ఒకరోజు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి. పక్కన కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం జిల్లాలో హటాత్తుగా ఆఫీసర్లు మారిపోయారు.ఏ ముఖ్యమైన సీట్‌లో చూసినా అమ్మాయిలే. వారే చురుగ్గా పర్యవేక్షణ చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫైళ్ల మీద సంతకాలు చేస్తున్నారు. కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, ఆర్డీఓగా పదిహేను పదహారేళ్లలోపు అమ్మాయిలు పని చేయడం చూసేవారికి వారి సమర్థతను చాటి చెప్పింది. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల వికాసాన్ని కాంక్షిస్తూ ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేపట్టిన కార్యక్రమం ఇది.
‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించండి’
‘రాత్రి 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులకు అధికారిక పనుల గురించి ఫోన్లు చేసి ఆటంకం కలిగించకండి’...
ఇవి ఆదివారం ఒకరోజు అనంతపురం జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన ఇంటర్మిడియెట్ విద్యార్థిని శ్రావణి ఇచ్చిన ఆదేశాలు. ఆ మేరకు ఆమె ఆ ఫైళ్ల మీద సంతకాలు చేసింది. అధికారులు ఆ నిర్ణయాల అమలును మొదలెట్టారు కూడా.
జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన తొమ్మిదవ తరగతి విద్యార్థి మధుశ్రీ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న లేఔట్‌ను తనిఖీ చేసింది. అంతే కాదు వర్షాలకు పాడైన ఆ లేఔట్ రోడ్లను వెంటనే రిపేరు చేయమని ఆదేశించింది. వీరిద్దరే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థినులు ఆర్డీఓలు, ఎమ్మార్వోలు, వివిధ శాఖల పీడీలుగా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలోని 63 మండలాలకు తాసీల్దార్లుగా పని చేశారు. అక్టోబరు 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టి బాలికలకు ఒక అరుదైన గౌరవం దక్కేలా చేశారు.
ఇంటర్మీడియెట్ అమ్మాయి
అనంతపురం జిల్లా రాప్తాడు కేజీబీవీ (కస్తూర్బా గాంధీ విద్యాలయ) లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం. శ్రావణి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించింది. కలెక్టర్ చంద్రుడు ఆమెను తన సీట్‌లో కూచోబెట్టి పక్కన నిలబడి చప్పట్లతో ప్రోత్సహించారు. అంతేకాదు శ్రావణి తీసుకునే నిర్ణయాలు అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యత తీసుకున్న శ్రావణì నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న శారదా మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్‌ను కాలినడకన తనిఖీ చేసి జగనన్న విద్యాకానుక పథకం అమలు తీరును పరిశీలించింది. ఆ స్కూలులో జరుగుతున్న నాడు–నేడు పనులను కూడా పరిశీలించింది. ‘ఇదంతా తనకు మధుర జ్ఞాపకంగా ఉందని’ శ్రావణి అంది. ‘మాది గార్లదిన్నె మండలంలోని కనంపల్లి గ్రామం. మా నాన్న పేరు పాములేటి. తల్లి రత్నమ్మ. మాది వ్యవసాయ కుటుంబం.
కలెక్టర్ సీట్‌లో కూచున్నాక కలెక్టర్‌గా ప్రజలకు ఎంత మంచి చేయవచ్చో అర్థమైంది. ప్రజలకు వేగంగా సేవలందినప్పుడే వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుందని నేను అర్థం చేసుకున్నాను. బాలికలకు రక్షణ కల్పించాలని అన్నదాతలను ఆదుకోవాలని వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని నేను ఆదేశాలిచ్చాను. కలెక్టర్ బాధ్యత గొప్పదే అయినా నాకు మాత్రం పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తే ఎక్కువ ఇష్టం. అందుకే టీచర్ కావాలనేది నా కోరిక. ఒక్కరోజు కలెక్టరుగా అవకాశం కల్పించిన కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు.’ అంది శ్రావణి.
టీచర్స్ డే స్ఫూర్తితో...!
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలను ఒక రోజు అధికారులుగా జిల్లావ్యాప్తంగా నియమించాలని కలెక్టర్ గంధం చంద్రుడు ముందురోజే నిర్ణయించారు. ఎవరు ఏ అధికారిగా ఉండాలనే విషయాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ‘‘మొదట కేవలం కలెక్టరుగా మాత్రమే ఒక అమ్మాయిని ఒక రోజు నియమిద్దామని అనుకున్నాం. కానీ జిల్లా అంతటా వివిధ విద్యార్థినులకు ఈ బాధ్యత ఇస్తే వారికి స్ఫూర్తి కలుగుతుందని బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలని వారికి అనిపిస్తుందని తల్లిదండ్రులకు అమ్మాయిలను చదివించాలనే స్ఫూర్తి కలుగుతుందని అనిపించింది. నాకు ఈ విధంగా చేయాలని టీచర్స్ డే స్ఫూర్తిని ఇచ్చింది.
టీచర్స్ డే సందర్భంగా టీచర్లుగా చేసిన పిల్లలు ఎంతో సంతోషంగా ఫీలవుతారు. తాము కూడా ఒక హోదాలో ఉండాలనే భావన వారిలో కలుగుతుంది. అందుకే బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని భావించాం. వారు తీసుకునే నిర్ణయాలను కూడా అమలు చేయాలని స్పష్టంగా చెప్పాం’’ అని కలెక్టర్ గంధం చంద్రుడు ‘సాక్షి’కి వివరించారు. కలెక్టరేట్‌లో కలెక్టరుగా, జేసీ–1,2,3గా, డీఆర్‌ఓగా, ఏఓగా వ్యవహరించిన మొత్తం 6 మంది విద్యార్థినులకు మెంటర్‌గా ఉంటానని... వారి ఉన్నత చదువులకు అండగా ఉంటానని హామీనిచ్చారు.
– కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి ప్రతినిధి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment