మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ.. | Brain Stroke Symptoms, Causes, Treatment, Recovery, Prevention | Sakshi
Sakshi News home page

మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ..

Published Tue, Aug 23 2022 7:11 PM | Last Updated on Tue, Aug 23 2022 7:11 PM

Brain Stroke Symptoms, Causes, Treatment, Recovery, Prevention - Sakshi

సాక్షి, విజయవాడ: శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్‌ స్ట్రోక్‌. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

30 శాతం మంది యువతే.. 
ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్‌ తీవ్రతను బట్టి జనరల్‌ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్‌(ఇస్కిమిక్‌) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్‌) 20 శాతం మంది ఉంటున్నారు.

ప్రధాన కారణాలివే.. 
పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు.  
45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్‌ అనే రక్తంలో జెనిటిక్‌ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్‌ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్‌ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  
వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు.  
ఆడవారిలో హార్మోనల్‌ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్‌ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు.  

ఆ నాలుగు గంటలే కీలకం.. 
ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ వచ్చిన వారికి త్రోంబలైసిస్‌ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్‌ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.  

జీవన విధానం ముఖ్యం.. 
ప్రతి ఒక్కరూ మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. కదలిక లేని జీవన విధానం కారణంగా చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగి, మధ్య వయస్సు వచ్చేసరికి స్ట్రోక్‌కు దారి తీస్తున్నాయి. వంశపారంపర్యంగా స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఉన్న వారు  మందులు సక్రమంగా వాడటం ద్వారా ముప్పు ను తప్పించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకూ ఈ వ్యాధిని నివారించవచ్చు.  
– డాక్టర్‌ ప్రసన్నకుమార్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి 

‘స్ట్రోకింగ్‌ యంగ్‌’ కేసులు వస్తున్నాయి..  
ఇటీవల 45 ఏళ్లలోపు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్న(స్ట్రోకింగ్‌ యంగ్‌) వారిని తరచూ చూస్తున్నాం. మా వద్ద వస్తున్న స్ట్రోక్‌ కేసుల్లో 25 శాతం అలాంటి వారే ఉంటున్నారు. తక్కువ వయస్సు వారిలో స్ట్రోక్‌ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. హెరాయిన్‌ వంటి మత్తు పదార్థాలు వాడటం, మద్యపానం, ధూమపానంతో పాటు, హోమోసిస్టీన్, సిక్కుసెల్, రక్తంలో లోపాలు కూడా కారణం కావచ్చు. బ్రెయిన్‌స్ట్రోక్‌ లక్షణాలను గుర్తించి నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే  వైకల్యం లేకుండా కాపాడవచ్చు.   
– డాక్టర్‌ డి. అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement