ఇంటి చెత్త మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళుతున్నా, బయటి చెత్త
నాలాల్లో పారే నీటికి అడ్డు పడుతుంటుంది.
వర్షం పడిందంటే ఉప్పొంగే నాలాలు
ఇళ్లనూ, వాకిళ్లను ముంచెత్తుతుంటాయి.
చెరువుల్లో చెత్త సరే సరి. శుభ్రత గురించి ఎంత చెబుతున్నా రకరకాల మార్గాల ద్వారా చేరే చెత్త
దుర్గంధం వెదజల్లుతూనే ఉంటుంది.
మ్యాన్‌హోల్స్ లీకై మనుషులు వాటిని శుభ్రం చేయలేక మరణం అంచుల వరకు వెళుతుంటారు. వీటన్నింటికీ పరిష్కారంగా జి.పద్మ రొబోటిక్ డివైజ్‌లను డిజైన్ చేశారు.
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉంటున్న పద్మ
మనుషుల అవసరం లేకుండా నాలాల చెత్తను, డ్రైనేజీలను, చెరువులను శుభ్రం చేయడానికి పరికరాలను తయారుచేశారు. ఈ విషయం గురించి పద్మ మాట్లాడుతూ...
‘నేను పుట్టిపెరిగింది నారాయణపేట. తర్వాత చదువు అంతా హైదరాబాద్‌లోనే. ఉద్యోగరీత్యా కెనడా వెళ్లాను. పదిహేనేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. తర్వాత తిరిగి సొంత ప్రదేశానికి వచ్చేశాను. నా చిన్నతనంలో చూసిన ప్రాంతాలకు– ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది. చిన్నప్పుడు చెరువుల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదం గా అనిపించేది. ఇప్పుడు చెత్తతో, దుర్గంధంతో ఉండటం చూశాను. అలాగే పట్టణాల్లోని నాలాల్లో చెత్త పేరుకు పోవడం, నీళ్లు సాఫీగా వెళ్లకపోవడం గమనించాను. దీనివల్ల వర్షాకాలం జనం పడే అవస్థలు చూశాను. డ్రైనేజీల్లో మనుషులు చేసే పనులు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలు గమనించాను. డ్రైనేజీల్లో పనిచేసిన కార్మికులు కొంతమంది మరణించిన ఘటనలు కూడా తెలుసు. వీటికి పరిష్కారంగా విదేశాల్లో సాంకేతికంగా చాలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మన ప్రాంతంలో అలాంటి చర్యలేవీ కనిపించలేదు.
నాలుగు రోబోటిక్ డివైజ్‌లు
ఇప్పటికీ మున్సిపాలిటీ లు 60 శాతం చెత్తను మాత్రమే సేకరిస్తున్నాయి. మిగిలిన 40 శాతం చెత్తను ప్రజలు చెరువులు, నాలాల్లోనే వేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడానికి తిరిగి మనుషులను నియమించాల్సి ఉంటుంది. అలాకాకుండా చెరువులు, నాలాలను, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ క్లీన్ చేయడానికి రొబోటిక్ డివైజ్‌లను డిజైన్ చేశాను. ఎన్వీ రొబోటిక్ పేరుతో సంస్థను నడుపుతున్నాను. మా టీమ్‌లో మొత్తం పదిమందిమి ఉన్నాం.
ఈ రొబోటిక్ డివైజ్ చెరువులో నుంచి ఒకేసారి టన్ను సామర్థ్యం గల చెత్తను సేకరించి, బయటకు వేస్తుంది. రోజుకు పది టన్నుల ప్లాస్టిక్, ఇతర తేలియాడే వ్యర్థాలను సేకరించగలదు. ముందు పైలట్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో చేశాం. తర్వాత మహబూబ్‌నగర్, నారాయణ్ పేట మున్సిపాలిటీలలో నిర్వహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలో హైదరాబాద్ లో పనులు చేపట్టాలనుకుంటున్నాం.
మరెక్కడా లేని సాంకేతికత
ఇలాంటి డివైజ్‌లను ఇప్పటి వరకు ఎవ్వరూ డిజైన్ చేయలేదు. ఈ రోబొటిక్ డివైజ్‌ల తయారీ పూర్తిగా మా సొంత డిజైన్. పేటెంట్‌కి అప్లై చేశాం. ఒక్కో రొబోటిక్ డివైజ్ తయారీకి రూ.6–7 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. నాలా, వేస్ట్ ఫ్లో .. ను పరీక్షించి డివైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావల్సిన వస్తువుల కోసం మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. సొంతంగా కొన్ని పరికరాలను తయారుచేయించాల్సి ఉంటుంది.
నేననుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి దగ్గర బంధువులు, మా కుటుంబం సపోర్ట్ లభించింది. నా ప్రాజెక్ట్ నచ్చి తెలంగాణలోని ‘విహబ్’ సాయం అందించడానికి ముందుకు వచ్చింది..
మనుషులను గౌరవిద్దాం..
వ్యర్థాలను నియంత్రించడంలో మనందరిలో పర్యావరణ బాధ్యత ఉండాలి. అంతేకాదు మన తోటి మనిషిని గౌరవించాలి. అప్పుడు మన చుట్టూ వాతావరణం బాగుంటుంది. మనలో చాలామంది ప్లాస్టిక్‌తో సహా రకరకాల వ్యర్థాలను రోడ్డుకు ఇరువైపులా, నాలాల్లో, చెరువుల్లోనూ పడేస్తుంటారు. పెద్ద ఎత్తున డంప్ అయ్యే చెత్తను చూస్తుంటే భవిష్యత్తు గురించిన భయం కూడా కలుగుతుంది. మన ఇంటి డ్రైనేజీ మ్యాన్‌హోల్‌కి ఉండే మూతనే దాదాపు టన్ను బరువు ఉంటుంది. దానిని ఎత్తాలంటే మనిషి వెన్నెముకపై పడే భారం ఎంత ఉంటుందో గ్రహించవచ్చు. అతనిమీద ఆధారపడే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అనే ఆలోచన మనందరిలోనూ రావాలి. అలాంటివాటిని ఎత్తడానికి కూడా రొబోటిక్ కంట్రోల్ డివైజ్‌ను డిజైన్ చేశాం. మ్యాన్‌హోల్ కవర్ లిఫ్టర్.. తయారు చేశాం. మ్యాన్‌హోల్ క్లీనర్‌పైన ఈ డివైజ్‌ను ఉంచితే అదే చెత్తనంతా తీసి, బయటకు వేసేస్తుంది. చెత్త కోసం మనుషులను వినియోగించకుండా, వారిని ఇతర రంగాలకు మళ్లించాలి. చెత్తను శుభ్రం చేయడానికి పరికరాలను ఉపయోగించాలి అన్నదే నా ఆలోచన. మన దగ్గర ఈ విధానంలో ముందు చూపు, త్వరిగతిన పనులు అవడం ఎక్కువ అవసరం’’ అని వివరించారు పద్మ.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment