అద్వైతం
జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞాన, కర్మ, యోగ ఫలములను ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును.
- భగవద్గీత
‘‘ఆడికి బూమ్మీద నూకలు సెల్లిపోనాయి బాబు. ఎల్లిపోనాడు’’ తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు.వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను.
లుంగీ కట్టుకొని, టవల్ భుజం చుట్టూ వేసుకొని హడావిడిగా మెట్లు ఎక్కుతున్న నాకు, గుమ్మం ముందు నిండిపోయిన చెత్తబుట్ట కంపు కొడుతూ కనబడింది. ఈ అపార్ట్‌మెంట్ దరిద్రాలలో ఇదొకటి. పెరడు, ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉండదు. లక్షలు పోసి కొనుక్కున్నా ద్వారం ముందు చెత్తబుట్ట ఉంచాల్సిన దౌర్భాగ్యం. తలుపు తీసిన నా భార్యని, ‘‘ఏ...., ఆదిగాడు రాలేదా? ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పవచ్చు కదా. తీసికెళ్లి కింద పారేసేవాడిని’’ అంటూ విసవిసా బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాను. రెండు రోజుల బడలిక వల్ల వెంటనే నిద్ర వచ్చేసింది.
మా కంపెనీ ఎండీ కొడుకు క్రితంరోజు పొద్దున యాక్సిడెంట్‌లో చనిపోయాడు. నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకురావడం మొదలు, ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు అక్కడే సరిపోయింది నాకు. ఊళ్లోని మా ఇంటి పెరట్లో చేతి పంపు ఉండేది. చావు దగ్గర నుంచి వచ్చేటప్పుడు వెనగ్గా వెళ్లి ఆ బట్టలు తడిపేసి, వాటిని అక్కడే విడిచేసి ఇంట్లోకి వెళ్లడం మాకు అలవాటు. ఈ సిటీలో అవన్నీ కుదరక, వాచ్‌మెన్‌తో బకెట్ నీళ్లు తెప్పించుకొని, నెత్తిమీద పోసుకుని ఫోన్‌చేసి, నా భార్యతో టవల్ లుంగీ కిందకి తెప్పించుకొని చుట్టుకొని వచ్చి పడుకున్నాను.
తరువాతి రోజు సాయంత్రం నేను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా చెత్త బుట్ట నిండుగానే ఉంది. దానికి ఓ ప్లాస్టిక్ కవర్ కూడా తోడైంది. మా అంతస్తులో అందరి ప్లాట్ల ముందు అలాగే ఉన్నాయి. తలుపు తీసిన నా భార్యను మళ్లీ నిన్నటి ప్రశ్నే వేశాను. ‘‘ఆదిగాడు రాలేదా?’’ అని. ‘‘లేదు. ఆ వాచ్‌మెన్‌ను తీసుకెళ్లమంటే అన్ని ప్లాట్లది మోసుకెళ్లలేనంటున్నాడు’’ ఉక్రోషంగా చెప్పింది మా ఆవిడ.
డ్రెస్ మార్చుకోకుండానే కిందకు వెళ్లి వాచ్‌మెన్‌ను కేక వేశాను. జవాబు లేదు. మెట్ల కింద అతని రూం తలుపు తీసే ఉంది కానీ మనుషులు లేరు. నడుచుకుంటూ వీధి చివరికి వెళ్లాను. అక్కడే ఖాళీ స్థలంలో ఆదిగాడు వాళ్లు ఉండేది. వాడి గుడిసె ముందు టెంటు వేసి ఉంది. ఏదో ఫంక్షన్ అనుకుంట అని వెనుదిరిగాను. నన్ను చూసి మా వాచ్‌మెన్ పరిగెత్తుకొచ్చాడు. ‘‘ఆదిగాడు రెండు రోజుల నుంచి రావడం లేదంటేనూ కేకలేద్దామని వచ్చాను. ఏంటి ఫంక్షన్?’’‘‘ఆయీ! తవకి తెల్దండీ? పేపర్లో కూడా ఏశారండి.’’‘‘ఏంటి?’’ అసహనంగా అడిగాను నేను. ‘‘ఆదిగాడు మొన్న రేతిరి తాగి రోడ్డు దాటతా లారీకి అడ్డంపడి చచ్చిపోనాడండి’’ విన్నది అర్థమవటానికి క్షణకాలం పట్టింది నాకు. ‘‘అయ్యో! నారాయణ ఉన్నాడా? ఆదిగాడికి పెళ్లి కూడా అయినట్టు ఉందే?’’‘‘ఉన్నాడండి. పిల్లోడు కూడానండే’’ టెంటు వేసి ఉన్న గుడిసె దగ్గరకు వెళుతుంటే ఎదురు వచ్చాడు నారాయణ. ఫుల్లుగా తాగి ఉన్నాడు. ‘‘నాకు తెలీదు నారాయణా. చిన్న వయసు. పాపం ఓ పిల్లాడు కూడానట కదా’’ పరామర్శించాను. ‘‘ఆడికి బూమ్మీద నూకలు సెల్లిపోనాయి బాబు. ఎల్లిపోనాడు’’ తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు. వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను.
రేపు మా ఎండీ కొడుకు వర్ధంతి. సేవాకార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేశారు. వెంటనే నాకు ఆదిగాడు గుర్తుకు వచ్చాడు. వాడి భార్యని రేపటి సంతర్పణకి రమ్మంటే బాగుంటది, అంతో ఇంతో ధన రూపేణ లేదా వస్తు రూపేణ ముడుతుంది కదా అనిపించింది. వాచ్‌మెన్ చేత నారాయణను పిలిపించాను.
‘‘రేపు ఆదిగాడి సంవత్సరీకం కదా ఏం చేస్తున్నావురా?’’
‘‘నా నేటి సేత్తానయ్యా. ఇప్పుడు తవరు చెప్పేదాకా అసల నాకు ఆ ఉసే తెల్దు. యేడాది అయీపోనాదని. పండగెల్లి పోనాక వారం పైన చచ్చాడు. ఇంకా పండగ రాలేదు కదుండే’’ తల గోక్కుంటా అడిగాడు.
వాడి నిర్లక్ష్య వైఖరి నాకు కోపం తెప్పించింది. తమాయించుకొని, ‘‘ఈసారి పండగ వచ్చే నెలలో వస్తుంది గానీ, రేపు నువ్వూ నీ కోడలూ స్టేడియం దగ్గరకు రండి. మా కంపెనీ ఓనరు కొడుకు కూడా అదే రోజు పోయాడు. వాళ్లు రేపు దానాలు చేస్తారు. తీసుకుపోదురు గాని’’, వాడు సరేనని తల ఊపి వెళ్లిపోయాడు.
రెండో రోజు పొద్దున్నే హడావుడి మొదలైంది. సొంత పొలంలో కట్టించిన సమాధి వద్దకెళ్లి శ్రద్ధాంజలి ఘటించి, అబ్బాయిగారి పేరున అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చివరికి స్టేడియం వద్దకొచ్చాము. అప్పటికే అక్కడ జన సందోహం భారీగా ఉంది. ఎండీగారు కొడుకు ఫొటో జ్యోతి ప్రజ్వలన గావించి, కొడుకు పేరున ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి కోడలిని జీవిత కాల ఛెర్మైన్‌గా నియమించారు. తన కంపెనీలో పాతిక శాతం వాటా ఆమెకు చెందేలా రాసిచ్చి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ శాఖకు ఆమెను డెరైక్టర్‌గా నియమించారు. ఉదయం నుంచి రకరకాల కార్యక్రమాల ద్వారా తన మగనికి నివాళులు అర్పిస్తున్న ఆ నడి వయసు ముదితను చూస్తే, నాకు కడుపు తరుక్కుపోయింది. లేత పసుపు రంగు చీరలో, ఆచ్చాదన లేని నుదిటితో, ఆడంబరం లేని బోసి మెడతో తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ వయసుకు మించిన గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొని, అన్నింటా తానయ్యి నడుచుకుంటున్న ఆ స్త్రీ మూర్తికి నమస్కరించాలనిపించింది. ముందుగా అన్న సంత్పరణ ప్రారంభించారు. అటు పై అవసరార్థులకు డబ్బు, దుప్పట్లు వితరణ చేస్తున్నారు. అప్పుడు వెదికాను నేను నారాయణ గురించి.
నూనే ఎరగని చింపిరి జుట్టు నలుపూ ఎరుపుల అసంమిళిత రంగులో ఉంది. మాసిపోయిన బట్టలు వాడి దయనీయ స్థితికి నిదర్శనంగా ఉన్నాయి. నల్ల తుమ్మ మొద్దులాగున్న నారాయణ కూడా నన్ను వెదుక్కుంటూ వచ్చాడు. వెనుక ఒక బక్కపలచని ఆడామె. బహుశా వాడి కోడలనుకుంటా, పక్కనే ఇంకో యువకుడు ఓ చిన్న బాలుడిని నడిపించుకుంటూ వచ్చారు. ‘‘కోడలా?’’ అడిగాను నేను, గర్భవతిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి సందేహిస్తూ.‘‘అవునయ్యా. ఈడు నా మరదలి కొడుకు.
ఎవురో ఒకడిని పనిలో యెట్టకపోతే మున్సిపాలిటోళ్లు ఇంకోల్లకు ఆదిగాడి ఉద్యోగం ఇచ్చెత్తానన్నారు. అందుకే దీనికీ నాకు అండగుంటాడని ఊళ్లో నుంచి తీసుకొచ్చి, పెళ్లిచేసి పనిలో ఎట్టాను’’ వెకిలిగా నవ్వుతూ చెప్పాడు నారాయణ. నాకు వళ్లు కంపరం పుట్టింది. ఓవైపు పోయినవాడి జ్ఞాపకార్థం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎండీగారు, మరోవైపు పోయినవాడి అస్తిత్వాన్ని కూడా గుర్తించని వీళ్లు. అందరి ముందు గొడవ ఎందుకని రెండు చిట్టీలు వాడి చేతిలో విదిల్చాను. అవి తీసుకొని వాళ్లు డయాస్ వైపు కదిలారు. వీళ్లని ఇక్కడికి పిలిచి, తప్పు చేశాననిపించి కోపంగా ఆ వైపు చూశాను నేను.
భర్త పేరు నిలపడానికి కృషి చేస్తున్న ఇల్లాలు ఒక వైపు - ఎదురుగా తన కోడలికి కొత్త జీవితాన్నిచ్చిన నారాయణ, ఆమె నుంచి కొత్త బట్టలు స్వీకరిస్తున్నాడు. సౌభాగ్యం కోల్పోయిన కోడలికి ఆస్తి, అందలం సంపాదించిపెట్టిన మామగారు చూలాలికి డబ్బు దానమిస్తున్నారు. వేరొకరి స్థానంలోకి వచ్చిన అబ్బాయి తనది కాని బిడ్డని ఎత్తుకొని సముదాయిస్తుంటే, ముచ్చటపడిన ఎండీగారి భార్య చిట్టీ లేకపోయినా ఇంకో దుప్పటి వాడి చేతిలో పెట్టింది. ఇదంతా అంత ఎత్తు ఫ్లెక్సీ నుంచి ఎండీగారి కొడుకు చిద్విలాసంగా చూస్తున్నాడు. ఆ దృశ్యం నాలోని అంతర్వాహినిని తట్టిలేపింది. ఇంత క్రితం అథఃపాతాళానికి దిగజారినట్టు కనబడిన నారాయణ, ఇప్పుడు మా ఎండీగారితో సరి సమానంగా అగుపించాడు. ఇరువురు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించారు. ఇందుకు ఒకరిని తెగనాడడం... మరొకరిని మెచ్చుకోవడం తప్పు అని నేను గ్రహించాను.
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే!
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి!!
జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞాన, కర్మ, యోగ ఫలములను ఒక్కటిగా చూచువాడే యదార్థమును గ్రహించును, అన్న గీతాచార్యుని అతి నిగూఢ కర్మ తత్వము అప్పుడు నాకు అవగతమైంది.
-అనీల్ ప్రసాద్ లింగం