న్యూస్‌మేకర్
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య టీచరైన ఎం.ఎల్.అశ్విని తనకు వచ్చిన ఆరు భాషల వల్ల జన సామాన్యంలో చొచ్చుకుపోతూ బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించింది. కేరళలో మహామహులు పోటీపడిన కాసర్‌గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెను నిలబెట్టింది.
అశ్విని పరిచయం.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన కేరళ అభ్యర్థుల్లో కాసరగోడ్ అభ్యర్థి పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అభ్యర్థి పూర్వాశ్రమంలో ఒక మామూలు స్కూల్ టీచర్. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఊరు మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో కేవలం మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే ఆమెకే పార్టీ అధిష్టానం సీటు ఇచ్చింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. ఆమె పేరు ఎం.ఎల్.అశ్విని.
భాషతో గెలిచింది
కాసరగోడ మంగుళూరుకు దగ్గరగా ఉంటుంది. కన్నడిగులు కూడా ఇక్కడ ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఎం.ఎల్.అశ్విని కాసరగోడకు కోడలుగా వచ్చింది. ‘బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ. అన్నిభాషల వారూ ఉంటారు. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. చిన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు వచ్చింది. కన్నడ నా మాతృభాష. నా చుట్టుపక్కల తుళు కుటుంబాలు ఉండేవి. వారి నుంచి తుళు నేర్చుకున్నాను.
తమిళం కూడా బెంగళూరులోనే నేర్చుకున్నాను. కాసరగోడ వచ్చాక మలయాళం చాలా సులువుగా నేర్చుకున్నాను. హిందీ బాగా తెలుసు. ఇలా ఆరు భాషల్లో నేను అనర్గళంగా మాట్లాడగలను’ అంటుందామె. ఇంట్లో కూడా ఆమె తన భాషలను సాధన చేస్తానని చెప్పింది. ‘నేను నా భర్తతో తుళులో మాట్లాడతాను. నా భర్త, కొడుకు మలయాళంలో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి నేను కన్నడంలో మాట్లాడుకుంటాం. ఇలా అన్ని భాషలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి’ అంటుందామె. ఇన్ని భాషలు రావడం ఆమెకు మేలు చేసింది.
ఢిల్లీ వెళ్లాక
జాతీయ పార్టీలో ఢిల్లీలో కేంద్ర స్థానంలో ఉంటాయి. స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బి.జె.పిలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు ఢిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాలలో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు బలపరచడానికి ఆమెకు బాధ్యత అప్పగించింది. ‘ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు హిందీలోకాని, ఇంగ్లిష్‌లో కాని మాట్లాడటం సౌకర్యంగా భావిస్తారు.
కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారుకాని ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. నాకు రావడం లాభించింది’ అంటుంది అశ్విని. మహిళా మోర్చా తరఫున జమ్ము కశ్మీర్‌తో మొదలు ఉత్తరప్రదేశ్, అస్సాం వరకు ఆమె పని చేసినప్పుడు దిగువ శ్రేణి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్‌లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె భాషలతో చొచ్చుకుపోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పి.కె.కృష్ణదాస్‌ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది.
భాష గొప్ప సాధనం:
‘విజయానికి భాష గొప్ప సాధనం’ అంటుంది అశ్విని. ‘రాజకీయాలలో ప్రజలకు తెలిసిన భాషలో మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. నేను ఏ భాషలో అయినా మంచి ఉపన్యాసం ఇవ్వగలను. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది. భాషలు ఎన్ని తెలిస్తే అంత మంచిది’ అందామె.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్‌లో బి.జె.పి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏమవుతుందో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment