Priyanka Kumari: స్మార్ట్‌ ఫోనే మనకు అన్నీ చెప్పేస్తుంది | Priyanka Kumari: Woman Teacher in Bihar Mentors Peers Towards Digital Empowerment | Sakshi
Sakshi News home page

Priyanka Kumari: సీతామఢి.. టెక్‌ టీచర్‌

Published Wed, Jun 30 2021 8:17 PM | Last Updated on Wed, Jun 30 2021 8:23 PM

Priyanka Kumari: Woman Teacher in Bihar Mentors Peers Towards Digital Empowerment - Sakshi

ప్రియాంకకు విద్యాశాఖ ప్రశంస

ప్రియాంక కుమారి పంచాయితీ స్కూల్‌ టీచర్‌. అయితే ఏడాదిగా ఆమె ‘డిజీ–శావీ’ కూడా! లాక్‌డౌన్‌లో టీచర్స్‌ అంతా పిల్లలకు డిజిటల్‌ క్లాసులు తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు.. సాటి టీచర్స్‌ అందరికీ ఆమె డిజిటల్‌ టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 250 మంది ప్రభుత్వ మహిళా టీచర్లను డిజిటల్‌ వారియర్లుగా మలిచారు.

నదీతీరాలను అనుసరించి బిహార్‌ నాలుగు భాగాలుగా ఉంటుంది. ఆంగిక, భోజ్‌పురి, మగధి, మిథాలి. ప్రియాంక (36).. మిథాలి ప్రాంత పరిధిలోకి వచ్చే సీతామఢి లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల టీచర్‌. సీతామఢి పట్టణం, జిల్లా కేంద్రం కూడా. బిహార్‌లోని పై నాలుగు ప్రాంతాలు ఒకే భాషను మాట్లాడతాయి కనుక మాండలికం తప్ప భాష అర్థం కాకపోవడం ఉండదు. అయితే గత ఏడాది.. లాక్‌డౌన్‌ మొదలయ్యాక స్కూలు పిల్లలకు డిజిటల్‌ నాలెడ్జ్‌ అనేది నేర్చుకుని తీరవలసిన ఒక ‘భాష’ అయింది. అది పిల్లలకే కాదు, వాళ్ల తల్లిదండ్రులకు, టీచర్స్‌కి కూడా తెలియని భాష. ఆ భాషలోనే ఆన్‌లైన్‌ క్లాసులు జరగాలి. ఎలా? ఇందుకు ప్రియాంకకు ఒక ఆలోచన వచ్చింది. తనే టీచర్లందరికీ డిజిటల్‌ నాలెడ్జ్‌ని ఇస్తే! వాళ్లకు ఇస్తే పిల్లలకూ వచ్చేస్తుంది. పాఠాలు మాత్రమే చెప్పడం కాకుండా.. ఈమెయిల్స్‌ క్రియేట్‌ చెయ్యడం, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్, సోషల్‌ మీడియాను ఫాలో అవడం, అక్కడొచ్చే పోస్టులలో పిల్లలకు పనికొచ్చేవేమైనా ఉంటే షేర్‌ చేయడం, ఇంకా సెక్యూరిటీ రూల్స్, ఇతర డిజిటల్‌ సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రియాంక సాటి టీచర్లకు చెప్పడం మొదలుపెట్టారు.


మొదట 20 టీచర్‌లతో ప్రారంభమైన ఆమె శిక్షణ ఇప్పుడు సీతామఢి జిల్లాలోని పంచాయితీలో దాదాపు 250 మంది మహిళా టీచర్‌లకు  చేరింది. మరి ప్రియాంకకు అంత పరిజ్ఞానం ఎక్కడిది? ‘‘ఇదేమంత పెద్ద పరిజ్ఞానం కాదు. ఆసక్తి ఉంటే స్మార్ట్‌ ఫోనే మనకు అన్నీ చెప్పేస్తుంది’’ అని నవ్వేస్తున్నారు ప్రియాంక. ఈ డిజిటల్‌ శావీ (డిజిటల్‌ టెక్నాలజీపై అవగాహన కలిగిన వ్యక్తి) దగ్గర మెళకువలు నేర్చుకున్న టీచరమ్మలంతా ఇప్పుడు పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పగలుగుతున్నారు. కేవలం పాఠాలే కాదు, నిత్య జీవితంలో పనికొచ్చే డిజిటల్‌ విశేషాలను కూడా. 

ప్రియాంక బి.ఇడి. చేశారు. ‘ఎడ్యుకేషన్‌’లో మాస్టర్స్‌ డిగ్రీ చదివారు. 1985లో ఆమె పుట్టేనాటికి డిజిటల్‌ టెక్నాలజీ కాదు కదా.. ఇండియాలో కలర్‌ టీవీలు కూడా లేవనే చెప్పాలి. ఆమెకు పదేళ్లు వచ్చేసరికి అప్పుడప్పుడే దేశం ఇంటర్నెట్‌కు అలవాటు అవుతోంది. ఆమె డిగ్రీ అయ్యేనాటికి మొబైల్‌ ఫోన్లు, ఆ తర్వాత పదేళ్లకు స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. డిగ్రీ అయిన రెండేళ్లకు 2007 ఆమెకు సీతామఢిలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కూడా అయింది. ఈ మధ్యలో ఎక్కడా ప్రియాంక డిజిటల్‌ ప్రపంచంతో టచ్‌లోనే లేరు. నెట్‌లోకి ఫేస్‌బుక్‌ ప్రవేశించాక ఆమెకు సోషల్‌ మీడియా అనే వండర్‌ వరల్డ్‌పై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలోనే మహిళల ఉపాధికి, సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉండే టెక్నాలజీపై ఆమె శ్రద్ధ పెట్టారు. కొత్తకొత్త సంగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, వాటిని నేర్చుకుంటూ వచ్చారు. అదిప్పుడు ఈ లాక్‌డౌన్‌లో తనకే కాకుండా, తక్కిన టీచర్‌లందరికీ ఉపయోగపడుతోంది.

‘‘2020 జూన్‌ నుంచి నేను మహిళా టీచర్‌లకు ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాను. కష్టం అనుకుని నేర్చుకోడానికి సంశయించిన వాళ్లు.. ప్రాక్టికల్‌గా చూసి, ఆసక్తి కలిగి డిజిటల్‌ టెక్నాలజీని ఇష్టపడటం ఆరంభించారు..’’ అంటున్నారు ప్రియాంక. తన ప్రయత్నానికి ఆమె ‘డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఇనిషియేటివ్‌’ అని పేరు పెట్టారు. ‘‘అందులో చేరకుముందు వరకు నేను నా స్మార్ట్‌ ఫోన్‌ని కాల్స్‌ చెయ్యడానికి, వాట్సాప్‌ మెసేజ్‌లు చూడ్డానికి మాత్రమే వాడేదాన్ని. ప్రియాంక ఇచ్చిన ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌తో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పడు నాకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు ఉన్నాయి. వాటిని భద్రంగా యూజ్‌ చెయ్యడానికి అవసరమైన సైబర్‌ సెక్యూరిటీ టిప్స్‌ కూడా ప్రియాంకే చెప్పింది. ఇప్పుడైతే జూమ్‌ మీటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను’’ అని బథనహా మిడిల్‌ స్కూల్‌లో పని చేసే శివానీ అనే సీనియర్‌ టీచర్‌ చెబుతున్నారు. యోగబనా మిడిల్‌ స్కూల్‌ టీచర్‌ మధు కూడా.. ‘‘ఇప్పడు నేను ఆన్‌లైన్‌ వర్క్‌ ఏదైనా నా అంతట నేను చేయగలను. ఇదంతా నాకు ప్రియాంకే నేర్పించారు’’ అని అంటున్నారు. ప్రియాంక దగ్గర ఆన్‌లైన్‌ శిక్షణకు చేరిన వారు మొదటి రోజున.. ‘‘నేను నేర్చుకున్నాక మిగతా టీచర్లకు నేర్పిస్తాను’’ అని ప్రతిజ్ఞ పలకాల్సి ఉంటుందట! 

సీతామఢిలో ఇప్పుడు ఇంటింటికీ తెలిసిన పేరు ప్రియాంక. విద్యాశాఖ ఎప్పుడు ఏ డిజిటల్‌ ప్రోగ్రామ్‌ ను ప్రారంభించినా అందులోని సందేహాల గురించి మొదట ప్రియాంకకే ఫోన్‌ వెళుతుంది. ‘‘ప్రపంచాన్ని ఇప్పుడు డిజిటల్‌ టెక్నాలజీ నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు మనం ‘అప్‌డేట్‌’ కాకపోతే వెనకపడిపోతాం. పైగా అమ్మాయిలకు ఇప్పుడు చదువు, ఉద్యోగం అంటే కేవలం డిగ్రీలు, ఫైల్స్‌ మాత్రమే కాదు.. డిజిటల్‌ నాలెడ్జి కూడా. మహిళలు, బాలలకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వాటన్నిటకీ కూడా తొలి వేదిక ఆన్‌లైన్‌. ఆన్‌లైన్‌ని చూసి భయపడితే లైన్‌లోనే ఉండిపోతాం. లోపలికి అడుగుపెట్టాలి. లబ్దిపొందాలి’’ అని ప్రియాంక ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement