శ్రుతి మించిన ప్రేమ | Sharing Family Values with Teens | Sakshi
Sakshi News home page

శ్రుతి మించిన ప్రేమ

Published Fri, Jun 10 2022 12:34 AM | Last Updated on Fri, Jun 10 2022 12:34 AM

Sharing Family Values with Teens - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పబ్జీకి బానిసై తల్లిని కాల్చి చంపిన కుర్రాడు, పరీక్షలను వాయిదా వేయించడానికి ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన పన్నెండవ తరగతి కుర్రాడు, అంతకు ఐదేళ్ల ముందు నిర్భయ సంఘటన, ఆ తర్వాత రెండేళ్లకు హైదరాబాద్‌లో అభయ ఘటన, మరో ఐదేళ్లకు అదే హైదరాబాద్‌లో ఒక దిశ, ఇప్పుడు ఒక రొమేనియా బాలిక...నెక్లెస్‌ రోడ్‌లో మరో ఉదంతం.

వీటన్నింటిలోనూ అన్నింటిలోనూ నిందితులు టీనేజ్‌ దాటుతున్న వాళ్లు, యువతరానికి ప్రతినిధులే. అభివృద్ధి సాధిస్తున్నాం, డిజిటల్‌గా ముందుకు వెళ్తున్నాం... అనుకుంటున్న ఈ రోజుల్లో అత్యాచారాలు, కరడు కట్టిన నేరాలకు యువతరమే కారణమవుతోందంటే ఈ తప్పు ఎవరిది? తప్పంతా సమాజానిదేనా? పేరెంట్స్‌ పాత్ర ఎంతవరకు?

ప్రేమ – బాధ్యత
ఈ రెండూ పేరెంటింగ్‌లో ప్రధానమైనవి. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతున్నామనే ప్రదర్శన ఎక్కువవుతున్న రోజులివి. ఈ ప్రదర్శనలో మునిగిపోయి తమ మీద ‘బాధ్యత’ కూడా ఉందనే వాస్తవాన్ని మర్చిపోతున్న పేరెంట్స్‌ కూడా ఎక్కువవుతున్నారనే చెప్పాలి.

► ఒక ఆర్టీఏ అధికారి తన పదిహేడేళ్ల కూతురు బైక్‌ తీసుకుని రోడ్‌ మీదకు వెళ్తున్నప్పుడు ‘ట్రాఫిక్‌ పోలీస్‌ ఆపితే నా పేరు చెప్పు, అవసరమైతే నాకు ఫోన్‌ చెయ్యి’ అని చెప్పి పంపిస్తే దానిని ప్రేమ అనవచ్చా? బాధ్యతరాహిత్యం అనాలా? ఈ రెండూ కాకపోతే అధికారంతోపాటు వచ్చిన అతిశయం అనుకోవాలా?

► అనతి కాలంలోనే బాగా సంపాదించిన ఓ తండ్రి తన కొడుకుతో ‘ఈ వయసులో నేను కెరీర్‌లో స్థిరపడడానికి అహోరాత్రులు కష్టపడ్డాను. నీకు ఆ కష్టం అవసరం లేదు, నా లైఫ్‌ని కూడా నువ్వే ఎంజాయ్‌ చెయ్యి’ అని అవసరానికి మించినంత డబ్బు ఇవ్వడాన్ని ఏ విధమైన పేరెంటింగ్‌గా పరిగణించాలి?

► ‘నువ్వు ఏదైనా చెయ్యి, అయితే! ఏం చేశావో చెప్పేసెయ్, తర్వాత ఏ తలనొప్పులూ రాకుండా నేను చూసుకుంటాను’ అని ఒక నాయకుడు తన పిల్లలతో చెప్పడాన్ని ఎలా చూడాలి?

