మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు. సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో... అంటూ శపించాడు. తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమని తిరిగి అన్నను శపించాడు.
ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రుభావనలుండిపోయాయి. తరచూ కలహించుకుంటూండేవి. ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే... ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు. ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి. అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు... కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు.
చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది. చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది. చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు.
సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్ టెండూల్కర్ క్రికెట్ ఆటను నేర్పించే అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్ నెగ్గలేకపోయాడు. శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. కానీ అన్న వదలకుండా... ‘‘మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు.
ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల. అబ్దుల్ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది. ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ...
అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు. అదే బద్దెనగారు చెప్పేది... ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు... కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా.. ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది.
కుడి ఎడమలు వేరు కాదు...
Published Mon, Jan 24 2022 12:33 AM | Last Updated on Mon, Jan 24 2022 12:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment