నేడు మెలనియా ట్రంప్ ::: నిన్న మిషెల్ ఒబామా ::: మొన్న లారా బుష్
ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ‘ఫిల్లీ గర్ల్’! అమెరికా ఎన్నికలు అయ్యాక.. ట్రంప్ (ఒకవేళ) ఓడిపోయాక.. బైడెన్ కొత్త అధ్యక్షుడయ్యాక.. ఫిల్లీ గర్ల్ అనే మాట మీరు వింటారు. ఆ ఫిల్లీ గర్ల్.. జిల్ బైడెన్. యు.ఎస్. కొత్త ప్రథమ మహిళ!
జిల్ ట్రేసీ పవర్ గర్ల్. ఫిలడెల్ఫియా మెట్రోపాలిటన్ ఏరియాలో పెరిగిన అమ్మాయిల్నెవర్నీ ఆ పట్టణం ఎంతోకాలం పూర్తి అమాయకత్వంతో ఉంచదు. జిల్ ట్రేసీలా న్యూజెర్సీలో పుట్టి వచ్చిన అమ్మాయిల్నైనా సరే, వాళ్లెప్పుడు టీనేజ్‌లోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పదహారేళ్లు వచ్చేటప్పటికే జిల్ ట్రేసీ కూడా ఫిల్లీ గర్ల్ అయిపోయింది. అంటే.. ఫిలడెల్ఫియా సమర్పించిన పవర్ గర్ల్ అన్నమాట! ఆ వయసుకే ఫిలడెల్ఫియా స్పోర్ట్స్ టీమ్‌లోని కళ్లన్నీ జిల్ ట్రేసీ మీద పడ్డాయి. కాస్త తొందరపాటు ఉత్సాహంతో ముందుకు వచ్చిన ప్లేబాయ్ చూపుల్ని ట్రేసీ తన నొప్పించని తృణీకారపు నవ్వుతో పక్కకు తోసేసేది. అందం కాదు ఆ అమ్మాయిలోని గురుత్వాకర్షణ. టఫ్‌గా ఉంటుంది. అది నచ్చేది అబ్బాయిలకు. ‘టఫ్ కుకీ ఫిల్లీ గర్ల్’ అని పేరు కూడా పెట్టేశారు.
ఫిజికల్‌గా, క్విజికల్‌గా ఉన్నవాళ్లను.. ముఖ్యంగా అమ్మాయిల్ని.. ‘టఫ్ కుకీ’లు అనడం ఫిలడెల్ఫియా పరాజిత బాలుర నిస్సహాయ నైజం. పదిహేనేళ్ల వయసులో ట్రేసీ న్యూజెర్సీలో వెయిట్రెస్‌గా చిన్న ఉద్యోగాన్ని వెతుక్కున్నప్పుడే స్లాట్లాండ్ యాస లో ఆమె మాట్లాడే ఫిలడెల్ఫియా ఇంగ్లిష్‌కు సహచరులు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టీ పెట్టగానే భగ్న హృదయులైపోయారు. ట్రేసీకి తల్లి నుంచి వచ్చిన ఆకర్షణీయమైన యాస అది. గృహిణి ఆమె. తండ్రి బ్యాంకు ఉద్యోగి. ట్రేసీ తర్వాత నలుగురూ చెల్లెళ్లే. పద్దెనిమిదేళ్లకే ట్రేసీ డిగ్రీ పూర్తయింది. పందొమ్మిదేళ్లకు పెళ్లి చేసుకుంది. బిల్ స్టీవెన్‌సన్ అతడి పేరు. ఫుట్‌బాల్ ప్లేయర్. ఫిలడెల్ఫియా స్పోర్ట్ టీమ్‌లో ఆమె మనసును గెలిచినవాడు.
మనసును గెలిచాడే గానీ, మనసును తెలుసుకోలేకపోయాడు! పెళ్లయ్యాక ఐదేళ్లే కలిసి ఉన్నారు! మూడో వ్యక్తి ప్రవేశం తన భార్యను తన నుంచి వేరుచేసిందని నాలుగు రోజుల క్రితం కూడా అన్నాడు స్టీవెన్‌సన్. ఆ మూడో వ్యక్తి.. జో బైడెన్. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి. స్టీవెన్‌సన్‌తో విడాకులు తీసుకున్న రెండేళ్లకే జో బైడెన్‌ను పెళ్లి చేసుకున్నారు జిల్ ట్రేసీ. ఈ ఎన్నికల్లో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. జిల్ ట్రేసీ అమెరికా ప్రథమ మహిళ అవుతారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రార్థనామందిరంలో (చాపెల్) 1977 లో జో బైడెన్, జిల్ ట్రేసీల పెళ్లి జరిగింది. బైడెన్‌కు అప్పటికే పిల్లలు ఉన్నారు. భార్య, కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయి, ఇద్దరు కొడుకులతో ఒంటరిగా ఉన్న సమయంలో ట్రేసీ అతడికి పరిచయం అయ్యారు. రెండోసారి పెళ్లి అయేనాటికి ఆమె వయసు 26. బైడెన్‌కు 34 ఏళ్లు. వీళ్లిద్దరికీ ఒక కూతురు. ఇప్పటికి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. పెద్దకొడుకు బ్యూ బైడెన్ పేరున్న లాయర్. బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాడు. చిన్నకొడుకు హంటర్ బైడెన్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్. కూతురు ఆష్లీ సోషల్ వర్కర్. ట్రేసీతో పెళ్లయ్యేనాటికే జో బైడెన్ కౌంటీ కౌన్సిల్ సభ్యుడు.
ఈ నలభై మూడేళ్ల కెరీర్‌లో అతడి అత్యున్నత స్థాయి అమెరికా ఉపాధ్యక్ష పదవి. బరాక్ ఒబామాతో కలిసి ఎనిమిదేళ్లు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. జిల్ ట్రేసీ మాత్రం తనకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌లోనే ఉండిపోయారు. బైడెన్ ఉపాధ్యక్షుడు అయ్యాక కూడా ‘ద్వితీయ మహిళ హోదా’ను వార్డ్‌రోబ్‌లో పడేసి, రోజూ కాలేజ్‌కి వెళ్లి రావడం మాత్రం ఆమె మానలేదు. విల్లింగ్టన్‌లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్ గా ఆమె ఉద్యోగ జీవితం మొదలైంది. ప్రస్తుతం ఆమె నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్. బైడెన్ ఒక్కో మెట్టూ రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే జిల్ ట్రేసీ అధ్యాపక వృత్తికి అవసరమైన ఒక్కో డిగ్రీ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆమె.. తన భర్త అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా తను మాత్రం కాలేజ్‌కి వెళ్లొస్తుంటాననే చెబుతున్నారు! ఆమెలోని ‘ఫిల్లీ గర్ల్’.. తనను ఆరాధించిన వారిని సున్నితంగా నిరాకరించిన విధంగానే వైట్ హౌస్ ఇచ్చే గొప్ప హోదా కన్నా, ఇంగ్లిష్ ప్రొఫెసర్ అనే గుర్తింపునే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment