-
బుల్లి వాచీకి భారీ ధర
వందేళ్ల క్రితం 1,500 మందికి పైగా ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన టైటానిక్ నౌక విషాదం అందరికీ తెలిసిందే. ఆ విపత్తు బారి నుంచి 700 మందిని కాపాడినందుకు ఆర్ఎంఎస్ కర్పతియా నౌక కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్కు బహూకరించిన పాకెట్ వాచీ ఇది. ఈ బుల్లి బంగారు వాచీ తాజాగా వేలంలో 20 లక్షల డాలర్లు పలికింది! -
బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్..!
బ్యాంక్ అకౌంట్‌తో పని లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఫిన్ టెక్ సంస్థ మొబీక్విక్ (MobiKwik). తన ప్లాట్‌ఫారమ్‌లో 'పాకెట్ UPI' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుందని ఫిన్‌టెక్ కంపెనీ పేర్కొంది. పాకెట్ UPI వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తద్వారా వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అదనపు ఎంపికతో వారి చేతుల్లో మరింత శక్తిని ఇస్తుందని వన్ మొబీక్విక్ లిమిటెడ్ (మొబీక్విక్) కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పాకెట్ యూపీఐ యూజర్లు వారి బ్యాంక్ ఖాతా కాకుండా మొబీక్విక్ వాలెట్ నుంచి డబ్బులను బదిలీ చేయడం ద్వారా తప్పు లావాదేవీలు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బహిర్గతం పరిమితం అవుతుంది. -
పర్సు పోయిందని.. పోలీస్‌స్టేషన్ భవనం పైకెక్కి.. యువకుడి హల్చల్!
కరీంనగర్: కరీంనగర్ బస్టాండ్‌లో నా పర్సు పోయింది.. దొరకకుంటే చచ్చిపోతానంటూ ఓ యువకుడు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ భవనం పైకి ఎక్కి, హంగామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని జంగపల్లికి చెందిన చింటు అలియాస్ రాజు పర్సును శనివారం రాత్రి కరీంనగర్ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి దొగిలించాడు. రాత్రి నుంచి పోలీసులకు చెబుతుంటే పట్టించుకోవడం లేదంటూ ఆదివారం ఠాణా భవనం పైకి ఎక్కి కూర్చున్నాడు. పర్సు దొరకకుంటే దూకి చనిపోతానని బెదిరించాడు. పోలీసు సిబ్బంది అతన్ని కిందకు దింపే ప్రయత్నం చేసినా వినకుండా అరగంటపాటు హంగామా చేశాడు. చివరికి రాజును మాటల్లో పెట్టి, పైకి వెళ్లి తీసుకువచ్చారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు పేర్కొన్నారు. -
యువ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ: ఎప్పుడూ అవే పాటలా.. పాకెట్ ప్రపంచంలోకి
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్‌లతో దూసుకుపోతుంది... కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్‌పాస్ కోసం ఎఫ్‌ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్‌గా ఉండేది. ‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు. ‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్. ఐఐటీ–ఖరగ్‌పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు. మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్ అన్యూవలైజ్డ్ రెవెన్యూ రన్‌రేట్(ఏఆర్ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్‌లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్లలో ఒకరైన నిశాంత్. రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్లుగా ఉన్నాయి. ఎపిసోడ్లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి. ‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్‌లో కొన్ని హిట్ టైటిల్స్... యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్వీర్(129 మిలియన్)...మొదలైనవి. ‘పాకెట్ఎఫ్ఎం’లో 733 ఆడియో సిరీస్‌లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఆన్లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు టాప్ 5 సిటీస్‌గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్ఎఫ్ఎం’ పాపులర్ అవుతుంది. లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్ఎం’ యాడ్–టెక్ ప్లాట్‌ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది. ‘పాకెట్ ఎఫ్ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్‌స్పీడ్, టెన్సెంట్, టైమ్స్ ఇంటర్నెట్లాంటి కీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ‘టీమ్ మెంబర్స్‌కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్కు చెందిన సంకల్ప్ గుప్తా. పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్‌ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం. పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది. – ప్రతీక్ దీక్షిత్ -
Pocket Dress: ఆమె ధరించే దుస్తులకు.. ప్రయోగాల పాకెట్!
‘మీరు బయటకు వెళ్లే సమయం లో వెంట ఓ ఫోన్, కొంత డబ్బు, కార్డుల్లాంటివి తీసుకెళ్లడం తప్పనిసరి. మీ డ్రెస్‌కి జేబులు ఉంటే చేతులను ఫ్రీగా వదిలేసి, సౌకర్యంగా ప్రయాణించే వీలుంటుంద’నే లక్ష్యంతో దుస్తులను రూపొందించి, దానినే వ్యాపారంగా మార్చుకుంది కేరళవాసి జయలక్ష్మి. ‘మహిళల దుస్తులను నేటి కాలానికి తగిన విధంగా రూపొందించాలి. ఆమె ధరించే దుస్తులకు పాకెట్స్ ఉండటం వల్ల ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి’ అంటారు త్రిసూరులో ఉంటున్న జయలక్ష్మీ రంజిత్. పాకెట్స్.13 పేరుతో ప్రస్తుత స్థితిని మార్చడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానంటోంది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! లాక్డౌన్ టైమ్‌లో రూపకల్పన పాకెట్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినిదే అయినా 20 వ శతాబ్దం వరకు మహిళ లు ఉపయోగించే దుస్తులకు జేబులు ఉండటం అరుదైన విషయమే. ‘అవి కూడా చాలా సన్నగా ఉన్న మహిళలు ధరించే ప్యాంట్స్‌కు అంతే నాజూకుగా, శృంగారపు మూలాలకు సూచికగా ఉండేవి’ అంటారు జయలక్ష్మి. అగ్రికల్చర్ ఇంజినీర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అయిన జయలక్ష్మి కరోనా సమయంలో పరిస్థితుల కారణంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఖాళీగా ఉన్న ఆ సమయం తన ఆలోచన రూపుకట్టడానికి బాగా ఉపయోగపడిందనే జయలక్ష్మి, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పాకెట్ డ్రెస్ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. చిన్నప్పుడే అనుకున్నాను మహిళల కోసం రూపొందించిన జీన్స్, ప్యాంట్లను జయలక్ష్మి తరచి తరచి చూస్తుంటుంది. ‘ఎందుకంటే, నేను పురుషులకు రూపొందించిన నా సైజు జీన్స్ కొన్నాను. వాటిని ధరించి, నా ఫోన్ వెనుక జేబులో ఉంచినప్పుడు, అది జారి కిందపడిపోయింది. పైగా నాకు అలా వెనుక వైపు పాకెట్‌ను ఉపయోగించే అలవాటు లేదు. చిన్న చిన్న పాకెట్స్ కేవలం కొన్ని నాణేలు ఉంచడానికి సరిపోతాయి. అందుకే, పురుషులందరికీ ఒకే విధంగా ఉండేలాంటి ఫంక్షనల్ పాకెట్స్ మహిళల దుస్తుల్లో ఉండకూడదనుకున్నాను’ అని తన పాకెట్ రూపకల్పన గురించి వివరిస్తుంది. ‘నాకు ఆరేడేళ్ల్ల వయసున్నప్పుడు డ్రెస్‌కు పాకెట్స్ పెట్టించమని మా అమ్మను అడిగేదాన్ని. దానికి మా అమ్మ పెద్ద శిక్షగా భావించేది. నేనే టైలర్ ఆంటీతో పరిచయం పెంచుకొని, నచ్చిన పాకెట్స్‌తో డ్రెస్ కుట్టించుకునేదాన్ని’ అని తన చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. జేబును బట్టి డ్రెస్ చదువు, ఉద్యోగం కోసం నగరానికి వెళ్లినప్పుడు కూడా ‘పాకెట్స్’అనే విషయం జయలక్ష్మి నుంచి దూరం కాలేదు. తన డ్రెస్సులను తనే సొంతంగా డిజైన్ చేసుకునేది. స్నేహితులు, సహోద్యోగులు ఆమె పాకెట్ దుస్తులను చూసి, తమకు కూడా డిజైన్ చేసిమ్మని అడిగేవారు. ‘అప్పుడు సమయం కుదరలేదు. మహమ్మారి మొదట్లో తగినంత సమయం ఉండేది. దీంతో కొన్ని డిజైన్లు పాకెట్ ఆధారంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించాను. చిన్న, మధ్యస్థ, లార్జ్ డ్రెస్సుల్లోనూ వాటికి తగిన విధంగా పాకెట్స్ రూపొందించాను. కొన్ని డిజైన్లు అందంగా ఉన్నాయని, కొన్ని డిజైన్లు అంతగా నప్పలేదని నా స్నేహితులే చెప్పారు. చాలా బాధపడ్డాను కూడా. దీంతో కొంతమంది టైలర్లను కలిసి, వారితో నా డిజైన్ల గురించి చర్చించాను. కొన్ని డిజైన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ఆర్డర్ చేసుకున్నవారు మీ శరీర కొలతలను పంపిస్తే, దానిని బట్టి రెండు వారాల్లో పాకెట్ డ్రెస్ డిజైన్ చేసి, పంపిస్తాను’ అని చెప్పాను. అలా ఒక రోజులో రూ.70 వేలు సంపాదించాను’ అంటారు జయలక్ష్మి. మార్కెట్లో పాకెట్ డ్రెస్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాకెట్స్.13ను వివిధ వాణిజ్య బ్రాండ్లకు దీటుగా రంగంలోకి దింపుతోంది జయలక్ష్మి. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
