దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలో మూడు, నాలుగు వీధి కుక్కలు ఏడాదిన్నర బాలికను బలిగొన్నాయి. చుట్టుపక్కలవారు రక్షించే సమయానికే ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు బాధిత బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను దివాన్షిగా గుర్తించారు.
మృతురాలు దివాన్షి తుగ్లక్ లేన్‌లోని చమన్ ఘాట్ ప్రాంతంలో తన కుటుంబంతోపాటు ఉంటోంది. బాలిక తండ్రి రాహుల్ దుస్తులను ఇస్త్రీ చేస్తుంటాడు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తుంటాయని రాహుల్ సన్నిహితుడు వివేక్ కుమార్ తెలిపాడు. రాత్రి భోజనం చేశాక రాహుల్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. వారికి తమ కుమార్తె కనిపించలేదు. ఇంటికి కొంత దూరంలో రక్తపుమడుగులో ఆ చిన్నారి కనిపించింది. ఆ సమయంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి.
ఘటనాస్థలికి సమీపంలో డీజే ప్లే అవుతున్నదని స్థానికులు తెలిపారు. ఆ సందడిలో చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. చివరికి చుట్టుపక్కలవారు ఎలాగోలా కుక్కల బారి నుంచి ఆ చిన్నారికి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న జనం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంతలో ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి, బాధిత బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment