దేశవాళీ వరి వంగడాల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తెరిగిన ఓ వ్యవసాయ విస్తరణాధికారి తన సొంత భూమిలో నాలుగేళ్లుగా సాగు చేస్తూ ఇతర రైతులకు విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయన పేరు యాదగిరి శ్రీనివాస్. దేశీ వరి వంగడాలు ఇప్పుడున్న కొత్త వంగడాలు, హైబ్రిడ్‌లకు ప్రత్యామ్నాయం లేక పోటీ ఇచ్చేవిగా భావించరాదని. వీటిలోని విభిన్నమైన పోషక విలువలు, ఔషధ గుణాలు గమనిస్తే వీటి అసలు విలువ తెలుస్తుంది అంటున్నారు శ్రీనివాస్.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ తనకు వ్యవసాయం పైన ఉన్న మక్కువతో మండలంలోని కల్వచర్లలో గల తన స్వంత పొలం ఎకరంన్నరలో దాదాపు వంద రకాల దేశవాళీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను ఇతర ప్రాంతాల నుంచి సేకరించి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ‘ప్యాడీ ఆర్ట్’ను రూపొందించారు.
కాలభట్ అనే వరి నారును ‘రామమందిరం ఆకారం’లో నాటి చూపరులను ఆకట్టుకుంటున్నారు. వరి వంగడాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాభ, నష్టాల గురించి శ్రీనివాస్ ‘సాక్షి’తో ముచ్చటించారు. విత్తనం వ్యవసాయానికి మూలాధారం, కేంద్ర బింధువు. రైతులు స్వంత విత్తనాన్ని పండించుకుంటూ ఆ పంటలోని మెరుగైన కంకులను భద్రపరిచి తరువాత పంటకు విత్తనాలుగా వాడుకోవడం అనాదిగా ఒక సంప్రదాయం. అయితే, ఇటీవల దశాబ్దాల్లో పరిస్థితి మారిపోయింది. సాంప్రదాయ సూటి వంగడాలకు మళ్లీ ఆదరణ లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశీ వరి వంగడాలు మన దేశ సమశీతోష్ణ వాతావరణానికి తగ్గట్టుగా ఉండి అన్ని రకాల విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాయి అంటున్నారు శ్రీనివాస్. పంచరత్న, కాలాబట్ట వంటి 15 రకాల నల్ల వడ్లు, 5 రకాల గోధుమ రంగు వడ్లు, 5 రకాల ఎరుపు వడ్లు, తులసీబాసో వంటి 13 రకాల పొట్టి గింజ వడ్లు, 6 రకాల సువాసనతో కూడిన వడ్లు, దూదేశ్వర్ వంటి 11 రకాల సన్న వడ్లు, 2 రకాల పొడవు వడ్లు, 3 రకాల దొడ్డు వంగడాలతోపాటు మరి కొన్ని పేర్లు తెలియని రకాలను సైతం శ్రీనివాస్ చిన్న చిన్న మడుల్లో సాగు చేస్తున్నారు.
దేశీయ రకాల్లో ఎక్కువ భాగం దొడ్డు, ముతక రకాలు అవడం వల్ల వాటిని ప్రతి రోజు అన్నం రూపంలో తీసుకోవడం ఇబ్బందిగా బావిస్తే ఇతర రూపంలోకి అంటే.. రవ్వ, అటుకులు, పిండి, పేలాల రూపంలోకి మార్చుకొని తీసుకోవచ్చన్నారు. అందుకే వీటి సాగు మన వ్యవసాయ విధానంలో ఒక భాగం కావాలనేది ఒక రైతుగా శ్రీనివాస్ (93936 66693) అంటున్నారు.
– పొన్నం శ్రీనివాస గౌడ్, సాక్షి, రామగిరి,పెద్దపల్లి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment