పెనుముప్పుగా పరిణమిస్తోన్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ‘‘రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్’’ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ప్రపంచదేశాల్లోని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ మాటలను సీరియస్‌గా తీసుకుని ఆచరించేవారు తక్కువే.
కానీ సామాజిక స్పృహ కలిగిన కొంతమంది మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి తమ వంతు సాయంగా సరికొత్త పరిష్కార మార్గాలతో ముందుకొస్తున్నారు. ఈ కోవకు చెందిన నేహా జైన్ టెక్ ఉద్యోగాన్నీ సైతం వదిలేసి మట్టిలో వేగంగా కలిసిపోయే బయోప్లాస్టిక్‌ను రూపొందిస్తోంది. సముద్ర నాచుతో తక్కువ ఖర్చుతోట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తోంది.
ముంబైకి చెందిన నేహా జైన్ చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించేది. బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో జర్నలిజం పూర్తిచేశాక, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో గూగుల్‌లో ఉద్యోగం సంపాదించింది. ఐదేళ్లపాటు వివిధ విభాగాల్లో పనిచేసిన నేహకు ఇంకా ఏదో చేయాలన్న తపన. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఆలోచిస్తున్న నేహ ఓ రోజు..‘‘రోజురోజుకి పెరిగిపోతున్న వ్యర్థాలు వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ సమస్య పరిష్కారానికి నా వంతు సాయంగా ఏదైనా మార్పు కలిగించేదిగా చేయాలి’’ అని అనుకుంది. అదేవిధంగా∙పర్యావరణానికి హాని చేయని జీవనశైలిని అనుసరించాలనుకుంది. అందుకే 2011లో కారు కొనుక్కోవడానికి బదులు సైకిల్‌ను ఎంచుకుంది. ఇలా ఒక్కో వస్తువును వినియోగించే ముందు పర్యావరణానికి అనుకూలంగా ఉండేవే ఎంచుకోవడం మొదలు పెట్టింది.
గూగుల్‌ను వీడి...
ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి చక్కని పరిష్కారం చూపాలని గట్టిగా నిర్ణయించుకున్న నేహ.. 2018లో గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. వెంటనే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పటిష్టంగా ఉండే వాటికోసం పరిశోధించడం మొదలు పెట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడానికి అనేక తయారీ కంపెనీలను సంప్రదించింది. ‘‘ఫాస్ట్‌మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎమ్‌సీజీ) కోసం ప్లాస్టిక్‌ను అధికంగా వినియోగిస్తున్నారు.
కానీ అవన్నీ రీసైకిల్ కావడం లేదు’ అని గ్రహించి మట్టిలో కలిసిపోయే సరికొత్త ప్లాస్టిక్‌ను రూపొందించడం కోసం తీవ్రంగా అన్వేషించి సముద్ర నాచుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాలనుకుంది. ఈ ఆలోచన రాగానే 2020 జూలైలో ‘జీరోసర్కిల్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి సముద్ర నాచుతో ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ తయారీ మొదలు పెట్టింది.
సముద్రనాచు ఎందుకంటే...
సముద్ర ఉపరితలంపై తొమ్మిదిశాతం సముద్రనాచు దట్టంగా పెరిగి ఉంటుంది. ఈ నాచు వాతావరణంలో 53 బిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తొలగిస్తుంది’’ అని ముంబై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న బయాలజిస్టుల ద్వారా తెలుసుకుంది. ఈ నాచును పెంచడానికి ఎరువులుగానీ, క్రిమిసంహారకాలు గానీ వినియోగించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా, నీరు, భూమిని కూడా కేటాయించాల్సిన పనిలేదు.
30–40 రోజుల్లోనే పెరిగి వినియోగానికి అందుబాటులోకి వస్తుంది అని క్షుణ్ణంగా తెలుసుకుని ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగులలోని శిలీంధ్రాలను సేకరించి ఎండబెట్టి, పొడి చేసి ఆ పొడితో ప్లాస్టిక్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోని మత్స్యకారుల ద్వారా ఈ నాచుని సేకరించి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ తయారు చేస్తోంది. 20 లక్షలతో ప్రారంభమైన జీరోసర్కిల్ కంపెనీ నేడు సముద్ర నాచులతో పారదర్శకమైన ప్లా్లస్టిక్ బ్యాగ్‌లను తయారు చేస్తూ దూసుకుపోతుంది. సొంత ఆర్‌అండ్‌డీ బృందంతో కాలుష్యరహిత సరికొత్త బయోప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది నేహ.
Comments
Please login to add a commentAdd a comment