రోజుకు 80 రూపాయలు సంపాదించే ఓ రైతు కూలీ కుమార్తె సోనాలి. అలాంటిది భారతదేశం నుండి అమెరికా వరకు డాన్స్ షోలలో విన్యాసాలను చూపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. కోల్‌కతాలోని భివాష్ అకాడమీ ఆఫ్ డాన్స్‌కు చెందిన ఇద్దరు నృత్యకారులు సుమంత్ మార్జు, సోనాలి మజుందార్. ఇద్దరూ అమెరికాలోని గాట్ టాలెంట్ షోలో పాల్గొని వారి అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచారు. ‘ఫాటా పోస్టర్ నిక్లా హీరో‘ చిత్రంలోని ‘ధాటింగ్ నాచ్‘ సాంగ్‌కి ఈ జంట అద్భుతమైన నృత్యం చేసింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారంతా సోనాలిని ప్రశంసలతో ముంచెత్తారు. వారంతా ఆమె కుటుంబం గురించి తెలుసుకున్నప్పుడు సోనాలి పట్ల వారికున్న గౌరవం మరింత పెరిగింది.
ఆకలితో నిద్రపోయిన రోజులు
సోనాలి మాట్లాడుతూ ‘నా తండ్రి రోజూ 80 రూపాయలు సంపాదించే రైతు కూలీ. ఆర్థికలేమి కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు కడుపునిండా తినడానికి ఇంట్లో తిండే ఉండేది కాదు. ఆకలితో నిద్రపోయిన రోజులెన్నో. ఆ ఆకలే ఈ రోజు నాలో ప్రతిభను వెలికి తీయడానికి కారణమయ్యిందేమో అనిపిస్తోంది’ అని సవినయంగా తెలిపింది. తన ప్రతిభతో కుటుంబానికి కీర్తి తీసుకొచ్చింది. 2012 లో భారతదేశంలో గాట్ టాలెంట్ సీజన్ 4 విజేతగా సోనాలి మజుందార్ నిలిచింది.
భూమి.. ఇల్లు
2019 లో సోనాలి బ్రిటన్ గాట్ టాలెంట్ లో పాల్గొంది. అక్కడ, తన ఊరి గురించి ప్రస్తావిస్తూ– ‘బంగ్లాదేశ్ సమీపంలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చాను, అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు‘ అని వివరించింది. ఇప్పుడు సోనాలీ సంపాదనతో ఆమె తండ్రి తన ఊళ్లో భూమి కొన్నాడు, ఇల్లు కట్టాడు. రైతు కూలీగా జీవితం వెళ్లిపోతుందనుకున్న ఆ తండ్రి కూతురు కారణంగా నిజమైన రైతు అయ్యాడు. కూతురుని కన్నందుకు ఆ తండ్రి అదృష్టవంతుడు అని గ్రామస్థులు చెప్పుకుంటూ ఉంటారు.
కళ్లార్పని ప్రదర్శన
అమెరికాలోని గాట్ టాలెంట్ కోసం సోనాలి, సుమంత్ రోజూ 8–10 గంటలు ప్రాక్టీస్ చేశారు. ‘ఈ షోలో పాల్గొనడం అనేది నా కల. మా గురువు బివాష్ సార్ వల్ల నా కల నెరవేరింది. నేను డ్యాన్స్ షో కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కటే అనుకున్నాను. ప్రేక్షకులు కళ్లార్పకుండా చూసేలా ప్రదర్శన ఇవ్వాలి అని’ చెప్పింది సోనాలి. ఆ మాటను షోలో పాల్గొన్న ప్రతీసారీ నిలబెట్టుకుంటోంది సోనాలి.
Comments
Please login to add a commentAdd a comment