ప్రతీక్ దీక్షిత్, రోహన్ నాయక్, నిశాంత్
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్‌ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్‌ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్‌లతో దూసుకుపోతుంది...
కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది.
ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్‌పాస్ కోసం ఎఫ్‌ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్‌గా ఉండేది.
‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు.
‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్.
ఐఐటీ–ఖరగ్‌పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్‌లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు.
మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్ అన్యూవలైజ్‌డ్ రెవెన్యూ రన్‌రేట్(ఏఆర్‌ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు.
‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్‌లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్‌లలో ఒకరైన నిశాంత్.
రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్‌లుగా ఉన్నాయి. ఎపిసోడ్‌లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి.
‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్‌లో కొన్ని హిట్ టైటిల్స్...
యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్‌వీర్(129 మిలియన్)...మొదలైనవి.
‘పాకెట్‌ఎఫ్‌ఎం’లో 733 ఆడియో సిరీస్‌లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఆన్‌లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు టాప్ 5 సిటీస్‌గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్‌ఎఫ్‌ఎం’ పాపులర్ అవుతుంది.
లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్‌ఎం’ యాడ్–టెక్ ప్లాట్‌ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది.
‘పాకెట్ ఎఫ్‌ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్‌స్పీడ్, టెన్‌సెంట్, టైమ్స్ ఇంటర్నెట్‌లాంటి కీ ఇన్వెస్టర్‌లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్‌లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.
‘టీమ్ మెంబర్స్‌కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్‌కు చెందిన సంకల్ప్ గుప్తా.
పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్‌ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం.
పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది.
– ప్రతీక్ దీక్షిత్
Comments
Please login to add a commentAdd a comment