కొలంబియా పాప్ సింగర్, డ్యాన్సర్ షకీరా పాడుతూ చేసిన డ్యాన్స్‌ను టీవీలో చూసింది తొమ్మిదేళ్ల తస్లీమా బానో. ఆ డ్యాన్స్ బాగా నచ్చడంతో ఎంతోఆసక్తిగా గమనించి స్టెప్పులను గుర్తుపెట్టుకుంది. ఒకరోజు వాళ్ల ఇంటికి దగ్గరలో జరుగుతున్న కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ చేస్తుంటే తస్లీమా కూడా డ్యాన్స్ చేసింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు విపరీతంగా కోపడ్డారు. ‘‘ఇంకోసారి డ్యాన్స్ చేశావంటే ఊరుకోము’’ అని హుకుం జారీ చేశారు. అయినా వినలేదు. దీంతో పన్నెండురోజులపాటు ఒక గదిలో పెట్టి బంధించారు. అయినా తస్లీమా వెనక్కి తగ్గలేదు. తనలోని ప్రతిభతో అందరి మన్ననలు పొందడమేగాక తన తండ్రి మనసు గెలుచుకుని, ఏకంగా ఇండియన్ షకీరాగా ఎదిగింది.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చెందిన నూర్ మహ్మద్, బేగం దంపతుల ముద్దుల కూతురు తస్లీమా భానో. అమ్మవాళ్లు డ్యాన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో.. మొదట్లో వాళ్లకు ఎదురు చెప్పలేక వెనక్కు తగ్గింది తస్లీమా. ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో తస్లీమా డ్యాన్స్‌పోటీలో పాల్గొంది. మిగతా వారికంటే బాగా డ్యాన్స్ చేయడంతో మొదటి బహుమతి గెలుచుకుంది. అంతేగాక ఆ కార్యక్రమాన్ని చూసిన వారంతా తస్లీమాను చప్పట్లు, అభినందనలతో ముంచెత్తారు.స్కూలు టీచర్లు తనలోని డ్యాన్స్ ప్రతిభను తెగపొగిడేశారు. అక్కడకు వచ్చిన నూర్ మహ్మద్ ఇవన్నీ చూసి.. ‘ఇంతటి ప్రతిభను మేము ప్రోత్సహించకుండా వద్దన్నామా?’ అని గ్రహించి, అప్పటి నుంచి తస్లీమా డ్యాన్స్ చేయడాన్ని ప్రోత్సహించేవారు. కానీ అమ్మకు మాత్రం ఏ మాత్రం ఇష్టం ఉండేదికాదు. అలా తస్లీమా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.
‘గోరీ నాఛే’ నుంచి.. ‘గోరీ’గా మారింది
తండ్రి ప్రోత్సాహంతో చిన్నచిన్న కార్యక్రమాలలో తన డ్యాన్స్‌లతో అలరించేది తస్లీమా. సాఫీగా సాగిపోతున్న డ్యాన్స్ జర్నీలో ఒక పెద్ద కుదుపు ... 2010లో నూర్‌మహ్మద్ మరణించాడు. హఠాత్తుగా జరిగిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తస్లీమా ఏడాది పాటు డ్యాన్స్ ప్రపంచాన్ని వదిలేసింది. షాక్ నుంచి కోలుకున్నాక మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. రాజస్థానీ పాట ‘లే ఫొటు లే’ తస్లీమాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత చేసిన ‘గోరీ నాఛే నాగోరీ నాఛే’ పాట రాజస్థాన్‌లోనే సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కపాటతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయింది. కొంతమంది స్టార్ల పేర్లు మారినట్టే.. అభిమానులంతా గోరీ నాగోరీగా పిలుస్తూ తస్లీమాపేరునే మార్చేశారు. ఏ ప్రదర్శనకు వెళ్లినా గోరీ అనిపిలుస్తూ.. ముందు ‘నాగోరీ’ పాటకు డ్యాన్స్ చేయాలని డిమాండ్ చేసేవారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక పాపులర్ పాటలకు స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ, ఇతర డ్యాన్సర్‌ల కంటే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. రాజస్థాన్‌తోపాటు హర్యాణా, ఢిల్లీ, యూపీలలో తస్లీమాకు మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. నటుడు, ర్యాపర్, సింగర్, డ్యాన్సర్, ప్రొడ్యూసర్‌గా హర్యాణాలో పాపులర్ అయిన సన్నీ చౌదరీతో కలిసి కొన్ని డ్యాన్స్ వీడియోలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ ఏడాది విడుదలైన ‘ఘఘరో’ సాంగ్ ఒక్కరోజులో 16 మిలియన్ల వ్యూస్‌తో రీజనల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.
ప్రతిభ ఉండాలేగానీ ఎంత పెద్దఅడ్డంకి అయినా మన ‘ఎదుగుదల’ను ఆపలేదని తస్లీమా డ్యాన్స్ జర్నీ స్ఫూర్తినిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment