నోటిని తీపి చేస్తూ.. పండుగను సందడిగా చేసుకుందాం | Sankranthi Special Vantalu In Telugu | Sakshi
Sakshi News home page

నోటిని తీపి చేస్తూ.. పండుగను సందడిగా చేసుకుందాం

Published Sun, Jan 10 2021 10:51 AM | Last Updated on Sun, Jan 10 2021 11:21 AM

Sankranthi Special Vantalu In Telugu - Sakshi

స్వీట్‌ పొంగల్‌
కావలసినవి: పాలు – 4 కప్పులు; బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పు; జీడిపప్పులు – 10; కిస్‌మిస్‌ – 2 టేబుల్‌స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు
తయారి:  ముందుగా పాలను మరిగించాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి ∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి ∙ ఐదు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి ∙బాణలిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్‌మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్‌లో వేసి బాగా కలపాలి  వేడివేడిగా వడ్డించాలి.

సకినాలు
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నువ్వులు – అర కప్పు; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి ∙బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంటసేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు) ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి ∙ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి ∙కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి) ∙మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

పులి పీఠా
కావలసినవి: చిక్కటి పాలు – 2 లీటర్లు; బియ్యప్పిండి – 200 గ్రా.; బొంబాయి రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి తురుము – 2 కప్పులు; గట్టి బెల్లం – 800 గ్రా. (సన్నగా తురమాలి).
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొబ్బరి తురుము వేసి, తyì  పోయేవరకు బాగా కలపాలి ∙సగం బెల్లం జత చేసి, మొత్తం కరిగి, మిశ్రమం సగం అయ్యేవరకు కలిపి, దింపేసి, చల్లారాక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙వేడి నీళ్లు జత చేస్తూ పిండిని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి ∙పిండిని సమాన భాగాలుగా కట్‌ చేసుకోవాలి ∙ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని గుండ్రంగా చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙కొబ్బరి తురుము మిశ్రమాన్ని అందులో ఉంచి, అర్ధ చంద్రాకారంగా ఒత్తాలి ∙స్టౌ మీద పాలు ఉంచి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి ∙బెల్లం జత చేసి కరిగించాలి. తయారు చేసి ఉంచుకున్న అర్ధచంద్రాకారంలో ఉన్న పీఠాలను పాలలో వేసి ఒకసారి కలిపి, దింపేయాలి.

మకర చౌలా
కావలసినవి: ముడి బియ్యం – అర కప్పు; పాలు – ఒక కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు; చెరకు ముక్కలు – అర కప్పు; బాగా ముగ్గిన అరటి పండ్లు – 2; పంచదార – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; కాటేజ్‌ చీజ్‌ – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పండ్ల ముక్కలు – అర కప్పు
తయారీ: ముందు రోజు రాత్రి బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙ మరుసటి రోజు ఉదయం బియ్యాన్ని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద సుమారు గంటసేపు ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పిండి పట్టాలి ∙స్టౌ మీద ఒక పాత్రలో బియ్యప్పిండి, పాలు, కొబ్బరి తురుము, చెరకు ముక్కలు, పంచదార, అరటి పండ్లు, మిరియాల పొడి, కాటేజ్‌ చీజ్, అల్లం తురుము, పండ్ల ముక్కలు వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి ∙అరటి పండ్లను ముక్కలు చేసి, చేతితో బాగా మెత్తగా అయ్యేలా మెదిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ∙వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. చల్లగా కావాలనుకునేవారు కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement