నజ్‌మింజహాన్ బిడ్డతో రైల్వే కానిస్టేబుల్ మమత; సేవా పథంలో మమత
సమైక్య భావన స్ఫూర్తి గురించి చెప్పడానికి... పెద్ద పెద్ద సిద్ధాంతాలే అక్కర్లేదు. చిన్న సంఘటనలు చాలు! ఆరోజు ఏమైందంటే...
థానే (ముంబై)లోని దివ రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్ నంబర్:1
ఎప్పటిలాగే ఆ ఉదయం రైలు బండ్ల శబ్దాలు, ప్రయాణికుల అరుపులు, కేకలతో ౖరైల్వేస్టేషన్ సందడిగా ఉంది. తిత్వాల ప్రాంతానికి చెందిన నజ్‌మింజహాన్ తన భర్త ఫసిముద్దీన్‌తో కలిసి ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.ఆమె గర్భిణి. రొటీన్–చెకప్‌లో భాగంగా నాయర్ హాస్పిటల్ వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చింది.
కొద్దిసేపటి తరువాత...
ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త ఆందోళన పడుతున్నాడు.
అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. ‘ఎవరో ఒకరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళతారులే’ అని ఎవరికి వారు అనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం రైల్వే అధికారులకు ఫోన్ చేశారు.
హుటాహుటిన రైల్వే అధికారులతోపాటు అక్కడికి వచ్చింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మమత దంగి.
నొప్పులు ఎక్కువయ్యాయి.
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మహిళా రైల్వే ఉద్యోగులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారిని నజ్‌మింజహాన్ దగ్గరకు తీసుకువచ్చింది మమత. అందుబాటులో ఉన్న వస్తువులతో మేక్‌షిఫ్ట్ క్లాత్ కర్టెన్‌ను తయారుచేసింది.
అందరిలో ఉత్కంఠ!
ఏమవుతుందో ఏమో!!
ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి.
నజ్‌మింజహాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ‘హమ్మయ్య’ అనుకున్నారు జనాలు.
‘ఆమె మీ ఇంటి అమ్మాయే అనుకోండి... ఒకసారి రండి.... ప్లీజ్... చేతులెత్తి దండం పెడతాను’ అనే మమత మాటలు ప్రయాణికులను కదిలించాయి.
ఆ తరువాత...తల్లీబిడ్డలను దివలోని ఒక ప్రైవెట్ హాస్పిటల్‌లో చేర్పించారు. తల్లీబిడ్డలను హాస్పిటల్‌లో చేర్పించడానికి ప్రయాణికులు కొందరు తమ ప్రయాణాలు మానుకొని మరీ హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
‘ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చూడడం ఇదే మొదటిసారి. నిజానికి ఆరోజు నేను అర్జంటుగా వేరే చోటుకు వెళ్లాలి. ట్రైన్ వచ్చే సమయం అయింది. అయితే మమత మాటలు నన్ను కదిలించాయి. నా పని, ప్రయాణం గురించి పట్టించుకోకుండా ఆమెతోపాటు వెళ్లాను’ అంటుంది సహాయక కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి.
సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్‌వో శివాజీ సతారా మమత కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment