‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్‌మెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్‌లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ..
‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్‌లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్‌లో ఇన్‌వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు.
అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్‌తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్‌లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్‌ప్రోడక్షన్ హౌజ్‌లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్‌లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి.
టీమ్ వర్క్..
డిజైనింగ్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్‌లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్‌లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది.
చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్‌తో పనిచేసే సమయంలో చాలా జోవియల్‌గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను.
ప్రతిదీ సాధనే..
ఆర్కిటెక్చర్‌లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్‌ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్‌లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్‌ను అర్థం చేసుకోవడం చాలా సవాల్‌గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్‌గా ఉండాలి.
క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్‌ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆర్కిటెక్ట్‌గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్‌ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే.
భవిష్యత్తు తరాలకు..
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్‌లను క్రియేట్ చేశాను. హైదరాబాద్‌లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్‌ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్‌లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment