ఇవ్వాళ్ట్టి జేబు చిల్లు...! రేపటికి గుండెకు గండి...!!
సరదాగా...
‘‘ఈమధ్య మీ ఖర్చు చాలా పెరిగింది. గొంతు చిల్లులు పడినట్లు నేను చెబుతున్నా, జేబుకు చిల్లులు పడినట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అర్జెంటైతే తప్ప ఆఫీసు నుంచి ఇంటికీ ఇంటి నుంచి ఆఫీసుకూ బస్సులోనే వెళ్తుండండి’’ అన్నాను.
శ్రీవారికి ఓ అలవాటుంది. నేను దేన్నైనా తప్పు అంటే చాలు, అదే రైటని సమర్థించడానికి ప్రయత్నిస్తుంటారు.
‘‘ఆదాయానికి కాస్త చిల్లు ఉండాలోయ్. అప్పుడే అన్ని వర్గాలకూ సంపద చేరుతుంది. ఆటోలో వచ్చాననుకో... అప్పుడు ఆటోవాడూ, నీసాటిదే అయిన వాడి పెళ్లాం, మన చిన్నారుల్లాంటి... వాడి పిల్లలూ.. అంతా నాలుక్కాలాలుంటారు. నాలుక్కూరలు తింటారు. అందుకే అప్పుడప్పుడూ తెగించి జేబుకు కాస్త చిల్లు వేస్తుండాలి’’ అన్నారాయన. ఆయనకు ఇష్టమైన మిస్సమ్మ పాటలో చెప్పాలంటే... ఆయనదంతా ‘తనమతమేదో తనదీ... మనమతమసలే పడని’ రెటమతం. ఈ మగాళ్లు ఏదో అంటారుగానీ....‘ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే‘ అనే టైపు వాళ్లదే. అందుకే మళ్లీ చిల్లు గొప్పదనం చెప్పడం మొదలుపెట్టారు. ‘‘మొదట్లో అట్లకాడనే బోలుగా చేసి ఆ గరిటతోనే నూనెలోంచి వడలూ, గారెలు తీసేవారట. కానీ నూనెంతా దాంట్లోనే నిలిచిపోతూ ఉండేదట. మిస్సమ్మలో చెప్పినట్లు ‘తైలం’ చాలా విలువైనది కాబట్టి తైలాన్ని రక్షించుకోడానికి చిల్లు పెట్టి దాన్ని జల్లిగంటె చేశారట. ఇవాళ్టి మన జేబుకు చిల్లు సాటి పేదలకు వరాల జల్లు’’ అంటూ ఓ ఇన్‌స్టాంట్ ఉపన్యాసం ఇచ్చారు.
‘‘అందుకే అప్పట్లో మీకు ఈసీజీ తీయిస్తే గ్రాఫు హెచ్చుతగ్గులుండాల్సిన చోట సమసమాజం, సామ్యవాదం అనే పదాలు పడ్డాయట. దాంతో కంగారు పడ్డ డాక్టర్లు మీ తలకాయకు సీటీ స్కాన్ చేయిస్తే అందులో ఏమీ కనిపించలేదట... పరోపకారం అనే అక్షరాలు తప్ప. అలాగే ఎక్స్‌రేలో మీ చేతికి ఎముక కనపడలేదట. మీ పరోపకారం కుటుంబానికి కారం, జేబుకు భారం కాకూడదు. అదీ నేను చెప్పేది’’ అంటూ ఏదో చెప్పబోయా. కానీ చిల్లు గొప్పదనాన్ని చెప్పడం మానలేదు. దాంతో ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి చెప్పా.
‘‘అప్పట్లో ఒకసారి మీ పేగుకు చిల్లు పడితే అర్జెంటుగా దాన్ని మూసేందుకు ఆపరేషన్ చేసేసి మిమ్మల్ని రక్షించారంటూ మీరే చెప్పలా.గుండెను రక్షిస్తూ ఉండే పెరికార్డియమ్ పొరకు మరింత రక్షణగా ఉండే పై పొరే జేబు. ఇవ్వాళ్టి జేబుకు చిల్లే... రేపటికి గుండె వరకూ గండిగా మారవచ్చు. పేగుకు పడితేనే చిల్లు - పెరిగిందంతగా హాస్పిటల్ బిల్లు. ఇక గుండెకు గండి పడితేనో? అందుకే ఇకనైనా పొదుపుగా ఉండండి’’ అంటూ ఉపదేశించా. దాంతో ఆయనిక సెలైంటైపోక తప్పలేదు. సెలైంటైనా తప్పులేదు.