Sameera Maruvada: నవ్వు బొమ్మల అమ్మాయి | Sameera Maruvada Leading As Comic Cartoonist | Sakshi

Sameera Maruvada: నవ్వు బొమ్మల అమ్మాయి

Jun 2 2021 2:24 AM | Updated on Jun 2 2021 12:25 PM

Sameera Maruvada Leading As Comic Cartoonist - Sakshi

సమీర మరువాడ తన ఇన్‌స్టా పేజీకి అదే పేరు పెట్టుకుంది ‘సాల్ట్‌ అండ్‌ సాంబార్‌’ అని.

‘మీ సాల్ట్‌కూ సాంబార్‌కూ ద్రోహం చేయలేను బాబుగారూ’ అని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో డైలాగ్‌. సమీర మరువాడ తన ఇన్‌స్టా పేజీకి అదే పేరు పెట్టుకుంది ‘సాల్ట్‌ అండ్‌ సాంబార్‌’ అని. ఫుల్‌గా ఫాలోయెర్స్‌ ఉన్నారు. ఉప్పు లేని కూర, హాస్యం లేని జీవితం చప్పగా ఉంటాయి. తన బొమ్మ నవ్వించి జీవితంలో రుచి తెస్తుందని సమీర మరువాడ నమ్ముతుంది. ఈ వైజాగ్‌ అమ్మాయి హైదరాబాద్‌ చేరి  ఫ్రీలాన్సర్‌గా మనుగడ కోసం కృషి చేస్తోంది. తెలుగులో ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్‌ అందునా మహిళా ఆర్టిస్ట్‌ స్ట్రగుల్‌ నవ్వినంత ఈజీ కాదు.. నవ్వులాటా కాదు. కాని సమీర విజయం వైపు అడుగులు వేస్తోంది.

ఆమె పరిచయం.
తెలుగులో మిడిల్‌ క్లాస్‌ జీవనాన్ని హాస్యానికి ఉపయోగించిన వారంతా సక్సెస్‌ అయ్యారు. కార్టూన్లలో బాపూ, ఈ కాలంలో సరసి ఇంకా చాలామంది మధ్యతరగతి జీవనాన్ని హాస్యగీతలలో కామెంట్‌ చేసి గుర్తింపు పొందారు. అయితే ఈ రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం తక్కువ. తెలుగులో మహిళా కార్టూనిస్టులు చాలా తక్కువ. ఒక కాలంలో ‘రాగతి పండరి’ మహిళా కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. కాని ఆ తర్వాత ఆ రంగంలో కృషి చేసినవారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి ఈ రంగంలో తన పేరు వినిపించేలా చేస్తోంది. ఆ పేరు సమీర మరువాడ.

గీతలే జీవితం
వైజాగ్‌కు చెందిన సమీరకు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఇష్టం. ఎక్కడ బొమ్మల పోటీ పెట్టినా వెళ్లి ప్రైజ్‌ కొట్టుకొచ్చేది. చదువులో భాగంగా ఇంజనీరింగ్‌ చేసినా ఆ తర్వాత ఇంటిరియర్‌ డిజైనింగ్‌ చేసినా ఆ తర్వాత ఎం.ఏ ఇంగ్లిష్‌ చేసినా ఒకరి కింద పని చేసే ఉద్యోగం మీద మనసు పోలేదు. ‘నా చేతిలో గీతలున్నాయి. నేను వాటి మీద బతకాలనుకున్నాను’ అంటుందామె. వెంటనే ‘శామ్‌ ఇన్‌స్పయిర్‌’ పేరుతో యూ ట్యూబ్‌ చానల్‌ మొదలెట్టి దాదాపు 100కు పైగా బొమ్మలు నేర్పించే వీడియోలు చేసింది. ఈ చానల్‌కు 30 వేల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. ఆ సమయంలోనే తన జీవితంలో, చుట్టుపక్కలవారి జీవితంలో రోజు వారీ వ్యవహారాల మీద ఆమెకు కామిక్స్‌ వేయాలనిపించింది. ‘అప్పటివరకూ నేను ఆ పని చేయగలనని తెలియదు. కాని మొదలెట్టేశాను’ అంటుంది సమీర. అనుకున్నదే తడవు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాల్ట్‌ అండ్‌ సాంబార్‌’ అనే పేజీ మొదలెట్టింది. అందులో తన కార్టూన్లు కూడా.

మధ్యతరగతి మందహాసం
సమీర చేసిన మొదటిపని తన కార్టూన్లకు మధ్యతరగతిని నేపథ్యంగా తీసుకోవడం. మధ్యతరగతి, పై తరగతి పాఠకులను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్‌ అక్షరాలలో తెలుగు వ్యాఖ్యను రాయడం. తను అమ్మాయి కనుక అమ్మాయిలపై ఎటువంటి సగటు అభిప్రాయాలు ఉంటాయో వాటిమీద వ్యాఖ్యలు చేస్తూ సమీర కార్టూన్లు వేస్తుంది. అలాగే అబ్బాయిలందరూ చచ్చినట్టు ఐఐటి చేయాల్సిందేనన్నట్టు ఉండే వొత్తిడిని కూడా వెక్కిరిస్తుంది. ‘అమ్మాయికి పెళ్లి చేసి పంపడం’ తన విధ్యుక్త ధర్మంగా హైరానా పడే తల్లిదండ్రులపై సమీర పుంఖాను పుంఖాలు గా కార్టూన్లు వేసింది. 

బొమ్మలే బువ్వ పెట్టాలి
బొమ్మల మీద ఆధారపడి జీవించడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ సమీర ఫుల్‌టైమ్‌ ఫ్రీలాన్సర్‌ అయ్యింది. ‘నేను నా బొమ్మలను అమ్ముకోగలను అని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’ అంటుందామె. ఇన్‌స్టాలో తనకొచ్చిన పేరు వల్ల సమీర కస్టమైజ్డ్‌ బొమ్మలు వేసి ఇస్తుంది. బర్త్‌డే కార్డులు, పండగ కార్టూన్లు, మదర్స్‌ డే లాంటి సందర్భాలలో విషెస్‌ చెప్పడానికి మనం చెప్పినట్టుగా లేదా కోరిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని కార్టూన్లు, కార్డులు తయారు చేయమంటే చేసి ఇస్తుంది. గత సంవత్సరం ‘రాఖీ’ పండగ కోసం సమీర దగ్గర చాలామంది కస్టమైజ్డ్‌ కార్డ్‌లు చేయించుకున్నారు. అలాగే 2021 సంవత్సరానికి గాను కార్టూన్‌ క్యాలెండర్‌ కూడా ఆర్డర్‌ వచ్చింది. ఈ క్యాలండర్‌ కోసం ‘పక్కింటి ఆంటీ’ని సబ్జెక్ట్‌ గా తీసుకుందామె. ఈ పక్కింటి ఆంటీకి వేరే పని ఉండదు. పొరుగింటి అమ్మాయి కి పెళ్లిచూపులు వెతకడమే పని. ఈ క్యాలెండర్‌ హిట్‌ అయ్యింది. ‘ఆర్టిస్టులు తమ సొంత కాళ్లపై బతకాలంటే సాయం చేసే క్రౌండ్‌ ఫండింగ్‌ వేదికలు ఉన్నాయి. ‘పాట్రియాన్స్‌’ క్రౌండ్‌ ఫండింగ్‌ ద్వారా నేను సపోర్ట్‌ పొందుతున్నాను’ అంటుంది సమీర.

ఏటి కొప్పాకలో
సమీర వైజాగ్‌కు దగ్గరగా ఉండే ఏటికొప్పాక కొయ్యబొమ్మల తయారీదార్లతో కలిసి ‘తల్లీకూతురు’ అనే కీచైన్‌ బొమ్మను గీసి ఇచ్చింది. ఆ బొమ్మ ఆధారంగా ఏటికొప్పాకలో తయారవుతున్న తల్లీకూతురు కీచైన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సారా ఆండర్సన్, మార్లొస్‌డెవీ వంటి చిత్రకారుల బొమ్మలతో ఇన్‌స్పయిర్‌ అయ్యే సమీరా త్వరలో తను కూడా అంత పెద్ద రేఖా చిత్రకారిణి అవుతుందని గుర్తింపు పొందుతుందని ఆశిద్దాం.

– సాక్షి ఫ్యామిలీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement