‘ట్రాక్’లో ఆదర్శనారిగా గాయని రాజా కుమారి
బాయ్స్.. ఈ ‘ఉమెన్స్ డే’ కి అమ్మాయిలు పాడబోయే ఒక కొత్త సాయుధ గీతాన్ని మీ వీధి మైక్ లో నేషనల్ యాంథమ్ గా వినేందుకు సిద్ధంగా ఉండండి. చూస్తుంటే పాప్ గాయని రాజకుమారి సృష్టించిన ఈ సరికొత్త ‘ఐ యామ్ రెబల్..’ ట్రాక్ పురుషాధిక్యాన్ని అవనతం చేయబోతున్నట్లే ఉంది. ఇండిపెండెన్స్ డే కి ‘మా తుఝే సలామ్’, వినాయక చవితికి ‘జై జై గణేశా’ వినిపించినట్లుగా ఉమెన్స్ డే కి ఇక పై.. ‘ఐ యామ్ రెబెల్’ మార్మోగవచ్చు. ఇదొక జెండర్ ఈక్వాలిటీ జాతీయగీతం అనుకోండి!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తెలుగులో ఏమిటి? ఇది తెలుగే కదా! పోనీ తేలిగ్గా ఏమిటి? ‘ఇది నా రోజు. దిస్ ఈజ్ మై డే!’ ఎంత సింపుల్‌గా ఉంది. కరెక్ట్ అర్థం కూడా. ప్రతి‘ఉమెన్స్ డే’కి మనకు వినిపించే మాటలు.. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం. మరి ఆ మాటలకు అర్థం ఏమిటి? అదే.. తేలికైన భాషలో ఎలా చెప్తాం? పాప్ సింగర్ రాజా కుమారి అయితే చక్కగా, అబ్బాయిలకు అర్థమయ్యేలా చెబుతారు. అబ్బాయిలకా! అమ్మాయిలకు కదా అర్థం కావలసింది. కాదు. అబ్బాయిలకే.
స్త్రీ సాధికారతకు, స్త్రీ పురుష సమానత్వానికి రాజా కుమారి చెబుతున్న అర్థం.. ‘ఐ యామ్ రెబల్’. అదే మాటను ఆవిడ కియారా అద్వానీ, బాణి జె లతో కలిసి పాటగా చెబుతున్నారు. ఆటగా చెబుతున్నారు. ఆ పాట, ఆట ఉన్న వీడియో ట్రాకే.. ఐ యామ్ రెబల్. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో విడుదల అయింది.
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఈ ట్రాక్‌ను విడుదల చేశారు రాజా కుమారి. ఆ హిప్–హాప్ ట్రాక్ ఇప్పుడు అమ్మాయిల చేత ‘ఐ యామ్ రెబల్’ అంటూ సాయుధ గీతం పాడిస్తోంది. ఫెమినిస్టు ఉద్యమానికి రాగల కొద్ది రోజుల్లోనే ఈ ట్రాక్ ఒక సిగ్నేచర్ సాంగ్ అయినా కావచ్చు.
స్వాతంత్య్ర దినోత్సవానికి.. ‘మా తుఝే సలాం’, వినాయక చవితికి.. ‘జై జై గణేశా..’, ఇప్పుడిక మార్చి ఎయిత్‌కి ‘ఐ యామ్ రెబల్’!! అంతుందా? ఉంది. ఓసారి ఆ వీడియో చూడండి. 2 నిముషాల 11 సెకన్లు. అందులో మీకు మీరు కనిపిస్తారు. (బాయ్స్.. మీరు కాదు). అమ్మాయలూ.. మీరెలానైతే, ఎంతగానైతే దూకుడు గా ఉండాలనుకుంటారో.. అలాగే మీ ప్రతిరూపం అందులో కనిపిస్తుంది. పాడింది రాజా కుమారి. రాసింది రాజా కుమారి. ఆమె భావాలకు ఫీచరింగ్ ఇచ్చింది కియారా అద్వానీ. మ్యూజిక్ దంచేసింది.. అవును, దంచుడే.. డీజే సా! సంకేత్ అర్జున్‌వాడే. కియారాతో పాటు చిన్న స్లిప్‌గా వి.జె.బాణి కూడా జర్రున జారి వెళతారు. మొత్తం ముగ్గురమ్మాయిల తీన్‌మార్!
రాజా కుమారి అసలు పేరు శ్వేత. తను ఈ సాంగ్‌ని హిందీలో.. ‘నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నేను రెబెల్’ను అని రాశారు. శ్వేత ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్. ఇక రెండో అమ్మాయి కియా అద్వాని. బాలీవుడ్
నటి. మూడో అమ్మాయి బాణి.. వీజే, మోడల్, టెలివిజన్ హోస్ట్.
సమాజంలో స్త్రీలు, ఆడపిల్లల పట్ల ఏవైతే పురుషాధిక్య భావాలు ఉన్నాయో వాటిని ఈ ‘ఐ యామ్ రెబల్’లో ప్రశ్నించారు, ధిక్కరించారు, వెక్కిరించారు.. వీళ్లు ముగ్గురూ. ఇంటర్నేషల్ ఉమెన్స్ డేకి వీధి వీధిలో మోగాల్సిన, మార్మోగాల్సిన స్త్రీవాద జాతీయ గీతం అని మీకు అనిపిస్తే కనుక ఆశ్చర్యం లేదు. అంతగా గర్ల్ పవర్‌ను దట్టించి వదిలారు. పాటను లాస్ ఏంజెలిస్‌లో కొంత, ముంబైలో కొంత షూట్ చేశారు. రాజా కుమారి, కియారా, వి.జె. బాణితో పాటు మరికొందరు అమ్మాయిలు కూడా రెబలియన్‌లుగా కనిపించి, కవ్వించి, మెరుపులా మాయమైపోతారు.
రాజా కుమారి (శ్వేత)
Comments
Please login to add a commentAdd a comment