తోడుగా ఉండటం అంటే?! సమరానికి శంఖం అవడం. నినాదానికి ప్రతిధ్వని అవడం. పిడికిలికి సత్తువ అవడం. ఆగ్రహానికి జ్వాల అవడం. గళానికి రుద్ర గీతం అవడం. గాయానికి ఛాయ అవడం. తోడుగా ఉండటం అంటే.. బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించడం. మహిళల కొత్త ఒరవడి ఇది.
ప్రియాంక గాంధీ రాహుల్‌కి చెల్లెలా అక్కా అనే సందేహం కలిగేలా వాళ్లిద్దరి మధ్య ఉన్న రెండేళ్ల వ్యత్యాసమే.. ప్రియాంక కొడుకు, కూతురు మధ్య కూడా ఉంది. రాహుల్ ప్రియాంకకు అన్న. అలాగే రైహాన్ మిరాయాకు అన్న. ప్రియాంక కొడుకు రైహాన్, ప్రియాంక కూతురు మిరాయా బయట కనిపించే సందర్భాలు చాలా తక్కువ. అయితే కొద్ది రోజులుగా అమ్మ ప్రియాంక, అమ్మమ్మ సోనియాతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న మిరాయా (18) ఫొటో ఒకటి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తోంది. అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటో. ‘నథింగ్ కెన్ బి బ్రేవర్, నథింగ్ కెన్ బి స్ట్రాంగర్, నథింగ్ మోర్ ఫన్ దేన్ ఉమన్ సపోర్టింగ్ ఉమెన్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టారు ప్రియాంక. మహిళకు మహిళ మద్దతుగా ఉంటే అంతకు మించిన ధైర్యం, అంతకు మించిన శక్తి లేదని ఆ క్యాప్షన్‌కు అర్థం.
‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొన్నాళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధ మహిళలు తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పుడీ ధోరణి ‘ట్రెండింగ్’లో ఉంది. పారిశ్రామిక వేత్తలు, ఇతర రంగాలలోని మహిళలు కూడా ఇప్పుడిప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తున్నారు. అనుష్క శర్మ, సారా అలీఖాన్, అనన్యా పాండే, టీనా అంబానీ, దియా మీర్జా, కరిష్మా కపూర్, మాధురీ దీక్షిత్, కత్రీనా కైఫ్.. ఒక్కొక్కరుగా ఈ ‘ఛాలెంజ్‌ని స్వీకరించాం’ అని ముందుకు వస్తున్నారు. ఏమిటీ ఛాలెంజ్?! ‘ఒకరికొకరం ఉన్నాం. కలసి ఎదుర్కొందాం’ అని ముందుకొచ్చి కనిపించడం. అయితే వచ్చేదేదో కలర్ ఫొటోలతోనే రావచ్చు కదా! రావచ్చు కానీ.. ఇదొక సంకేతాత్మక ఉద్యమం. ఈ నలుపు తెలుపు రంగుల ఛాయా చిత్రాలకు అర్థం, పరమార్థం లేకుండా ఏమీ లేదు.
ఇప్పటివరకు 53 లక్షలకు పైగా ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’ ఫొటోలు నెట్‌లో పోస్ట్ అయ్యాయి. ఈ ఉద్యమానికి ఆద్యులు ఎవరో స్పష్టంగా తెలియకున్నా ఆరంభం అయింది మాత్రం టర్కీలో అని ఒక యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు వల్ల తెలుస్తోంది. ‘‘టర్కీలో మహిళలపై నిరంతరం హింస, దౌర్జన్యాలు కొనసాగుతూ ఉంటాయి. వారి రక్త గాయాలను మీడియా బ్లాక్ అండ్ వైట్‌లో చూపిస్తుంటుంది. రేపు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటో మనదే కావచ్చు అనే సంకేతాన్ని వ్యాప్తి చేసేందుకు మహిళలంతా సంఘటితం కావడానికి, సంఘీభావం తెలుపుకోడానికి బ్లాక్ అండ్ ఫొటోలను పోస్ట్ చేయడం మొదలైందని విని నేను ఆశ్చర్యపోయాను.
ఇది శక్తిమంతమైన ఆలోచన. సమాజంలో మార్పును తెచ్చే ధోరణి’’ అని ఆ యూజర్ రాశారు. హాలీవుడ్‌లో ఈ ఉద్యమానికి ప్రాముఖ్యం కల్పించింది మాత్రం నటి సూజన్ సరాండన్. ఈ ఏడాది మార్చి 13న బ్రియానా టేలర్ అనే 26 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ మహిళను పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా సూజన్.. తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేసి, ఆ ఘటనపై మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. ‘ఈ చైతన్య ఉద్యమంలో నాతో ఎవరైనా కలుస్తారా?’ అని పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఇండియాలో ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది.
ఊరికే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పోస్ట్ చేయడం కాకుండా, స్ఫూర్తిని కలిగించే నాలుగు మాటలను కూడా మహిళలు షేర్ చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న అనుష్క శర్మ మంగళవారం తన ఫొటోతోపాటు.. ‘పోరాటంలో మనం స్నేహితులం. ఉందాము మనం తోడుగా..’ అని పెట్టిన పోస్టుకు పన్నెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి! ఉద్యమం రంగు ఎరుపు అనే ఇంతవరకు అనుకున్నాం. ఇప్పుడు నలుపు తెలుపు కూడా.
Comments
Please login to add a commentAdd a comment