క్రిస్టల్‌ స్పెన్సర్‌ మర్డర్ మిస్టరీ? | mystery deaths of crystal spencer | Sakshi
Sakshi News home page

Mystery Death: క్రిస్టల్‌ స్పెన్సర్‌

Published Sun, Dec 15 2024 7:57 AM | Last Updated on Sun, Dec 15 2024 9:18 AM

mystery deaths of crystal spencer

‘టిన్సెల్‌ టౌన్‌’.. హాలీవుడ్‌ ప్లాట్‌ఫామ్‌కి అదో అద్భుతమైన వార ధి. అది చూపించే గ్లామర్, స్టార్‌డమ్‌ వంటి అబ్బురాలను తన కలగా మార్చుకుని, అడుగులు వేసిన క్రిస్టల్‌ స్పెన్సర్‌ అనే అమ్మాయి కథే ఈ వారం మిస్టరీ.

అమెరికా, కాలిఫోర్నియాలోని యూకియా నగరంలో క్రిస్టల్‌ పుట్టి పెరిగింది. తన ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. క్రిస్టల్‌కు ఇద్దరు సోదరులు. పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లి కష్టం చూడలేక, చదువు మానేసి ఉద్యోగంలో చేరి, సంపాదన మొదలుపెట్టింది.
యుక్తవయసు వచ్చేసరికి తన అందాన్ని మెచ్చేవాళ్లు, నటిగా ప్రయత్నించమని సలహా ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. దాంతో టిన్సెల్‌ టౌన్‌ ఆహ్వానాలను నమ్మి, తన ప్రతిభను నిరూపించుకోవడానికి లాస్‌ ఏంజెలెస్‌ చేరింది.

అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ, సుమారు మూడేళ్లపాటు నటిగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇంతలో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో, అయిష్టంగానే విమానాశ్రయంలోని వైల్డ్‌ గూస్‌ నైట్‌క్లబ్‌లో డాన్సర్‌గా చేరింది. ‘ఎంతో ఎదగాలని వచ్చి, సమాజమే తప్పుగా చూసే క్లబ్‌ డాన్సర్‌గా మారి, దిగజారిపోయా’ అని తన స్నేహితురాలు జూలీతో చెప్పుకుని బాధపడేది.

నటి కావాలనే ప్రయత్నంలో ఆమెకు ఆంటన్‌ క్లెయిన్‌ అనే స్క్రీన్‌ రైటర్‌ పరిచయమయ్యాడు. క్రిస్టల్‌ అందానికి, ప్రతిభకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన ఆంటన్‌.. ఆమె ఎప్పటికైనా మంచి నటి అవుతుందని నమ్మాడు. నాటినుంచి ఆమె అడుగులకు అతడు బాటలు వేయడం మొదలుపెట్టాడు. ఆర్ట్‌ గ్యాలరీలు, మ్యూజియమ్‌లు ఇలా ప్రతిచోటికీ వెంట తీసుకెళ్లేవాడు. కచేరీల్లో తనకున్న పరిచయాలను ఆమెకు అవకాశాలుగా మార్చడానికి ప్రయత్నించాడు. క్రమంగా వారి బంధం ప్రేమ, పెళ్లి అనే రెక్కలు తొడిగింది. ‘నేనొక క్లబ్‌ డాన్సర్‌ని అనే నిజం అతడికి చెప్పలేకపోతున్నా. చెబితే నన్ను చిన్నచూపు చూస్తాడేమో!’ అని జూలీ ముందు క్రిస్టల్‌ ఏడ్చేంది.

అయితే ఒక రాత్రి ఆంటన్‌ స్నేహితుడు.. ఆమెను క్లబ్‌లో చూసి, ఆ నిజాన్ని ఆంటన్‌కి చెప్పాడు. ముందే చెప్పనందుకు కలత చెందిన ఆంటన్‌.. క్రిస్టల్‌ని దూరం పెట్టేశాడు. కానీ ఆమె ప్రేమ ముందు అతడి కోపం చిన్నబోయింది. తిరిగి కలిశారు. క్రిస్టల్‌ని యాక్టింగ్‌ క్లాసులో చేర్పించాడు. నిజానికి క్రిస్టల్‌లో అతడికి నచ్చని ఒకే ఒక్క విషయం.. ఆమెకు డ్రగ్స్, ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉండటం. వాటికి దూరంగా ఉండమని చాలాసార్లు గొడవపడేవాడు.

ఒకరోజు ఆమెకు జపాన్‌ లోని ఒక నైట్‌క్లబ్‌లో ‘హోస్టెస్‌ గర్ల్‌’గా 3 నెలల పాటు పనిచేయాలంటూ పెద్ద ఆఫర్‌ వచ్చింది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే దానికి వెళ్లడమే మేలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మరునాడు తీవ్రమైన జ్వరంతో క్లబ్‌కి వెళ్లకుండా క్రిస్టల్‌ ఆమె అపార్ట్‌మెంట్‌లోనే ఉండిపోయింది. ఆ సాయంత్రం తన ల్యాండ్‌ ఫోన్‌ నుంచి ఆంటన్‌కి కాల్‌ చేసి, ‘జపాన్‌ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. అయితే మరునాటి నుంచి ఆమె ఫోన్‌ చేయలేదు. తిరిగి చేస్తుంటే కలవలేదు. సుమారు 2 రోజులు గడిచిపోయాయి.

