21), లిసానే ఫ్రూన్‌(22) అనే నెదర్లాండ్స్‌ యువతుల గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది!

2014 ఏప్రిల్‌ 1, మధ్యాహ్నం పన్నెండు తర్వాత.. క్రిస్, ఫ్రూన్‌లు కలసి.. పనామాలోని బోకేట్‌ మౌంటెన్స్‌ చుట్టూ ఉండే అడవుల్లో అడుగుపెట్టారు. అక్కడ తమకు ఆతిథ్యమ్చిన వారి పెంపుడు కుక్కను తమ వెంట తీసుకుని బయలుదేరారు. వీరిద్దరూ నెదర్లాండ్స్‌లోని అమెర్స్‌ఫోర్ట్‌కు చెందిన విద్యార్థినులు. ప్రాణస్నేహితులు కూడా. వెకేషన్‌ ఇంటర్న్‌షిప్‌కి సర్వీస్‌ ట్రిప్‌గా ఉపయోగపడే పనావ పర్యటన కోసం ఆరు నెలల క్రితమే ప్లాన్‌ చేసుకున్నారు. స్థానిక పిల్లలతో మాట్లాడటానికి, వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించడానికి స్థానిక భాషైన స్పానిష్‌నూ నేర్చుకున్నారు.

హైకింగ్, టూరింగ్‌తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించాలనే ఉద్దేశం ఉందని అప్పటికే వారు ఫేస్‌బుక్‌లో చర్చించారు. ఇద్దరూ కలసి అడవి అందాలను ఆస్వాదిస్తూ ఆ రోజు దిగిన కొన్ని సెల్ఫీలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ రోజు గడిచిందిది. అర్ధరాత్రి అయ్యేసరికి.. వారి వెంట వెళ్లిన కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాన్ని చూసి క్రిస్, ఫ్రూన్‌లు ఎక్కడైనా ఆగి ఉంటారని అభిప్రాయపడింది ఆ ఆతిథ్య కుటుంబం. ఏప్రిల్‌ 2న స్థానిక టూర్‌ గైడ్‌తో ఆ ఇద్దరు అమ్మాయిలకు అపాయింట్‌మెంట్‌ ఉంది. దానికి కూడా వాళ్లు రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆ ఆతిథ్య కుటుంబం.. అధికారులను అప్రమత్తం చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్య టీమ్‌.. అడవి చుట్టూ వివనంలో గాలింపు మొదలుపెట్టారు. స్థానిక గ్రామాలు, చుట్టుపక్కల కొండలను జల్లెడ పట్టారు. నాలుగు రోజులు గడిచినా వాళ్లు దొరక్కపోవడంతో వారి కుటుంబ సభ్యులు పనామా చేరుకున్నారు. నెదర్లాండ్స్‌ నుంచి డిటెక్టివ్‌లను వెంట తీసుకొచ్చారు. స్థానిక పోలీసులు, డాగ్‌ యూనిట్లతో కలసి పదిరోజుల పాటు.. ఆ అమ్మాయిల కోసం అడవుల్లో గాలించారు. రోజులు గడిచాయి తప్ప ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెల రోజుల తర్వాత ఒక మహిళ.. బోకేట్‌లోని నది ఒడ్డున.. ఓ బ్యాగ్‌ దొరికిందని తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింది. అది ఫ్రూన్‌ బ్యాగ్‌ కావడంతో అందరిలో ఆశాభావం మొదలైంది. అందులో ఇద్దరి ఫోన్లు, కెమెరా, కొన్ని చిన్న చిన్న వస్తువులతో పాటు 83 డాలర్లు దొరికాయి. ఫోన్‌లో డయల్‌ కాల్స్‌ చూసి షాకయ్యారు అధికారులు.

సుమారు నాలుగు రోజుల పాటు నెదర్లాండ్స్‌లోని ఎమర్జెన్సీ నంబర్‌ 112కి, పనామాలోని ఎమర్జెన్సీ నంబర్‌ 911కి కాల్‌ చేయడానికి 77 సార్లు ప్రయత్నింనట్లు ఆధారాలున్నాయి. సరైన సిగ్నల్స్‌ లేక ఏ ఒక్క నంబర్‌ కలవలేదని అర్థమైంది. మరి ఆ అమ్మాయిలకు ఏమైంది? వాళ్లు ఏమయ్యారు? ఇవే ప్రశ్నలు అందరినీ అయోమయంలో పడేశాయి. టెక్నాలజీ సాయంతో ఏప్రిల్‌ 6న క్రిస్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేయడానికి విఫలయత్నం జరిగినట్లు, ఏప్రిల్‌ 11 నాటికి, రెండు ఫోన్లు డెడ్‌ అయినట్లు రుజువులు సంపాదించారు పోలీసులు. ఇక కెమెరాలో ఫొటోలను పరిశీలిస్తే మరింత విస్తుగొల్పాయి. కాంటినెంటల్‌ డివైడ్‌కు సమీపంలో ఉన్న కాలిబాట వైపు వాళ్లు వెళ్లినట్లు ఏప్రిల్‌ 1న తీసుకున్న వరి ఫొటోలో ఉంది. అయితే ఆ తర్వాత వాళ్లు ఫొటోలేం తీసుకోలేదు. ఏప్రిల్‌ 8 తెల్లవారు జామున ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య.. తొంభైకి పైగా ఫ్లాష్‌ లైట్‌ ఫొటోలు ఉన్నాయి. అయితే అన్నీ అసంబద్ధంగా.. గజిబిజిగా ఉన్నాయి.

వాటిలో అన్ని కొండలు, బండరాళ్లు, మొక్కలు, చెల్లాచెదురైన బట్టలు ఇవే ఉన్నాయి. ఒకే ఒక్క ఫొటోలో మాత్రం క్రిస్‌ తల వెనుక భాగం ఉంది. అది కూడా రక్తమోడుతూ! అది చూసి షాకయ్యారు అధికారులు. ఈ లోపు దర్యాప్తు సంస్థలు.. బ్యాగ్‌ దొరికిన ప్రాంతాన్ని అణువణువూ వెతికించాయి. అప్పుడే క్రిస్‌ డెనిమ్‌ డ్రెస్‌ దొరికింది. రెండు నెలల తర్వాత ఎడమ కాలి షూ దొరికింది. అందులో తెగిన కాలు ఉంది. కాసేపటికి అదే నది ఒడ్డున చెల్లాచెదురుగా పడున్న ఎముకలు కూడా కనిపించాయి. డీఎన్‌ఏ పరీక్షల్లో అవన్నీ క్రిస్, ఫ్రూన్‌లకు చెందినవని వైద్యులు తేల్చారు. అయితే వారికి మరణం ఎలా సంభవింందో తెలియలేదు. క్రిస్‌ అవశేషాలు పూర్తిగా ఎముకలుగా మిగిలితే.. ఫ్రూన్‌ అవశేషాలు.. సగానికి పైగా కుళ్లిపోయి ఉన్నాయి. ఆ ఆధారాలను బట్టి ఫ్రూన్‌ కంటే ముందుగా క్రిస్‌ మరణింందని భావించారు. క్రిస్‌ మరణం తర్వాత సిగ్నల్‌ కోసం ఫ్రూన్‌ .. క్రిస్‌ ఫోన్‌ను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించి ఉంటుందని నమ్మారు అధికారులు.

క్రిస్, ఫ్రూన్‌ల మరణం వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుందని, ఎవరో నేరం చేసి తెలివిగా తప్పించుకుని ఉంటారని కొందరు నమ్మారు. ‘కెమెరాలో ఏప్రిల్‌ 1 తర్వాత వాళ్లు ఏ ఫొటోలు తీసుకోకపోవడం విచిత్రమని, ఏప్రిల్‌ 8న అసంబద్ధమైన ఫొటోలు ఉండటం కూడా అనుమానాస్పదమే’నని వారు భావించారు. దీన్ని ఆ అమ్మాయిల కుటుంబాలు కూడా నమ్మాయి. వీరి గాథ వింటుంటే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకరికొకరు సాయం అనుకుని ఆనందంగా గడపడానికి వెళ్లారు.

కానీ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఒకవేళ ట్రెకింగ్‌లో ఏ కొండ మీద నుంచో పడిపోయి ఉంటారని కొందరు, క్రూర మృగాలు దాడి చేసి ఉంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఈ వ్యథకు హారర్‌ రంగులద్ది హడలెత్తించారు. అంత పెద్ద అడవిలో సాయం చేసేవారు లేక.. ఏదైనా ప్రమాదం జరిగి, కదల్లేని స్థితిలో.. ఎంత నరకం అనుభవించి ఉంటారోనన్న ఊహ.. ఆ కుటుంబాలను మరింత క్రుంగదీసింది. ఒంటరిగా ఇద్దరు ఆడపిల్లలు అలాంటి అడవిలోకి వెళ్లడం సరికాదనే వారూ లేకపోలేదు. నిజానికి వారిని ఎవరైనా చంపేశారా? ప్రమాదవశాత్తు మరణించారా? అనేది ఇప్పటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన

(చదవండి: పోలీసులనే హడలెత్తించిన మిస్టరీ కేసు..అతడొస్తే.. వర్షం వచ్చేస్తుంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement