Prostate Gland: బాదంకాయంత ఉండే ఈ గ్రంథిలో ఒక్కసారిగా పెరుగుదల ఎందుకు? | Prostate Gland Enlargement Causes Symptoms How It Cured Explained In Telugu | Sakshi
Sakshi News home page

Prostate Gland: ఈ గ్రంథి లేనట్లయితే సంతానమే లేదు.. బాదంకాయంత సైజు నుంచి అమాంతం ఎందుకు పెరుగుతుంది?

Published Sun, Dec 26 2021 12:26 PM | Last Updated on Sun, Dec 26 2021 1:18 PM

Prostate Gland Enlargement Causes Symptoms How It Cured Explained In Telugu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Prostate Gland Enlargement Causes Symptoms How It Cured Explained In Telugu: పురుషుడిలో పునరుత్పత్తికి ప్రోస్టేట్‌ గ్రంథే కీలకం. అదే లేకపోతే సంతానమే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తే... అవి తేలిగ్గా ఈదుతూ వెళ్లేందుకు అవసరమైన ద్రవాన్ని ప్రోస్టేట్‌ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. వీర్యకణాలు అండాలను చేరుకునేవరకు నశించిపోకుండా... ప్రోటీన్లూ, ఎంజైములూ, గ్లూకోజూ, కాస్తంత కొవ్వుల సాయంతో కాపాడుతుంది ఈ ద్రవం.

అంతేకాదు... స్త్రీ శరీరంలో కాస్త ఆమ్లగుణం ఉండటం వల్ల... దాన్ని న్యూట్రలైజ్‌ చేసేలా ప్రోస్టేట్‌ ద్రవం కాస్తంత క్షారగుణం కలిగి ఉంటుంది. ఫలితంగా  ద్రవంలోని క్షారగుణం స్త్రీ శరీరంలోని ఆమ్లగుణాన్ని తట్టుకుని మరీ వీర్యకణాలను బతికించి, ఎట్టకేలకు గమ్యానికి చేర్చి అండం పిండమయ్యేలా తోడ్పడుతుంది. కానీ చిత్రమేమిటంటే... బాదంకాయంత ఉండే ఈ గ్రంథి 50 ఏళ్ల వయసు దాటాక అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు వచ్చే అనర్థాలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవలసిన చర్యలను తెలుసుకుందాం. 

నడి వయసు దాటాక కొంతమందిలో అమాంతం సైజు పెరిగిపోయే ప్రోస్టేట్‌ సాధారణంగా 18–22 గ్రాముల బరువుంటుంది. ఈ ప్రోస్టేట్‌ గ్రంథి మధ్య నుంచే మూత్రం బయటకు వచ్చే నాళం ఉంటుంది. ప్రోస్టేట్‌ గ్రంథి పెరగడం వల్ల చాలామందిలో కనిపించే లక్షణమేమిటంటే... మూత్రపు సంచి (బ్లాడర్‌)లో మూత్రం పూర్తిగా నిండిపోతుంది. అయితే సైజు పెరిగిన ప్రోస్టేట్‌ గ్రంథి మూత్రనాళాన్ని నొక్కేయడంతో మూత్రం బయటకు వచ్చే దారి ఉండదు.

ఓ పక్క కడుపు ఉబ్బిపోయిన ఫీలింగ్‌తో ఒత్తుగా మూత్రం వస్తున్నట్లు అనిపించడం... మరో పక్క అది ఎంతకూ బయటకు రాకపోవడం ఇబ్బందిగా మారుతుంది. వెంటనే హాస్పిటల్‌కు చేరిస్తే.. తొలుత ఓ పైప్‌ను ప్రవేశపెట్టి డాక్టర్లు లోపలున్న మూత్రాన్ని ఖాళీ చేస్తారు. ఆ తర్వాత సైజు పెరిగిన ప్రోస్టేట్‌కు అవసరమైన చికిత్స అందిస్తారు. 

ఎందుకిలా సైజుపెరుగుతుంది? 
కొందరిలో ప్రోస్టేట్‌ గ్రంథి సైజు అమాంతం ఎందుకు పెరుగుతుందో ఇప్పటికీ తెలియరాలేదు. ఓ వయసు దాటాక వృషణాల్లోని కణాలూ, వాటి నిర్మాణంలో వచ్చే మార్పులతో పాటు అవి ఉత్పత్తి చేసే టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ స్థాయుల మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నది వైద్యశాస్త్రవేత్తల విశ్లేషణ. 

లక్షణాలు 
ప్రోస్టేట్‌ పెరుగుదలలో రెండు విధాలైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ అవడం వల్ల కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్‌... అంటే మూత్రపు సంచి (బ్లాడర్‌) ఖాళీ కావడానికి సంబంధించిన లక్షణాలు. 

స్టోరేజీ 
∙రాత్రివేళలల్లో మామూలు కంటే ఎక్కువగా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం. 
∙పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. 
∙మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం. ∙మూత్రవిసర్జన విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం. 

వాయిడింగ్‌  
మూత్రవిసర్జనలో ఇబ్బంది. 
ధారళంగా కాకుండా... మూత్రపుధార చాలా మెల్లగా రావడం. 
మూత్రపు సంచి (బ్లాడర్‌) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం. 
మూత్రవిసర్జనలో నొప్పి. 
మూత్రం ఎంతోకొంత లోపలే ఉండిపోవడం. ∙ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తపు చారిక కనిపించడం (బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు ఇది కని
పిస్తుంది).

ప్రోస్టేట్‌ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • బలవంతంగా ఆపుకోకుండా వెంటనే మూత్రవిసర్జన చేసేయడం 
  • మూత్రవిసర్జన కోసం కొన్ని వేళలను నిర్ణయించుకుని... వచ్చినా రాకున్నా ఆ సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లడం. 
  • కెఫిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులూ, కాఫీ వంటివి తీసుకోకపోవడం లేదా చాలా పరిమితంగా తీసుకోవడం. 
  • రోజూ సాధారణంగా తాగేదానికన్నా మరీ ఎక్కువగా నీళ్లు తాగకపోవడం. 
  • నిద్రపోవడానికి  2 – 3 గంటల ముందుగా మాత్రమే నీళ్లు తాగడం. 
  • డాక్టర్‌ సలహా లేకుండా అలర్జీల కోసం / ఊపిరితిత్తుల్లోకి గాలి సాఫీగా ప్రవహించేలా చేసే డీ–కంజెస్టెంట్స్‌ లేదా యాంటీహిస్టమైన్‌ మందులు తీసుకోకపోవడం. ఇది బినైన్‌ ప్రోస్టేటిక్‌ హైపర్‌ప్లేసియా ముప్పును పెంచే అవకాశం ఉంది. 
  • చాలా చల్లని వాతావరణంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం. 
  • చురుగ్గా ఉండటం. అలా ఉండటం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. 
  • ఆసక్తి ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా పొత్తికడుపు కండరాలపై నియంత్రణను పెంచే  ‘కెగెల్స్‌ ఎక్సర్‌సైజ్‌’లు ప్రాక్టీస్‌ చేయడం. 
  • శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం. 

చికిత్స 
ప్రోస్టెటైటిస్‌ : ప్రోస్టేట్‌ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను ప్రోస్టెటైటిస్‌ అంటారు. మిగతా ఇన్ఫెక్షన్‌ల లాగానే దీనికి యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గుతుంది.  దీనికి సరైన యాంటిబయాటిక్స్‌తో కాస్త ఎక్కువ కాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది. 

మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం, మూత్రంలో ఎరుపు కనిపించడం,  మూత్రధారలో రక్తపు చారిక, మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యలు మందులతో అదుపు కాకపోతే  శస్త్రచికిత్స అవసరమవుతుంది. 

ప్రోస్టేట్‌ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైన్‌ ప్రోస్టేటిక్‌ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్‌ యురెథ్రల్‌ రిసెక్షన్‌ ఆఫ్‌ ప్రోస్టేట్‌’  (టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు. 

మరికొందరిలో లేజర్‌ సహాయంతో ‘లేజర్‌ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే... రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్‌ సైజు మరీ విపరీతంగా పెరిగినవారికీ, గుండె సమస్యలున్నవారికీ లేజర్‌ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి. 
 
పెరుగుదలలో రెండు రకాలు 
ప్రోస్టేట్‌ పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది. కణాల్లో ఎలాంటి హానికరమైన మార్పు లేకుండా కేవలం సైజు పెరగడం అన్నది మొదటిది. దీన్ని ‘బినైన్‌ ప్రోస్టేటిక్‌ హైపర్‌ప్లేసియా’ అంటారు. 

ఇక రెండోది ప్రమాదకరమైన పెరుగుదల. ఇందులో పెరుగుదల అన్నది క్యాన్సర్‌ కణాల వల్ల సంభవించి, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీస్తుంది. 

సమస్య నిర్ధారణ ఇలా... 

  • ఈ సమస్య నిర్ధారణ కోసం వైద్యులు తన వేళ్లను మల మార్గం గుండా లోనికి ప్రవేశపెట్టి వేళ్ల స్పర్శ సహాయంతో ప్రోస్టేట్‌ పెరిగినదీ, లేనిదీ తెలుసుకుంటారు. దీన్నే ‘డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌’ (డీఆర్‌ఈ) అంటారు.
  • మైక్రోస్కోప్‌ సహాయంతో మూత్రపరీక్ష (ఏదైనా ఇన్ఫెక్షన్‌ జాడల కోసం)
  • యూరిన్‌ కల్చర్‌  ∙మూత్ర ప్రవాహ వేగం (యూరనరీ ఫ్లో  / యూరోఫ్లోమెట్రీ)
  • మూత్రపిండాలు (కిడ్నీ), యురేటర్‌ (మూత్రపిండం నుంచి మూత్రపు సంచి వరకు ఉండే ట్యూబ్‌) , మూత్రపు సంచి (బ్లాడర్‌)ల పరిమాణంతో పాటు మూత్రపు సంచిలో మూత్రం మిగిలిపోతోందా అన్న విషయాలు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌. ∙బ్లడ్‌ యూరియా, క్రియాటినైన్‌ పరీక్షలు. 

-డాక్టర్‌ శ్యామ్‌ వర్మ,
రోబోటిక్‌ / ల్యాపరోస్కోపిక్‌ అండ్‌ లేజర్‌ యూరాలజిస్ట్, హైదరాబాద్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement