Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..! | Sadhguru Brain Surgery: What Is The Main Cause Of Brain Bleeding? | Sakshi
Sakshi News home page

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!

Published Thu, Mar 21 2024 11:22 AM | Last Updated on Thu, Mar 21 2024 11:32 AM

Sadhgurus Brain Surgery: What Main Cause Of Brain Bleed  - Sakshi

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్‌లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.

నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్‌ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..?

బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్‌ అవసరం. ఈ ఆక్సిజన్‌ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది.  అసలు ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఎన్ని రకాలు?
బ్రెయిన్‌ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. 

ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు.
హీమోర్‌హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి.
ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు..

  • ఏ రకమైన స్ట్రోక్‌ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్‌ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. 
  • అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి.
  • ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. 

ఎందుకు వస్తుందంటే..
అధిక రక్తపోటు,డయాబెటిస్‌,అధిక కొలెస్ట్రాల్‌,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే  జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్‌ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. 

చికిత్స ఇలా..
పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను స​ంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్‌ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్‌స్ట్రోక్‌కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు.

(చదవండి: బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్‌ కోసం వాడితే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement