మన ఆట మొదలైంది | Online Games Special Story In Sakshi Yuvars | Sakshi
Sakshi News home page

మన ఆట మొదలైంది

Published Wed, Sep 23 2020 9:23 AM | Last Updated on Wed, Sep 23 2020 11:58 AM

Online Games Special Story In Sakshi Yuvars

గోరో మజిమా తెలుసా? ఎందుకు తెలియదు, జపాన్‌ డిజిటల్‌ గేమ్‌ ‘యకుజ’లో ఒక క్యారెక్టర్‌. ‘క్రొటాస్‌’ ఎవరో చెప్పుచూద్దాం? ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ గేమ్‌లో వారియర్‌. అమెరికా నుంచి జపాన్‌ వరకు ఏ ‘డిజిటల్‌ గేమ్‌’ గురించి అడిగినా చెప్పగలిగే మన ‘జ్ఞానం’ ఇప్పుడు సృజనాత్మకత వైపు పరుగులు +తీస్తోంది. ‘గేమ్‌’ను ఆస్వాదించడమే కాదు మనవైన దేశియ గేమ్స్‌ను రూపొందించడానికి యువత సై అంటోంది....

కోవిడ్‌ చాస్తున్న కోరలకు చిన్నా,పెద్దా పరిశ్రమలు తుఫాను ముందు చిగురుటాకులా వణికిపోయాయి. గేమింగ్‌ కంపెనీలు మాత్రం తడబడకుండా అరేబియన్‌ గుర్రంలా దూసుకెళ్లాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలకు వినోదాన్ని కలిగించడానికి వీలుగా వరల్డ్‌ హెల్త్‌  ఆర్గనైజేషన్‌లాంటి సంస్థలు ప్రముఖ గేమింగ్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం, సినిమాలు, టీవీ షోల కంటే రాబోయేకాలం ‘గేమింగ్‌’ పరిశ్రమదే అని రిలయన్స్‌ అధినేత అనడం....వాటి శక్తి ఏమిటో ఊహించుకోవచ్చు.

గూగుల్‌–కెపీఎంజీ రిపోర్ట్‌ ప్రకారం 2021 నాటికి మన దేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిజినెస్‌ ఏడు వేల కోట్లు, 2023 నాటికి పదకొండువేల కోట్లు దాటుతుందట. అమెరికన్, జపాన్‌ కంపెనీల స్ఫూర్తితో డిజిటల్‌ గేమ్‌ రంగంలోకి దిగిన ధృవ, నజర, గేమ్స్‌ 2 విన్‌...మొదలైన సంస్థలు ‘లోకల్‌ కంటెంట్‌’ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. అయితే అప్పట్లో స్మార్ట్‌ఫోన్ల హవా లేకపోవడం, వేరే దేశాల్లోలాగా గేమింగ్‌ యాప్స్‌ను కొనడం లేదా చందాల రూపంలో డబ్బు వెచ్చించడానికి సుముఖంగా ఉండకపోవడం, గేమింగ్‌ అనేది పనిపాటలేని వ్యవహారం అనుకోవడంలాంటి పరిమితులు ఉండేది.

స్మార్ట్‌ఫోన్ల ప్రభంజనంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. మరోవైపు గేమింగ్‌ అనేది మరీ అంత తీసిపారేయతగినది కాదని, మల్టీటాస్కింగ్‌ నైపుణ్యం పెరుగుతుందనే స్పృహ వచ్చింది. ఒకప్పుడు పిల్లల పత్రిక ‘చందమామ’ను పెద్దలు కూడా పిల్లలై చదివినట్లే, ఇప్పుడు పిల్లలు, యువతే కాకుండా పెద్దలు కూడా గేమింగ్‌ పట్ల ఆసక్తి చూపడం మరో సానుకూల అంశంగా మారింది. గేమింగ్‌ రంగంలో ఉజ్వల భవిష్యత్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించడానికి ద్వారాలు తెరిచింది గేమింగ్‌ ఇండస్ట్రీ. బార్డర్స్‌ల్యాండ్, సూపర్‌ మారియో, రాకెట్‌ లీగ్, లీగ్‌ ఆఫ్‌ లెజెండ్స్,లెజెండ్‌ ఆఫ్‌ జెల్డా....ఇంకా ఎంత కాలం మనవి కాని ఆటలు! మన ఆట మొదలుపెట్టడానికి ఇదే సరిౖయెన టైమ్‌. ‘డిజిటల్‌ గేమింగ్‌ సెక్టర్‌లో అద్భుత అవకాశాలు ఉన్నాయి.మన సంస్కృతి,జానపదకథల్లో నుంచి సబ్జెక్ట్‌లను డెవలప్‌ చేయండి’ అని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.

గేమింగ్‌ అంటే ఇష్టం ఉందా? కొత్తగా ఆలోచించే సృజనాత్మకత మీ సొంతమా? ...ఇక మీరు గేమింగ్‌ ప్రియులుగా మాత్రమే ఉండనక్కర్లేదు. మీకు ఇష్టమైన రంగంలోనే కాలరెత్తుకోదగ్గ ఉద్యోగాలతో పదిమంది మెప్పు పొందవచ్చు. అటు చూడండి...గేమ్‌ప్రొగ్రామర్, గేమ్‌ డిజైనర్, నెరెటీవ్‌ డిజైనర్, టెక్చర్‌ ఆర్టిస్ట్, గేమ్‌ రైటర్, ఆర్ట్‌ డిజైనర్,టూల్‌ డెవలపర్‌...ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ,పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదండి...మీ ఇష్టాన్నే పెట్టుబడిగా పెట్టి గేమింగ్‌ స్టార్‌గా ఎదగడానికి.

గేమింగ్‌ స్టార్స్‌
ఆన్‌లైన్‌ గేమింగ్‌ సెక్టర్‌లో వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లు పెరుగుతున్నారు.వీరిలో కొందరు: కీర్తిసింగ్‌– హిట్‌ వికెట్‌(క్రికెట్‌ స్ట్రాటజీ గేమ్‌), హర్ష సచ్‌దేవ–ఫనీయరన్‌(మనీ గేమింగ్‌ ప్లాట్‌ఫాం),అర్పిత కపూర్‌–మెక్‌ మోకా(మల్టీ ప్లేయర్‌ సోషల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫాం), నేహా పాండే–లీగ్స్‌ఎక్స్‌ (ఫాంటసీ ఫుట్‌బాల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫాం)

సరిలేరు  మీకెవ్వరు
కథల గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన పురాణాల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ఆ పనే చేసింది ఓగ్రి హెడ్‌ స్టూడియో. ఓగ్రి వారి ‘అసుర’ బంపర్‌హిట్‌ అయింది. తాజాగా ఇండియన్‌ గేమ్‌ డెవలపింగ్‌ కంపెనీ ఎన్‌కోర్, ఫౌజీ(ఫీయర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌) అనే యాక్షన్‌ గేమ్‌ను ప్రకటించింది.మన సైనికుల సత్తా చాటే షూటింగ్‌ గేమ్‌ ఇది.


టెక్‌...టాక్‌

apple ipad air 4

  • టస్క్రీన్‌ సైజ్‌: 10.9 అంగుళాలు టరెజల్యూషన్‌: 2360x1640 పిక్సెల్స్‌ 
  • టస్టోరేజ్‌: 64జీబి, 256జీబి
  • కలర్స్‌: సిల్వర్, స్పేస్‌ గ్రే, రోజ్‌ గోల్డ్, గ్రీన్, స్కై బ్లూ టచ్‌ ఐడీ సెన్సర్‌ స్టీరియో స్పీకర్స్‌
  • యాపిల్‌ పెన్సిల్‌ 2 సపోర్ట్‌ 
  • మ్యాజిక్‌ కీ బోర్డ్‌ సపోర్ట్‌
  • రిలీజ్‌: అక్టోబర్

jebjuke bar

  • జెబ్రోనిక్స్‌ jeb-juke సౌండ్‌బార్‌ ఇండియాలో లాంచ్‌ అయింది.
  • మల్టీపుల్‌ కనెక్టివిటీ ఆప్షన్స్, సింపుల్‌ సెటప్‌తో వస్తున్న ఈ సౌండ్‌బార్‌ శబ్దసౌందర్యాన్ని మరింత దగ్గర చేస్తుంది, 2.1 స్పీకర్‌ సెటప్‌
  • 5.0 బ్లూటూత్‌, రిమోట్‌ సౌకర్యం
  • ధర: రూ:17,999

గ్యాడ్జెట్‌ బజార్‌

  • పే–పవర్‌డ్‌ వాచ్‌

ప్రముఖ వాచ్‌ కంపెనీ టైటాన్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ‘టైటాన్‌ పే’ పేరుతో పే–పవర్‌డ్‌ వాచ్‌ని లాంచ్‌ చేసింది. డెబిట్‌ కార్డు ఉపయోగించాల్సిన పనిలేకుండానే ‘టైటాన్‌ పే’ను టాప్‌ చేసి పాయింట్‌–ఆఫ్‌–సేల్‌ (పీవోఎస్‌) మెషిన్ల ద్వారా పేమెంట్స్‌ చేయవచ్చు. వాచ్‌ ‘స్ట్రాప్‌’లో ఉండే ఎన్‌ఎఫ్‌సి (నియర్‌ ఫీల్డ్‌ కమ్యునికేషన్‌) సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్డు హోల్డర్లకు పరిమితం. పురుషులు(రూ.2,995), స్త్రీలకు(రూ.3,895) వేరు వేరు ధరల్లో ఈ వాచ్‌లను తయారుచేశారు.

►  రైడర్‌

  • యువర్‌ హైనెస్‌...

ఇటీవల హార్నెట్‌ 2.0 లాంచ్‌ చేసిన హోండా మోటర్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) ఈ నెలాఖరులో తమ బ్రాండ్‌ న్యూ మోటర్‌ సైకిల్‌ను లాంచ్‌ చేయనుంది. ‘యువర్‌ హైనెస్‌...గెట్‌ రెడీ ఫర్‌ మెజెస్టిక్‌ లాంచ్‌’ అంటూ టీజర్‌ కూడా రిలీజ్‌ చేసింది. సరికొత్త అప్‌డెట్స్‌తో ఇండియన్‌ మార్కెట్‌కు అనుగుణంగా క్రూయిజర్‌ స్టైల్‌లో రాబోతున్న ఈ బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ అంటున్నారు. కొత్త బైక్‌కు సంబంధించి అధికారికంగా మాత్రం ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు.

►  సోషల్‌ మీడియా

  • ఫేస్‌బుక్‌ క్యాంపస్‌

ఫేస్‌బుక్‌ అనేది క్యాంపస్‌లోనే పుట్టిన ఆలోచన. ఎఫ్‌బీ తన మూలాలను వెదుక్కుంటూ క్యాంపస్‌లోకి వెళుతుంది. ‘ఫేస్‌బుక్‌ క్యాంపస్‌’ పేరుతో తాజాగా కొత్త ఫీచర్‌ను ప్రకటించింది కంపెనీ. క్లాస్‌మెట్‌లతో కనెక్ట్‌ కావడానికి, గ్రూపులలో చేరడానికి, క్యాంపస్‌ ఈవెంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, క్యాంపస్‌ డైరెక్టరీ ద్వారా క్లాస్‌మెట్‌లతోనే కాకుండా తమ విద్యాసంస్థలోని ఇతర విద్యార్థులు, మాజీ విద్యార్థులతో స్నేహం చేయడానికి ప్రైవేట్‌ స్పేస్‌గా ఎఫ్‌బీ క్యాంపస్‌ ఉపయోగపడుతుంది.

‘కరోనా ప్రభావంతో చాలామంది విద్యార్థులు క్యాంపస్‌కు రావడం లేదు. ఇప్పుడు  క్యాంపస్‌ను కళ్ల ముందుంచడానికి మా ఫీచర్‌ ఉపయోగపడుతుంది’ అంటుంది ఫేస్‌బుక్‌ క్యాంపస్‌ ప్రొడక్ట్‌ మెనేజర్‌ ఛార్మిన్‌ హంగ్‌. యంగ్‌ జెనరేషన్‌పై ఎఫ్‌బీ పట్టుకొల్పోతుందని కొన్ని ‘స్టడీ’లు చెబుతున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకోవడానికే ‘ఫేస్‌బుక్‌  క్యాంపస్‌’ ఫీచర్‌తో ముందుకు వస్తుందనేది కొందరి అంచనా. అమెరికాలో ప్రస్తుతం 30 విశ్వవిద్యాలయాల్లో ‘పైలట్‌ప్రాజెక్ట్‌’గా పరీక్షించబడుతున్న ‘ఫేస్‌బుక్‌ క్యాంపస్‌’లో మార్పులు చేర్పులు జరగనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement