జనాభా పెరుగుదల వలన గ్రామాల నుంచి వలస వచ్చే ప్రజలతో నగరాలు, పట్టణాలు కిక్కిరిసిపోతు న్నాయి. ఫలితంగా నివాస స్థలం విలువ బాగా పెరిగింది. గతంలో ఒక అంతస్తుతో నిర్మించిన ఇళ్లు, పురాతన వారసత్వ సంపద వంటి ఇళ్లను సైతం తొలగించి, ఆ స్థలాల్లోను, ఇతర ఖాళీ ప్రదేశాలు అన్నింటిలోనూ 20... అంతకన్నా ఎక్కువ ఎత్తయిన భవనాల (ఆకాశ హర్మ్యాల)ను నిర్మించే సంస్కృతి ఇప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది.
ఫలితంగా ఇంధన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. నివాస గృహాలకు గిరాకీ పెరగటం వల్ల ఆకాశ హర్మ్యాల నిర్మాణాన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఆకాశ హర్మ్యాలు మెరుగైన అభివృద్ధికి సంకేతంగా గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ వాటి వలన ఇంధన వినియోగం విపరీతంగా పెరిగిపోవటం వంటి దుష్పరిణామాలను తక్కువగా బేరీజు వేస్తున్నాం.
ఒక అంతస్తు లేక తక్కువ అంతస్తులు గల ఇళ్లలో నివాసం ఉండే మనుషుల తలసరి విద్యుత్ వినియోగం కన్నా.. ఆకాశ హర్మ్యాలలో నివసించే వారి తలసరి విద్యుత్ వినియోగం ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ మేరకు తలసరి ఉద్గారాలు కూడా పెరిగిపోతాయనే వాస్తవాన్ని గమనించటం లేదు. ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ, ఐక్యరాజ సమితి ఎన్ని విధాల హెచ్చరించినప్పటికీ దాదాపు అన్ని దేశాలూ ఈ హెచ్చరికలను అసలు పట్టించుకోవడం లేదు.
ప్రపంచంలో అన్ని అవసరాలకూ వాడుతున్న మొత్తం ఇంధనంలో.. నివాస భవనాలకు 8 శాతం, నివాసేతర భవనాలకు 22 శాతం ఇంధనాన్ని వాడుతున్నాం. ఈ 30 శాతంలో.. ఆకాశ హర్మ్యాలకు 55 శాతం, ఇతర సాధారణ భవనాలకు మిగతా 45 శాతం ఇంధనం వాడుతున్నాం. ఇది కాకుండా.. ప్రపంచంలో అన్ని అవసరాలకూ వాడుతున్న మొత్తం ఇంధనంలో మరో 5 శాతం ఇంధనాన్ని భవన నిర్మాణ (ఆకాశ హర్మ్యాలు, సాధారణ భవనాలు సహా) పరిశ్రమ ఉపయోగిస్తోంది.
6 అంతస్తులు లేదా అంతకంటే తక్కువ ఎత్తులో నిర్మించే కార్యాలయ భవనాల కంటే ఇరవై లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కలిగిన ఆకాశ హర్మ్యాలలో ఇంధన వినియోగం దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. చలి దేశాల్లోని గృహసముదాయాలకు వేడి నీటి సరఫరా సౌకర్యం ఉంటుంది. అయితే దీనికోసం వినియోగించే గ్యాస్ .. తక్కువ ఎత్తయిన భవనాల్లో కంటే ఆకాశ హర్మ్యాల్లో 40 శాతం పెరుగుతుంది. తక్కువ అంతస్తులతో కూడిన భవనాలతో పోల్చితే ఆకాశ హర్మ్యాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 60 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో వెల్లడైంది.
మనలాంటి ఉష్ణమండల దేశాల్లో ఈ ఉద్గారాలలో ఎయిర్ కండిషనింగ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇటుకల గోడలకు బదులుగా చుట్టూ అద్దాలను బిగించిన (గ్లాస్ ఫెకేడ్) ఆకాశ హర్మ్యాలలో వార్షిక తలసరి ఇంధన వినియోగం 1300–1500 యూనిట్ల మేరకు ఉంటుందని అంచనా. పర్యావరణ అనుకూల భవనాలతో పోలిస్తే.. ఆకాశ హర్మ్యాలలో వార్షిక తలసరి ఇంధన వినియోగం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
-ఎం. రాజ్‌రెడ్డి, పర్యావరణవేత్త
చదవండి Pudami Sakshiga: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!
Pudami Sakshiga: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?
Comments
Please login to add a commentAdd a comment