పాణి గ్రహణమైన తర్వాత, వధూవరులిద్దరూ హోమగుండం చుట్టు ప్రదక్షిణలు చెయ్యాలి. అప్పుడు వరుడు వధువు చేత ఏడడుగులు నడిపిస్తాడు. దీనినే సప్తపది అంటారు. ఆ సమయంలో చదివే మంత్రాలు, వరుడి సంకల్పాన్ని దేవతలకు ఏడు వాక్యాలలో తెలియజేస్తాయి.
వధువు మొదటి అడుగు వలన అన్నం, రెండవ అడుగు వలన బలం, మూడవ అడుగు వలన కర్మ, నాల్గవ అడుగు వలన సుఖసంతోషాలు, ఐదవ అడుగువలన పశుసంపద, ఆరవ అడుగు వలన ఋతుసంపద, ఏడవ అడుగు వలన సత్సంతానం కలగాలని వరుడు ప్రార్థిస్తాడు. తర్వాత ఆ వధువు చేత ‘నేను తీర్థం, వ్రతం, ఉద్యాపనం, యజ్ఞం, దానం మొదలైన గృహస్థాశ్రమ ధర్మాలలో మీకు అర్ధ శరీరమై మసలుకుంటాను, హవ్య, కవ్య సమర్పణలో దేవ, పితృపూజలలో, కుటుంబ రక్షణ, పశుపాలనలో, మీ వెన్నంటే ఉంటాను’ అని ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ తర్వాత వధువుతో తన సఖ్యతను తెలియజేసి వధువు సఖ్యతను పొందుతాడు. అలా వారిద్దరి మధ్యన ఏర్పడిన బంధం ఏడు జన్మల వరకు నిలవాలని కోరుకోవడమే సప్తపది.
తర్వాత షోడశ హోమాలు అంటే పదహారు ప్రధాన హోమాలను చేసి సోముడు, గంధర్వుడు, అగ్ని, ఇంద్రాది సమస్త దేవతలకు హవిస్సులర్పిస్తారు. తరువాత వధువుచేత, తన భర్తకు దీర్ఘాయుష్షు, తనకు అత్తవారింటితో చక్కటి అనుబంధం, అన్యోన్య దాంపత్యం కలగాలని లాజహోమాన్ని చేయిస్తారు. తదుపరి వధువు నడుముకు కట్టిన యోక్త్రమనే తాడును విడిపిస్తారు. తరువాత, వరుడు, వధువును రథంలో ఎక్కించుకుని, తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ వాహనంలో తీసుకెళ్ళేటప్పుడు చెప్పే మంత్రాలు హైందవ సాంప్రదాయాలలో స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యతను తప్పకుండా అందరూ గ్రహించి తీరాలి. ఆ మంత్రాలకు అర్థం, ‘ఓ వధూ..! నీవు మా ఇంట ప్రవేశించి మా విరోధులను తరిమి వేయి. నీ భర్తనైన నన్ను మాయింట శాసించు. నాపై ఆధిపత్యం వహించు. సంతానంతో నా వంశాన్ని వృద్ధి చేయి. నీ అత్తమామలకు, ఆడపడుచుకు, బావలకు, మరుదులకు సామ్రాజ్ఞివికా. మా కుటుంబానికి, మా సంపదలకు యజమానురాలివికా. అందరితో కలిసి మెలసి నా ఇంటిని ఆహ్లాదకరంగా చేయి’. వరుడు ఈ ప్రమాణాలు చేయడం ద్వారా వధువుకు అత్తవారి ఇంట సర్వాధిపత్యం ఇవ్వబడుతుంది.
తదుపరి, వరుని గృహంలో వధూవరులిద్దరు హోమం చేస్తారు. దీనినే ప్రవేశహోమం అంటారు. ప్రవేశ హోమంలో పదమూడు మంత్రాలతో దేవతలకు హవిస్సులర్పిస్తారు.. వానిలో ‘ఓ ఇంద్రాగ్నులారా..! నా భార్యకు నూరు సంవత్సరాలు భోగభాగ్యాలను కలిగించు, ఓ త్వష్ట ప్రజాపతీ..! మాకు సుఖాలను ప్రసాదించు. హే విశ్వకర్మా..! ఈమెను నాకు భార్యగా నీవే పుట్టించితివి. నావలన సంతానం పొంది నూరేళ్ళు జీవించునట్లు అనుగ్రహించు’ ఇత్యాది మంత్రాల ద్వారా వైదిక దేవతలకు హవిస్సులర్పిస్తూ ఆ దంపతులకు ఆయుర్దాయం, పరస్పరానురాగం, సత్సంతానం, భోగ భాగ్యాలు, ధనధాన్యాలను కోరుకుంటారు. తర్వాత జయాది హోమాలు చేయాలి. తదుపరి స్థాలీపాకహోమం చేసి కనీసం ఇద్దరికి భోజనం ఏర్పాటు చేయాలి.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment