గురువే..అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తూ... | Depicting The Nude Scenes Of The Girls ...The Insistent Teacher | Sakshi
Sakshi News home page

అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తూ...

Published Sat, Apr 14 2018 8:54 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Depicting The Nude Scenes Of The Girls ...The Insistent Teacher - Sakshi

ధ్వంసమైన కోచింగ్‌ సెంటర్‌ బోర్డు

చదువుకునేందుకు వచ్చిన అమ్మాయిల జీవితాలతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు చెలగాటమాడుతున్నాడు. అమ్మాయిలు స్నానం చేసే దృశ్యాలను బాత్‌రూంలో రహస్యంగా అమర్చిన మొబైల్‌ వీడియోతో చిత్రీకరిస్తున్నాడు. ఎట్టకేలకు ఓ అమ్మాయి ఈ గుట్టును పసిగట్టడంతో రట్టయ్యింది. తోటి విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి నిర్వాహకుడికి దేహశుద్ధి చేశారు. పోటీపరీక్షలకు శిక్షణ ఇస్తారని పంపితే.. ఇలా వారి జీవితాలతో ఆడుకుంటారా అంటూ కోచింగ్‌సెంటర్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 

అనంతపురం సెంట్రల్‌ : రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన సంజీవరాయుడు బీఈడీ వరకు చదువుకున్నాడు. మూడేళ్ల కిందట అనంతపురం వచ్చాడు. మారుతినగర్‌లో ‘లోటస్‌ అకాడమీ కోచింగ్‌’ ఏర్పాటు చేసి వివిధ పోటీ పరీక్షలతో పాటు పాలిసెట్, ఏపీఆర్‌జేసీ, టీటీసీ, మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. సబ్జెక్టును బట్టి నెలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇల్లు, కోచింగ్‌ సెంటర్‌తోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థినుల కోసం హాస్టల్‌ కూడా ఒకే చోట నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం 75 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు.  

 దుర్బుద్ధి.. 

విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన నిర్వాహకుడికి దుర్బుద్ధి పుట్టింది. అమ్మాయిలను నగ్న దృశ్యాలను చిత్రీకరించాలనుకున్నాడు. హాస్టల్‌లో విద్యార్థిను లందరికీ ఒకే బాత్‌రూం ఉంది. అవసరమైతే తన బాత్‌రూం కూడా వాడుకోవాలని శుక్రవారం ఉదయం చెప్పాడు. అయితే అప్పటికే బాత్‌రూంలో చెప్పుల బాక్సు (ఖాళీ అట్టపెట్టె) ఉంచి, దానికి రంధ్రం పెట్టి అక్కడ సెల్‌ఫోన్‌ వీడియో ఆన్‌ చేసి ఉంచాడు. స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని అట్టపెట్టె అనుమానంగా కనిపించడంతో తెరిచి చూసింది. వీడియో రికార్డింగ్‌ను గుర్తించింది. జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు తెలియజేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు శిక్షకుడు సంజీవరాయుడకు దేహశుద్ధిచేశారు. లోటస్‌ అకాడమీ కోచింగ్‌ సెంటర్‌ను ధ్వంసం చేశారు. నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌ శ్రీనివాస్‌ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement