అయితే.. ఓకే | But okay .. | Sakshi
Sakshi News home page

అయితే.. ఓకే

Published Wed, Oct 15 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

అయితే.. ఓకే

అయితే.. ఓకే

సాక్షి ప్రతినిధి, కడప:
 చేయి చేయి కలుపుదాం.. మద్యం వ్యాపారులను ఏకం చేద్దాం.. మందుబాబుల జేబులకు చిల్లులు పెడదాం. అడ్డుగా నిలిచే నాయకులను మచ్చిక చేసుకుందాం.. ఎవరి ఆదాయం వారికి తగ్గకుండా చూద్దాం.. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘన, బెల్ట్‌షాపులపై చూసీ చూడనట్లు వెళదాం.. నెలనెలా అక్రమ ఆదాయానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుందామంటూ ఎక్సైజ్‌శాఖలోని ఉన్నత స్థాయి అధికారి ఉద్బోధ చేశారు. ఇందుకు మద్యం వ్యాపారులు జైకొట్టారు. అడ్డుతగిలిన ఓనాయకుడిని మచ్చిక చేసుకుని  మామూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు.

 జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వాటి పరిధిలో సుమారు 2వేలకు పైగా బెల్ట్‌షాపులుండేవి.  క్రమం తప్పకుండా ఎక్సైజ్ యంత్రాంగానికి నెలవారీ మామూళ్లు లభించేవి. ఈమారు బెల్ట్‌షాపులు నిర్వహించరాదని ప్రభుత్వం గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం బెల్ట్‌షాపులను నడపొద్దని ఎక్సైజ్ యంత్రాంగం మద్యం వ్యాపారులకు ఆంక్షలు విధించింది. దీంతో నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం.

బెల్ట్‌షాపులు లేకుండా ఎలా ఆదాయం వస్తుందని.. మీకెందుకు మామూళ్లు ఇవ్వాలని నిలదీసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ యంత్రాంగమే సలహా ఇచ్చినట్లు సమాచారం. మీకు దండిగా డబ్బులు వస్తేనే మాకు మామూళ్లు ఇవ్వండంటూ ఉపదేశం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు నిబంధనల గేట్లు ఎత్తేశారు. బెల్ట్‌షాపులతో పాటు యధేచ్ఛగా అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నా ఎక్సైజ్ యంత్రాంగం చూసీ చూడనట్లు ఉండిపోతోంది.

 అధికరేట్లకు మద్యం విక్రయాలు...
 జిల్లాలోని 269 మద్యం షాపులకుగాను  టెండర్లలో 208  కేటాయించారు. 61 షాపులకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రీటెండర్లు ఆహ్వానించారు. రీ నోటిఫికేషన్‌లో కేవలం ఒక్క షాపును మాత్రమే దక్కించుకున్నారు. ప్రస్తుతం 60 షాపులు మిగిలిపోయాయి.  ఒక్కొక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్ల విక్రయాలుంటాయి.

బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.5కు అధికంగా విక్రయించుకుంటే ప్రతి నెలా సుమారు రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని అందులో రూ.50వేలు మాత్రమే తమకు ఇవ్వాలని  జిల్లా స్థాయి అధికారి ఒకరు  కోరినట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారుల అండ చూసుకున్న మద్యం వ్యాపారులు బాటిల్ మీద రూ.10 అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతినెలా సరాసరి విక్రయాలద్వారా మందుబాబులు అదనంగా సుమారు రూ.9కోట్లు భరించాల్సిన పరిస్థితి కల్గుతోంది.

 అధికార పార్టీ నేత అడ్డగించడంతో....
 అధిక రేట్లకు  మద్యం విక్రయాలు చేస్తుండటంతో  అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు అడ్డుపడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ రేట్లకే  మద్యం విక్రయాలు చేపట్టాలని, ఎందుకు మద్యం వ్యాపారులను , బెల్ట్‌షాపులను  ప్రోత్సిహ స్తున్నారని  ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం.

ఎమ్మార్పీ మేరకు విక్రయాలు నిర్వహిస్తారా? ధర్నాలు చేపట్టాలా అంటూ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని బెదిరించడంతో ఎక్సైజ్  ఉన్నత  స్థాయి అధికారి ఒకరు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. మాకు లభించే మామూళ్లలో ప్రతినెలా మీకూ సమర్పించుకుంటామని మధ్యస్థంగా పంచాయితీ చేసినట్లు సమాచారం. ఆ మేరకు ప్రతినెలా రూ.8లక్షలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఎక్సైజ్ శాఖ అప్పగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
 జిల్లాలో అధికరేట్లకు  మద్యం విక్రయాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిని కట్టడి చేయాలని సిబ్బందిని ఆదేశించాను. ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరిపేటట్లు చూడాలని స్పష్టం చేశా..బెల్ట్‌షాపులను కూడా అరికడతాం.. ఎక్కడైనా అధిక రేట్లతో మద్యం విక్రయిస్తుంటే సమాచారం  ఇవ్వాలి.. ఇందుకు సంబంధించి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement