నిధి సింగ్... ఈ దేశపు తొలి వెబ్‌సిరీస్ నటీమణి. 2014లో టీవీఎఫ్ (ది వైరల్ ఫీవర్) అనే యూట్యూబ్ చానల్‌లో ప్రసారమైన ఆ సిరీస్ పేరు ‘పర్మినెంట్ రూమ్మేట్స్’. ఆ ధారావాహికతోనే ఆమె పాపులర్ అయింది.. వెబ్ సిరీస్ తొలి హీరోయిన్ ఘనతనూ సాధించింది.
- జన్మస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్. పెరిగిందీ అక్కడే. సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఇంటర్ కాలేజీలో చదువుకుంది. తండ్రి.. బీరేంద్ర సింగ్ .. ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగి. తల్లి.. రశ్మీసింగ్ గృహిణి. నిధికి ఒక అన్న రిషబ్ సింగ్, తమ్ముడు శాశ్వత్ సింగ్. ఈ తమ్ముడు సినీ గాయకుడు. హిందీ, తమిళ చిత్ర సంగీతాభిమానులకు సుపరిచితుడు.
- నటన మీద ఆసక్తితో ముంబై చేరింది నిధి. ‘ది డ్రామా ఆఫ్ ది డగ్గర్’ (ఇంగ్లిష్)తో సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ‘ఖులీ ఖిడికీ’ అనే ద్విభాషా (ఇంగ్లిష్, హిందీ) సినిమాలో నటించినా ప్రేక్షకులు పెద్దగా గుర్తుపెట్టుకోలేదు.
- ఆ టైమ్‌లోనే ‘పర్మినెంట్ రూమ్మేట్స్’లో నటించే అవకాశం వచ్చింది. వెంటనే ఒప్పేసుకుంది. సినిమా తెర నుంచి డిజిటల్ స్క్రీన్‌మీదకు వెళ్లడమేంటి? నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావ్’ అన్న శ్రేయోభిలాషుల సూచనలు, హెచ్చరికలను పట్టించుకోకుండా.
- ఆమె అంచనా, నిర్ణయం తప్పు కాలేదు. పర్మినెంట్ రూమ్మేట్స్‌తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది నిధి సింగ్.
- టీవీఎఫ్ వాళ్ల ఆ సిరీస్‌తో మరిన్ని వెబ్‌సిరీసే కాదు, సినిమా చాన్స్‌లూ వరుస కట్టాయి. ‘పిచ్చర్స్’, ‘మ్యాన్స్ వరల్డ్’, ‘హ్యూమరస్‌లీ యువర్స్’, ‘అపహరణ్’, ‘ఇమ్మెచ్యూర్’, ‘మిషన్ ఓవర్ మార్స్’, ‘లార్జ్ షార్ట్‌ఫిలిమ్స్’, ‘అభయ్’, ‘వకాలత్ ఫ్రమ్ హౌస్’, ‘పరివార్ ప్యార్ కే ఆగే వార్’ మొదలైన వెబ్‌సిరీన్‌తోపాటు ‘బ్రిజ్ మోహన్ అమర్ హై’, ‘దిల్ జంగ్లీ’, ‘బహుత్ హువా సమ్మాన్’ వంటి సినిమాలు ఆ క్యూలోనివే.
- ప్రయాణాలంటే నిధికి మహా ఇష్టం.
- ‘నేను ఫస్ట్ వెబ్‌సిరీస్‌లో నటించినప్పుడు చాలామంది హెచ్చరించారు. కొంత మంది అపరిచితులు ‘నువ్వు ఆఫ్టరాల్ ఫేస్‌బుక్ నోన్ యాక్ట్రెస్‌వి.. నిన్నెందుకు చూడాలి మేము?’ అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు. పట్టించుకోలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా నటా? వెబ్‌సిరీస్ నటా? అని పట్టించుకునే స్థితిలో లేరు ప్రేక్షకులు. కంటెంట్ ఏంటి? క్యారెక్టర్‌కు న్యాయం చేశారా లేదా అన్నదే చూస్తున్నారు. దాన్ని బట్టే అభిమానాన్ని ప్రకటిస్తున్నారు. సో.. ప్లాట్‌ఫామ్ ఏంటన్నది కాదు మన టాలెంటే ముఖ్యం’ అంటుంది నిధి సింగ్.
Comments
Please login to add a commentAdd a comment