► ‘మా అమ్మాయి ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో అందరూ చాలా గొప్పవాళ్లు. తనకు కారు లేదని చిన్నబుచ్చుకుంటోంది. అందుకే తన కోసం ఓ కారు బుక్‌ చేశాం’ అని చెప్పుకునే ఓ తల్లి.
ఆ మైనర్‌ అమ్మాయి బైక్‌ యాక్సిడెంట్‌ చేస్తే అందుకు మూల్యం చెల్లించాల్సింది అమాయకులే కదా! ఆ సంపన్న కుర్రాడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే సదరు అమ్మాయిల జీవితాన్ని, జీవించే హక్కును కాలరాసిన నేరం ఎవరిది?


పై తల్లిదండ్రులందరికీ తమ పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంది. అందులో సందేహం లేదు. ఆ ప్రేమ వెనుక ఉండాల్సిన బాధ్యత ఏమవుతోంది? మద్యం సేవించి కారు నడిపితే జరిగే ప్రమాదాల గురించి చెప్పాలని, మద్యం సేవించి కారు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి, ఆ ప్రమాదం తమకు ఎదుటి వారిని కూడా ప్రాణాపాయంలోకి నెట్టివేస్తుంది కాబట్టి ఆ సమయంలో వాహనం నడప వద్దని, అలా నడపడం చట్టరీత్యా నేరమని చెప్పడం మర్చిపోతున్నారు.

మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు ఆపుతారు, కాబట్టి పోలీసులకు దొరకకుండా ఉండడానికి చిట్కాలు నేర్పిస్తున్నారు. ఇంటికి మెయిన్‌రోడ్‌లో రాకుండా పోలీసు నిఘా, సీసీ కెమెరాల్లేని గల్లీల్లో ఎలా రావాలో జాగ్రత్తలు చెప్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండడం నేర్పిస్తున్నారు, పోలీసులు ఆపినప్పుడు ఎలా బయటపడాలో నేర్పిస్తున్నారు తప్ప ఆ పొరపాటు మీరు చేయవద్దు అని చెప్పే వాళ్లు ఎంతమంది?

ఉద్యోగం– ఒత్తిడి
జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి, పిల్లల్ని సౌకర్యంగా పెంచాలి, మంచి చదువు చెప్పించాలి... మధ్యతరగతి పేరెంట్స్‌ వీటన్నింటినీ ప్రధాన కర్తవ్యాలుగానే చూస్తున్నారు. అయితే ఒక కార్పొరేట్‌ స్కూల్‌లో చేర్చడంతో తమ బాధ్యత పూర్తయినట్లు భావిస్తున్నారు. నిజానికి ఏ స్కూలూ పేరెంటింగ్‌ రోల్‌ పోషించలేదు. ఆ బాధ్యత పేరెంట్స్‌దే. తమ పిల్లలకు స్నేహితులెవరనేది ప్రతి పేరెంట్‌కి తెలిసి ఉండాలి. పిల్లలను ఇంట్లో బంధించినట్లు పెంచడమూ కరెక్ట్‌ కాదు, అలాగని పార్టీలకు వెళ్తుంటే... గుడ్డిగా వదిలేయనూకూడదు.

ఆ పార్టీ జరిగే ప్రదేశం తెలిసి ఉండాలి. అది బర్త్‌డే పార్టీ కావచ్చు, ఫేర్‌వెల్‌ కావచ్చు. పార్టీ జరిగే చోట పిల్లల్ని డ్రాప్‌ చేయడం, పికప్‌ చేసుకోవడం తల్లిదండ్రులే చేస్తుంటే అనేక ఘోరాలకు అడ్డుకట్ట పడుతుంది. అంతకంటే ముందు మద్యం సేవించడం అభ్యుదయానికి చిహ్నం అనే అపోహను తొలగించాలి. అలాగే మంచి– చెడు చెప్పడం, సంస్కారం నేర్పించడంతోపాటు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల గురించి అవగాహన కల్పించాలి. న్యాయవ్యవస్థ మీద గౌరవం తల్లిదండ్రులలో ఉండాలి. అప్పుడే పిల్లలకు నేర్పడం సాధ్యమవుతుంది.

చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎదురయ్యే పర్యవసానాలను తెలియచెప్పాలి తప్ప తప్పించుకోవడానికి ఉన్న మార్గాలను కాదు. అన్నింటికంటే ఈ తరం పిల్లలకు ఇంట్లో వాళ్ల భయం తక్కువగా ఉంటోంది. అమ్మానాన్నలను సులువుగా ఏమార్చవచ్చనే ధోరణి కూడా పెరిగింది. దొరికిపోతామేమోననే భయం లేకుండా సులువుగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. అలాగే హింసలో ఆనందాన్ని వెతుక్కునే దారుణమైన మానసిక స్థితి కూడా పెరిగింది. దీనికి బాల్యంలో వీడియోగేమ్‌ల రూపంలో బీజాలు పడుతున్నాయి. ఒకటి– ఒకటి కలుస్తూ సమస్య పెనుభూతంలా విస్తరిస్తోంది.

తరం మారిన వైనం
ఒక్కసారి వెనక్కి చూసుకుంటే... గడచిన తరాలు పాటించిన పేరెంటింగ్‌ వాల్యూస్‌ పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలో తల్లిదండ్రులు కచ్చితంగా చెప్పేవారు. పిల్లల్ని పై చదువులకు బయటకు పంపించేటప్పుడు ‘గౌరవానికి భంగం కలిగే పనులకు పాల్పడవద్దు’ అని హితవు చెప్పేవారు. ‘మీరు తప్పు చేస్తే మేము తలవంచుకోవాల్సి వస్తుంద’ని పిల్లలకు బాధ్యత గుర్తు చేసేవాళ్లు. ఆడపిల్లల విషయంలో ఎంత హుందాగా వ్యవహరించాలో చెప్పేవాళ్లు. ఇప్పుడు పిల్లల్లో షేరింగే కాదు, తోటి వారి పట్ల కేరింగ్, సర్దుబాటు కూడా కొరవడింది. తాము కోరుకున్నది, కోరుకున్న  క్షణంలోనే అందాలి.

‘నేను, నా ఎంజాయ్‌మెంట్‌’ అనే సెల్ఫ్‌ సెంట్రిక్‌ ధోరణి ఎక్కువవుతోంది. టీనేజ్‌ పిల్లల్లో, యువతలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి, జరుగుతున్న నేరాలకు ఇవన్నీ తెరవెనుక కారణాలే. త్రిబుల్‌ రైడింగ్‌లోనో, హెల్మెట్‌ లేదనే కారణంతోనో పోలీసు ఆపితే తండ్రి పేరు చెప్పడానికి భయపడేది గత తరం. తండ్రికి తెలిస్తే కోప్పడతారనే భయం అది. ఇప్పుడు ‘నన్నే ఆపుతావా! మా నాన్న ఎవరో తెలుసా?’ అని ఓ టీనేజ్‌ కుర్రాడు పోలీసు మీద హుంకరించాడంటే తప్పు పట్టాల్సింది ఎవరిని? ఎవరినో తప్పు పట్టడం కాదు, ఆత్మ పరిశీలన, ప్రక్షాళన ఇంటి నుంచే మొదలుకావాలి.

ఒంటరిగా వదలవద్దు
ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. పైగా చాలా కుటుంబాలు ఒన్‌ ఫ్యామిలీ– ఒన్‌ కిడ్‌ పాలసీనే అనుసరిస్తున్నాయి. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిన ఇళ్లలో పిల్లలు ఒంటరిగా గడిపే సమయం పెరుగుతోంది. ఇది డిజిటల్‌ ఎరా, ప్రపంచం అరచేతిలోనే ఉంటోంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ వయసు పిల్లలు చూడకూడనివెన్నో చూస్తారు. స్నేహితులను ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అవసరానికి మించిన ప్రైవసీ కూడా ప్రమాదమే. ఒక సంఘటనను లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఇలాంటి అసలు నిజాలెన్నో. ఒక దారుణం జరిగిందంటే ఆ నాలుగైదు రోజులు చర్చించుకుని ఆ తర్వాత మర్చిపోవడం సహజం. కానీ అలాంటి దుష్ప్రభావాలకు లోనుకాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement