పిల్లలు తినే సమయంలో వారి గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని పెద్దలు అంటుంటారు. తిన్న ఆహారం కిందికి కదలడం కోసం తలపై తడుతుంటారు. కానీ గొంతులో ఇరుక్కున్న ఆహారంగానీ లేదా నాణెంలాంటి వస్తువుగానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వాయునాళంలోకి పోతే చాలా ప్రమాదం. ఇలా ఆహారం ఇరుక్కున్నా లేదా ఏదైనా వస్తువు గొంతులో ఇరుక్కున్నా హాస్పిటల్‌కు వెళ్లేలోపు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించాలి.
- పిల్లల నోరు బాగా తెరిపించి, నాలుక బాగా చాపేలా చేసి, గొంతులోకి వేళ్లుపోనిచ్చి చేతికి ఏదైనా తగులుతుందేమో చూడాలి. తగిలితే వెంటనే బయటకు తీసేయాలి. ∙పిల్లాడి వెనక పెద్దలెవరైనా నిల్చుని, వారి రెండు చేతుల్నీ పొట్టచుట్టూ బిగించి, అకస్మాత్తుగా చేతుల్తో పట్టుబిగుస్తున్నట్లుగా కదిలించాలి. ఇది క్రమపద్ధతిలో (రిథమాటిక్‌గా) చేస్తుండాలి. దాంతో పొట్ట దగ్గర ఒత్తిడి పెరిగి, గొంతులో ఇరుక్కున్నది బయటకు రావచ్చు. దీన్ని హీమ్‌లిచ్ మెనోవర్ అంటారు.
- ఇదే గనక చాలా చిన్నపిల్లల్లో / పసిపాపల్లో చేయాల్సి వస్తే... పెద్దలు కుర్చీలో కూర్చుని, చిన్నారులు తలకిందులుగా ఉండేలా, వాళ్లను తమ కాళ్లపైన బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టాక, చిన్నారుల వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి కలిగేలా నొక్కాలి. ఇది ఎలా జరగాలంటే... చిన్నారుల నడుము నుంచి వారి రెండు భుజాల మధ్య ప్రాంతంలో మృదువుగా ఒత్తిడి కలిగేలా కదిలిస్తుండాలి. ఇది కూడా క్రమపద్ధతిలో (రిథమాటిక్‌గా) చేయాలి. ఒకవైపు పొట్ట మీద పెద్దల కాళ్ల ఒత్తిడీ, మరోవైపు వీపు మీద చేతుల ఒత్తిడి కారణంగా గొంతులో అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ∙ప్రథమ చికిత్సగా ఇవి చేస్తూ... వీలైనంత త్వరగా పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించాలి. ఈ ప్రక్రియలతో గొంతులో ఇరుక్కున్నవి బయటకు వస్తే సరి. లేదంటే హాస్పిటల్‌లో అవసరాన్ని బట్టి ఎండోస్కోప్ వాడి, ఇరుక్కున్న పదార్థాన్ని డాక్టర్లు బయటకు తీస్తారు.
(చదవండి: చిన్నారులను వేధించే పిన్‌వార్మ్ / థ్రెడ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటే...? )
Comments
Please login to add a commentAdd a comment