జేబులో ఉన్న మొబైల్‌తో మంటలు!
ఇస్లామాబాద్: మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతుంటే పేలిపోయిన ఘటనలు మనం చూశాం. అయితే జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌కు అకస్మాత్తుగా మంటలంటుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి. దీంతో ఆర్తనాదాలు చేస్తూ అతడు రోడ్డుపై పరిగెడుతోంటే.. అక్కడి వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంతలోనే అక్కడి స్థానిక మార్కెట్లోని ఓ వ్యక్తి బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి అతనిపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి ఎవరో దీనిని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. -
అయితే.. ఓకే
సాక్షి ప్రతినిధి, కడప: చేయి చేయి కలుపుదాం.. మద్యం వ్యాపారులను ఏకం చేద్దాం.. మందుబాబుల జేబులకు చిల్లులు పెడదాం. అడ్డుగా నిలిచే నాయకులను మచ్చిక చేసుకుందాం.. ఎవరి ఆదాయం వారికి తగ్గకుండా చూద్దాం.. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘన, బెల్ట్‌షాపులపై చూసీ చూడనట్లు వెళదాం.. నెలనెలా అక్రమ ఆదాయానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుందామంటూ ఎక్సైజ్‌శాఖలోని ఉన్నత స్థాయి అధికారి ఉద్బోధ చేశారు. ఇందుకు మద్యం వ్యాపారులు జైకొట్టారు. అడ్డుతగిలిన ఓనాయకుడిని మచ్చిక చేసుకుని మామూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వాటి పరిధిలో సుమారు 2వేలకు పైగా బెల్ట్‌షాపులుండేవి. క్రమం తప్పకుండా ఎక్సైజ్ యంత్రాంగానికి నెలవారీ మామూళ్లు లభించేవి. ఈమారు బెల్ట్‌షాపులు నిర్వహించరాదని ప్రభుత్వం గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం బెల్ట్‌షాపులను నడపొద్దని ఎక్సైజ్ యంత్రాంగం మద్యం వ్యాపారులకు ఆంక్షలు విధించింది. దీంతో నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం. బెల్ట్‌షాపులు లేకుండా ఎలా ఆదాయం వస్తుందని.. మీకెందుకు మామూళ్లు ఇవ్వాలని నిలదీసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ యంత్రాంగమే సలహా ఇచ్చినట్లు సమాచారం. మీకు దండిగా డబ్బులు వస్తేనే మాకు మామూళ్లు ఇవ్వండంటూ ఉపదేశం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు నిబంధనల గేట్లు ఎత్తేశారు. బెల్ట్‌షాపులతో పాటు యధేచ్ఛగా అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నా ఎక్సైజ్ యంత్రాంగం చూసీ చూడనట్లు ఉండిపోతోంది. అధికరేట్లకు మద్యం విక్రయాలు... జిల్లాలోని 269 మద్యం షాపులకుగాను టెండర్లలో 208 కేటాయించారు. 61 షాపులకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రీటెండర్లు ఆహ్వానించారు. రీ నోటిఫికేషన్లో కేవలం ఒక్క షాపును మాత్రమే దక్కించుకున్నారు. ప్రస్తుతం 60 షాపులు మిగిలిపోయాయి. ఒక్కొక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్ల విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.5కు అధికంగా విక్రయించుకుంటే ప్రతి నెలా సుమారు రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని అందులో రూ.50వేలు మాత్రమే తమకు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారి ఒకరు కోరినట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారుల అండ చూసుకున్న మద్యం వ్యాపారులు బాటిల్ మీద రూ.10 అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతినెలా సరాసరి విక్రయాలద్వారా మందుబాబులు అదనంగా సుమారు రూ.9కోట్లు భరించాల్సిన పరిస్థితి కల్గుతోంది. అధికార పార్టీ నేత అడ్డగించడంతో.... అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తుండటంతో అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు అడ్డుపడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయాలు చేపట్టాలని, ఎందుకు మద్యం వ్యాపారులను , బెల్ట్‌షాపులను ప్రోత్సిహ స్తున్నారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం. ఎమ్మార్పీ మేరకు విక్రయాలు నిర్వహిస్తారా? ధర్నాలు చేపట్టాలా అంటూ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని బెదిరించడంతో ఎక్సైజ్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. మాకు లభించే మామూళ్లలో ప్రతినెలా మీకూ సమర్పించుకుంటామని మధ్యస్థంగా పంచాయితీ చేసినట్లు సమాచారం. ఆ మేరకు ప్రతినెలా రూ.8లక్షలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఎక్సైజ్ శాఖ అప్పగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో అధికరేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిని కట్టడి చేయాలని సిబ్బందిని ఆదేశించాను. ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరిపేటట్లు చూడాలని స్పష్టం చేశా..బెల్ట్‌షాపులను కూడా అరికడతాం.. ఎక్కడైనా అధిక రేట్లతో మద్యం విక్రయిస్తుంటే సమాచారం ఇవ్వాలి.. ఇందుకు సంబంధించి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. -
టీడీపీ నాయకుల జేబుల్లోంచి జీతాలు ఇవ్వట్లేదు..
నిడమర్రు (మంగళగిరి రూరల్) అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము అని, టీడీపీ నాయకుల జేబుల్లో నుంచి కాదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నిడమర్రులో పొలం పిలుస్తోంది కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయనకు రైతులతోపాటు ప్రజాప్రతినిధులు తమకు కార్యక్రమంపై సమాచారం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే వ్యవసాయశాఖాధికారి బి.శ్రీకృష్ణదేవరాయలు, వ్యవసాయ విస్తరణాధికారి భాగ్యరాజులను ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలం పిలుస్తోంది ఉద్దేశం ఏమిటో రైతులకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహణ ఎందుకు అంటూ ధ్వజమెత్తారు. గత నెల 16న మంగళగిరి టీడీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి ముఖ్యఅతిథిగా ఆహ్వానించి నీరుకొండలో కార్యక్రమం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంపై ఏడీఏ వివరణ ఇవ్వాలని ఫోన్లో ఆదేశించారు. వెంటనే ఏడీఏ తిరుమలాదేవి నిడమర్రు చేరుకున్నారు. కిందిస్థాయి సిబ్బంది తప్పిదంతో పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం ప్రొటోకాల్ ఉల్లంఘన కింద వస్తుందని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి పాల్గొన్నారు. వ్యవసాయాధికారుల వ్యవహారశైలికి నిరసనగా ఎమ్మెల్యే ఆర్కే, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమకొండ్ల నాగరత్నం తదితరులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. -
ఇవ్వాళ్ట్టి జేబు చిల్లు...! రేపటికి గుండెకు గండి...!!
సరదాగా... ‘‘ఈమధ్య మీ ఖర్చు చాలా పెరిగింది. గొంతు చిల్లులు పడినట్లు నేను చెబుతున్నా, జేబుకు చిల్లులు పడినట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అర్జెంటైతే తప్ప ఆఫీసు నుంచి ఇంటికీ ఇంటి నుంచి ఆఫీసుకూ బస్సులోనే వెళ్తుండండి’’ అన్నాను. శ్రీవారికి ఓ అలవాటుంది. నేను దేన్నైనా తప్పు అంటే చాలు, అదే రైటని సమర్థించడానికి ప్రయత్నిస్తుంటారు. ‘‘ఆదాయానికి కాస్త చిల్లు ఉండాలోయ్. అప్పుడే అన్ని వర్గాలకూ సంపద చేరుతుంది. ఆటోలో వచ్చాననుకో... అప్పుడు ఆటోవాడూ, నీసాటిదే అయిన వాడి పెళ్లాం, మన చిన్నారుల్లాంటి... వాడి పిల్లలూ.. అంతా నాలుక్కాలాలుంటారు. నాలుక్కూరలు తింటారు. అందుకే అప్పుడప్పుడూ తెగించి జేబుకు కాస్త చిల్లు వేస్తుండాలి’’ అన్నారాయన. ఆయనకు ఇష్టమైన మిస్సమ్మ పాటలో చెప్పాలంటే... ఆయనదంతా ‘తనమతమేదో తనదీ... మనమతమసలే పడని’ రెటమతం. ఈ మగాళ్లు ఏదో అంటారుగానీ....‘ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే‘ అనే టైపు వాళ్లదే. అందుకే మళ్లీ చిల్లు గొప్పదనం చెప్పడం మొదలుపెట్టారు. ‘‘మొదట్లో అట్లకాడనే బోలుగా చేసి ఆ గరిటతోనే నూనెలోంచి వడలూ, గారెలు తీసేవారట. కానీ నూనెంతా దాంట్లోనే నిలిచిపోతూ ఉండేదట. మిస్సమ్మలో చెప్పినట్లు ‘తైలం’ చాలా విలువైనది కాబట్టి తైలాన్ని రక్షించుకోడానికి చిల్లు పెట్టి దాన్ని జల్లిగంటె చేశారట. ఇవాళ్టి మన జేబుకు చిల్లు సాటి పేదలకు వరాల జల్లు’’ అంటూ ఓ ఇన్స్టాంట్ ఉపన్యాసం ఇచ్చారు. ‘‘అందుకే అప్పట్లో మీకు ఈసీజీ తీయిస్తే గ్రాఫు హెచ్చుతగ్గులుండాల్సిన చోట సమసమాజం, సామ్యవాదం అనే పదాలు పడ్డాయట. దాంతో కంగారు పడ్డ డాక్టర్లు మీ తలకాయకు సీటీ స్కాన్ చేయిస్తే అందులో ఏమీ కనిపించలేదట... పరోపకారం అనే అక్షరాలు తప్ప. అలాగే ఎక్స్‌రేలో మీ చేతికి ఎముక కనపడలేదట. మీ పరోపకారం కుటుంబానికి కారం, జేబుకు భారం కాకూడదు. అదీ నేను చెప్పేది’’ అంటూ ఏదో చెప్పబోయా. కానీ చిల్లు గొప్పదనాన్ని చెప్పడం మానలేదు. దాంతో ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి చెప్పా. ‘‘అప్పట్లో ఒకసారి మీ పేగుకు చిల్లు పడితే అర్జెంటుగా దాన్ని మూసేందుకు ఆపరేషన్ చేసేసి మిమ్మల్ని రక్షించారంటూ మీరే చెప్పలా.గుండెను రక్షిస్తూ ఉండే పెరికార్డియమ్ పొరకు మరింత రక్షణగా ఉండే పై పొరే జేబు. ఇవ్వాళ్టి జేబుకు చిల్లే... రేపటికి గుండె వరకూ గండిగా మారవచ్చు. పేగుకు పడితేనే చిల్లు - పెరిగిందంతగా హాస్పిటల్ బిల్లు. ఇక గుండెకు గండి పడితేనో? అందుకే ఇకనైనా పొదుపుగా ఉండండి’’ అంటూ ఉపదేశించా. దాంతో ఆయనిక సెలైంటైపోక తప్పలేదు. సెలైంటైనా తప్పులేదు. -
అద్వైతం
జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞాన, కర్మ, యోగ ఫలములను ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును. - భగవద్గీత ‘‘ఆడికి బూమ్మీద నూకలు సెల్లిపోనాయి బాబు. ఎల్లిపోనాడు’’ తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు.వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను. లుంగీ కట్టుకొని, టవల్ భుజం చుట్టూ వేసుకొని హడావిడిగా మెట్లు ఎక్కుతున్న నాకు, గుమ్మం ముందు నిండిపోయిన చెత్తబుట్ట కంపు కొడుతూ కనబడింది. ఈ అపార్ట్మెంట్ దరిద్రాలలో ఇదొకటి. పెరడు, ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉండదు. లక్షలు పోసి కొనుక్కున్నా ద్వారం ముందు చెత్తబుట్ట ఉంచాల్సిన దౌర్భాగ్యం. తలుపు తీసిన నా భార్యని, ‘‘ఏ...., ఆదిగాడు రాలేదా? ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పవచ్చు కదా. తీసికెళ్లి కింద పారేసేవాడిని’’ అంటూ విసవిసా బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాను. రెండు రోజుల బడలిక వల్ల వెంటనే నిద్ర వచ్చేసింది. మా కంపెనీ ఎండీ కొడుకు క్రితంరోజు పొద్దున యాక్సిడెంట్లో చనిపోయాడు. నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకురావడం మొదలు, ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు అక్కడే సరిపోయింది నాకు. ఊళ్లోని మా ఇంటి పెరట్లో చేతి పంపు ఉండేది. చావు దగ్గర నుంచి వచ్చేటప్పుడు వెనగ్గా వెళ్లి ఆ బట్టలు తడిపేసి, వాటిని అక్కడే విడిచేసి ఇంట్లోకి వెళ్లడం మాకు అలవాటు. ఈ సిటీలో అవన్నీ కుదరక, వాచ్‌మెన్‌తో బకెట్ నీళ్లు తెప్పించుకొని, నెత్తిమీద పోసుకుని ఫోన్‌చేసి, నా భార్యతో టవల్ లుంగీ కిందకి తెప్పించుకొని చుట్టుకొని వచ్చి పడుకున్నాను. తరువాతి రోజు సాయంత్రం నేను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా చెత్త బుట్ట నిండుగానే ఉంది. దానికి ఓ ప్లాస్టిక్ కవర్ కూడా తోడైంది. మా అంతస్తులో అందరి ప్లాట్ల ముందు అలాగే ఉన్నాయి. తలుపు తీసిన నా భార్యను మళ్లీ నిన్నటి ప్రశ్నే వేశాను. ‘‘ఆదిగాడు రాలేదా?’’ అని. ‘‘లేదు. ఆ వాచ్‌మెన్‌ను తీసుకెళ్లమంటే అన్ని ప్లాట్లది మోసుకెళ్లలేనంటున్నాడు’’ ఉక్రోషంగా చెప్పింది మా ఆవిడ. డ్రెస్ మార్చుకోకుండానే కిందకు వెళ్లి వాచ్‌మెన్‌ను కేక వేశాను. జవాబు లేదు. మెట్ల కింద అతని రూం తలుపు తీసే ఉంది కానీ మనుషులు లేరు. నడుచుకుంటూ వీధి చివరికి వెళ్లాను. అక్కడే ఖాళీ స్థలంలో ఆదిగాడు వాళ్లు ఉండేది. వాడి గుడిసె ముందు టెంటు వేసి ఉంది. ఏదో ఫంక్షన్ అనుకుంట అని వెనుదిరిగాను. నన్ను చూసి మా వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. ‘‘ఆదిగాడు రెండు రోజుల నుంచి రావడం లేదంటేనూ కేకలేద్దామని వచ్చాను. ఏంటి ఫంక్షన్?’’‘‘ఆయీ! తవకి తెల్దండీ? పేపర్లో కూడా ఏశారండి.’’‘‘ఏంటి?’’ అసహనంగా అడిగాను నేను. ‘‘ఆదిగాడు మొన్న రేతిరి తాగి రోడ్డు దాటతా లారీకి అడ్డంపడి చచ్చిపోనాడండి’’ విన్నది అర్థమవటానికి క్షణకాలం పట్టింది నాకు. ‘‘అయ్యో! నారాయణ ఉన్నాడా? ఆదిగాడికి పెళ్లి కూడా అయినట్టు ఉందే?’’‘‘ఉన్నాడండి. పిల్లోడు కూడానండే’’ టెంటు వేసి ఉన్న గుడిసె దగ్గరకు వెళుతుంటే ఎదురు వచ్చాడు నారాయణ. ఫుల్లుగా తాగి ఉన్నాడు. ‘‘నాకు తెలీదు నారాయణా. చిన్న వయసు. పాపం ఓ పిల్లాడు కూడానట కదా’’ పరామర్శించాను. ‘‘ఆడికి బూమ్మీద నూకలు సెల్లిపోనాయి బాబు. ఎల్లిపోనాడు’’ తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు. వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను. రేపు మా ఎండీ కొడుకు వర్ధంతి. సేవాకార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేశారు. వెంటనే నాకు ఆదిగాడు గుర్తుకు వచ్చాడు. వాడి భార్యని రేపటి సంతర్పణకి రమ్మంటే బాగుంటది, అంతో ఇంతో ధన రూపేణ లేదా వస్తు రూపేణ ముడుతుంది కదా అనిపించింది. వాచ్మెన్ చేత నారాయణను పిలిపించాను. ‘‘రేపు ఆదిగాడి సంవత్సరీకం కదా ఏం చేస్తున్నావురా?’’ ‘‘నా నేటి సేత్తానయ్యా. ఇప్పుడు తవరు చెప్పేదాకా అసల నాకు ఆ ఉసే తెల్దు. యేడాది అయీపోనాదని. పండగెల్లి పోనాక వారం పైన చచ్చాడు. ఇంకా పండగ రాలేదు కదుండే’’ తల గోక్కుంటా అడిగాడు. వాడి నిర్లక్ష్య వైఖరి నాకు కోపం తెప్పించింది. తమాయించుకొని, ‘‘ఈసారి పండగ వచ్చే నెలలో వస్తుంది గానీ, రేపు నువ్వూ నీ కోడలూ స్టేడియం దగ్గరకు రండి. మా కంపెనీ ఓనరు కొడుకు కూడా అదే రోజు పోయాడు. వాళ్లు రేపు దానాలు చేస్తారు. తీసుకుపోదురు గాని’’, వాడు సరేనని తల ఊపి వెళ్లిపోయాడు. రెండో రోజు పొద్దున్నే హడావుడి మొదలైంది. సొంత పొలంలో కట్టించిన సమాధి వద్దకెళ్లి శ్రద్ధాంజలి ఘటించి, అబ్బాయిగారి పేరున అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చివరికి స్టేడియం వద్దకొచ్చాము. అప్పటికే అక్కడ జన సందోహం భారీగా ఉంది. ఎండీగారు కొడుకు ఫొటో జ్యోతి ప్రజ్వలన గావించి, కొడుకు పేరున ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి కోడలిని జీవిత కాల ఛెర్మైన్‌గా నియమించారు. తన కంపెనీలో పాతిక శాతం వాటా ఆమెకు చెందేలా రాసిచ్చి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ శాఖకు ఆమెను డెరైక్టర్‌గా నియమించారు. ఉదయం నుంచి రకరకాల కార్యక్రమాల ద్వారా తన మగనికి నివాళులు అర్పిస్తున్న ఆ నడి వయసు ముదితను చూస్తే, నాకు కడుపు తరుక్కుపోయింది. లేత పసుపు రంగు చీరలో, ఆచ్చాదన లేని నుదిటితో, ఆడంబరం లేని బోసి మెడతో తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ వయసుకు మించిన గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొని, అన్నింటా తానయ్యి నడుచుకుంటున్న ఆ స్త్రీ మూర్తికి నమస్కరించాలనిపించింది. ముందుగా అన్న సంత్పరణ ప్రారంభించారు. అటు పై అవసరార్థులకు డబ్బు, దుప్పట్లు వితరణ చేస్తున్నారు. అప్పుడు వెదికాను నేను నారాయణ గురించి. నూనే ఎరగని చింపిరి జుట్టు నలుపూ ఎరుపుల అసంమిళిత రంగులో ఉంది. మాసిపోయిన బట్టలు వాడి దయనీయ స్థితికి నిదర్శనంగా ఉన్నాయి. నల్ల తుమ్మ మొద్దులాగున్న నారాయణ కూడా నన్ను వెదుక్కుంటూ వచ్చాడు. వెనుక ఒక బక్కపలచని ఆడామె. బహుశా వాడి కోడలనుకుంటా, పక్కనే ఇంకో యువకుడు ఓ చిన్న బాలుడిని నడిపించుకుంటూ వచ్చారు. ‘‘కోడలా?’’ అడిగాను నేను, గర్భవతిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి సందేహిస్తూ.‘‘అవునయ్యా. ఈడు నా మరదలి కొడుకు. ఎవురో ఒకడిని పనిలో యెట్టకపోతే మున్సిపాలిటోళ్లు ఇంకోల్లకు ఆదిగాడి ఉద్యోగం ఇచ్చెత్తానన్నారు. అందుకే దీనికీ నాకు అండగుంటాడని ఊళ్లో నుంచి తీసుకొచ్చి, పెళ్లిచేసి పనిలో ఎట్టాను’’ వెకిలిగా నవ్వుతూ చెప్పాడు నారాయణ. నాకు వళ్లు కంపరం పుట్టింది. ఓవైపు పోయినవాడి జ్ఞాపకార్థం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎండీగారు, మరోవైపు పోయినవాడి అస్తిత్వాన్ని కూడా గుర్తించని వీళ్లు. అందరి ముందు గొడవ ఎందుకని రెండు చిట్టీలు వాడి చేతిలో విదిల్చాను. అవి తీసుకొని వాళ్లు డయాస్ వైపు కదిలారు. వీళ్లని ఇక్కడికి పిలిచి, తప్పు చేశాననిపించి కోపంగా ఆ వైపు చూశాను నేను. భర్త పేరు నిలపడానికి కృషి చేస్తున్న ఇల్లాలు ఒక వైపు - ఎదురుగా తన కోడలికి కొత్త జీవితాన్నిచ్చిన నారాయణ, ఆమె నుంచి కొత్త బట్టలు స్వీకరిస్తున్నాడు. సౌభాగ్యం కోల్పోయిన కోడలికి ఆస్తి, అందలం సంపాదించిపెట్టిన మామగారు చూలాలికి డబ్బు దానమిస్తున్నారు. వేరొకరి స్థానంలోకి వచ్చిన అబ్బాయి తనది కాని బిడ్డని ఎత్తుకొని సముదాయిస్తుంటే, ముచ్చటపడిన ఎండీగారి భార్య చిట్టీ లేకపోయినా ఇంకో దుప్పటి వాడి చేతిలో పెట్టింది. ఇదంతా అంత ఎత్తు ఫ్లెక్సీ నుంచి ఎండీగారి కొడుకు చిద్విలాసంగా చూస్తున్నాడు. ఆ దృశ్యం నాలోని అంతర్వాహినిని తట్టిలేపింది. ఇంత క్రితం అథఃపాతాళానికి దిగజారినట్టు కనబడిన నారాయణ, ఇప్పుడు మా ఎండీగారితో సరి సమానంగా అగుపించాడు. ఇరువురు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించారు. ఇందుకు ఒకరిని తెగనాడడం... మరొకరిని మెచ్చుకోవడం తప్పు అని నేను గ్రహించాను. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే! ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి!! జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞాన, కర్మ, యోగ ఫలములను ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును, అన్న గీతాచార్యుని అతి నిగూఢ కర్మ తత్వము అప్పుడు నాకు అవగతమైంది. -అనీల్ ప్రసాద్ లింగం