 క్రిస్టల్‌ వర్క్‌ చేసే క్లబ్‌కి వెళ్లిన ఆంటన్‌..గత ఐదు రోజులుగా ఆమె క్లబ్‌కు కూడా రాలేదని తెలుసుకున్నాడు. జపాన్‌ ఆఫర్‌ను ఓకే చేసి, అక్కడికి వెళ్లి ఉంటుందిలే అనుకున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అతడికి పోలీసుల నుంచి కాల్‌ వచ్చింది. ‘క్రిస్టల్‌ని చివరిగా ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడావ్‌?’ అంటూ చాలా ప్రశ్నలకు ఆంటన్‌ నుంచి సమాధానాలు రాబట్టారు. తర్వాత ‘వారం క్రితం క్రిస్టల్‌ తన అపార్ట్‌మెంట్‌లోనే చనిపోయింది, దుర్వాసన వస్తోందని పొరుగువారు కంప్లైంట్‌ చేస్తే తలుపు పగలగొట్టి చూశాం. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టమ్‌కు పంపించాం’ అని చెప్పారు. ఆ వార్త విని ఆంటన్‌ హతాశుడయ్యాడు.

‘వారం క్రితం చనిపోయిందంటే క్రిస్టల్‌కి జ్వరం వచ్చాక కూడా ఆల్కహాల్, డ్రగ్స్‌ వంటివి తీసుకుని ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంది కాబోలు’ అనుకున్నాడు ఆంటన్‌. అయితే, క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే కొందరు అతడికి మరో షాకింగ్‌ విషయం చెప్పారు. ‘క్రిస్టల్‌ మృతదేహం ఇంట్లో ఒక మూలన పడుంది, ఆమె నడుముకు టెలిఫోన్‌ వైర్‌తో కట్టి, అర్ధనగ్నంగా ఉంది’ అని చెప్పడంతో ఆంటన్‌ తెల్లబోయాడు. వెంటనే పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ చూశాడు. అది మరింత షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే హైట్, వెయిట్‌ దగ్గర నుంచి చాలావిషయాలు క్రిస్టల్‌ని పోలిలేవు.

 బాడీ బాగా కుళ్లిపోవడంతో మరణానికి కారణం తెలియలేదని డాక్టర్స్‌ తేల్చేశారు. క్రిస్టల్‌ పక్క అపార్ట్‌మెంట్‌లో ఉండే ఒక జంట.. మరో నిజం చెప్పింది. సుమారు వారం క్రితం, ఒకరాత్రి క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి భీకరమైన ఏడుపులు, అరుపులు వినిపించాయని, ఎవరో ఎవరినో తీవ్రంగా హింసిస్తున్నట్లనిపించిందని, కానీ పోలీసులకు చెప్పాలంటే భయమేసి ఆగిపోయామని చెప్పారు. అంటే ఆ రోజు దాడి జరిగింది క్రిస్టల్‌ పైనేనా? లేదంటే క్రిస్టల్‌ను ఎత్తుకెళ్లి.. మరో అమ్మాయి మృతదేహాన్ని అక్కడ పెట్టారా? అనేది ఆంటన్‌కు అర్థం కాలేదు. కనీసం క్రిస్టల్‌ మృతదేహాన్ని అప్పగించాలని అధికారుల చుట్టూ్ట ఎంత తిరిగినా.. ఏవేవో కారణాలు చెప్పి, మృతదేహాన్ని అప్పగించలేదు. అసలు జపాన్‌ ఆఫర్‌ కూడా ఆమెను కిడ్నాప్‌ చేసే కుట్రలో భాగమా? అనే అనుమానం ఆంటన్‌కి వచ్చింది.

1988 మే 4న క్రిస్టల్‌ జ్వరం వచ్చి, ఆంటన్‌ను కలవకుండా, క్లబ్‌కి వెళ్లకుండా అపార్ట్‌మెంట్‌లోనే ఉండిపోయింది. మే 13న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుపై ఆంటన్‌ ప్రయత్నాలు తీవ్రం కావడంతో ఒకరోజు అతడికి ఒక బెదిరింపు కాల్‌ వచ్చింది. ‘కొన్నిసార్లు చెడిపోయిన అమ్మాయిలకు చెడు జరుగుతుంటుంది, అలాంటి వాటిని పట్టించుకుంటే, మనం ప్రమాదంలో పడతాం’ అనే సారాంశంతో ఫోన్‌ కట్‌ అయ్యింది. ఆ మాటలే ఆంటన్‌ అనుమానాలకు బలాన్నిచ్చాయి. అప్పుడే ఆంటన్‌ దృష్టి మాజీ కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్‌ అధికారి హోరేస్‌పై పడింది. నిజానికి క్రిస్టల్‌ పని చేసిన క్లబ్‌కి రహస్య యజమాని అతడేనని అప్పటికే పుకార్లున్నాయి. అతడు చాలా క్లబ్స్, బార్స్‌ను బినామీ పేర్లతో నడుపుతుంటాడని ఆంటన్‌ విచారణలో తేలింది.

 పైగా తన స్నేహితులను, వ్యాపార భాగస్వాములను అలరించడానికి తన క్లబ్స్‌లో పనిచేసే డాన్సర్స్‌ని నియమించేవాడని.. వారిలో క్రిస్టల్‌ కూడా ఉండొచ్చని కొందరు ఆంటన్‌కి చెప్పారు. మరోవైపు మెక్‌కెన్నాకి ఇంగ్లీవుడ్‌లోని ఒక గిడ్డంగిలో రహస్యంగా కసీనో కూడా ఉందని, డ్యూటీలో భాగంలో క్రిస్టల్‌ ఒకసారి అక్కడికి వెళ్లిందని.. ఆ తర్వాత ఆ అనధికారిక స్థావరం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే క్రిస్టల్‌ని మెక్‌కెన్నా చంపించి ఉంటాడని మరికొందరు చెప్పారు. అయితే వేటికీ సాక్ష్యాలు లేక.. పోలీసుల సహకారం లేక ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement