బెదిరింపులు చెల్లవ్‌ | Shubham Mishra Threatened Agrima In Pune | Sakshi
Sakshi News home page

బెదిరింపులు చెల్లవ్‌

Published Tue, Jul 14 2020 12:09 AM | Last Updated on Tue, Jul 14 2020 9:11 AM

Shubham Mishra Threatened Agrima In Pune - Sakshi

మగాళ్లనైతే చంపుతామంటారు. స్త్రీలను?... రేప్‌ చేస్తామంటారు. స్త్రీలు స్వేచ్ఛను కోరినా, స్వతంత్రాన్ని సాధించుకున్నా, నిరసన వ్యక్తం చేసినా, అన్యాయంపై గళమెత్తినా, కొత్తమార్గం చేపట్టినా, ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా నచ్చని వారి నుంచి వచ్చే ఒకే ఒక బెదిరింపు ‘రేప్‌ చేస్తాం’. ఈ మాటతో బెదిరించవచ్చని, దీనికి ఆమోదం ఉందని అనుకునేవారు  మన దేశంలో ఉన్నారు. కాని ఇలా నోరు పెగలితే లాకప్‌లోకి వెళ్లాల్సుంటుందని తాజా ఉదంతం చెబుతోంది.

మనుషులు ఒక్కోసారి నచ్చనిది మాట్లాడతారు. ఒక్కోసారి హేళన కొద్దీ మాట్లాడతారు. ఒక్కోసారి పొరపాటుగా మాట్లాడతారు. మరోసారి అనాలోచితంగా మాట్లాడతారు. ప్రతిసారీ అందరూ అన్ని మాటలను ‘నమ్మి’ మాట్లాడకపోవచ్చు. తర్వాత చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు. క్షమాపణలు కోరవచ్చు. ఇలాంటి సందర్భాలలో పురుషులను ‘శారీరకంగా హింసిస్తాం’ అని బెదిరింపులు వస్తుంటాయి.

స్త్రీలకు మాత్రం ‘లైంగికంగా హింసిస్తాం’ అని బెదిరింపులు వస్తాయి. స్త్రీలను లైంగికంగా హింసించే అనుమతి ఉందని అనుకోవడం అల్పమైన పురుష భావజాలం. దీనిని సరి చేయడానికి స్త్రీ, పురుష ఆలోచనాపరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ భావజాలం మారాల్సి ఉంది. తాజాగా స్టాండప్‌ కమెడియన్‌ అగ్రిమా జాషువా ఉదంతం పురుషులు మాట్లాడే ‘బెదిరింపు భాష’ను సరి చేయించాల్సిన అవసరాన్ని తెలియ చేసింది. ఆమెను వడోదరాకు చెందిన శుభమ్‌ మిశ్రా అనే వ్యక్తి ‘రేప్‌ చేస్తానని’ బెదిరించాడు. ఆమె చేసిన పనితో అతనికి అసమ్మతి ఉండటం వల్ల అతడు ఇచ్చిన వార్నింగ్‌ ఇది.

అగ్రిమా జాషువా ఏం చేసింది?
పూణెకు చెందిన అగ్రిమా (28) ముంబైలో ఇంజినీరింగ్‌ చదువుతూ చివరి సంవత్సరంలో చదువు మానేసి స్టాండప్‌ కమెడియన్‌గా మారింది. ‘ఇదే తన అసలు సత్తా’ అని ఆమె నిశ్చయించుకొని తన తల్లితండ్రుల స్వరాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ మీద ‘ఉత్తర ప్రదేశ్‌ మన దేశపు టెక్సాస్‌’ అని ఒక వీడియో చేసింది. దానికి చాలా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆమె చేసిన షోస్‌ అభిమానులు పెరిగారు. అయితే సంవత్సరం క్రితం ఒక షోలో ఆమె ముంబై సముద్ర తీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన భారీ ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.

ఆ వ్యాఖ్యలు శివాజీ గురించి కాకపోయినా రాజకీయ నాయకులను వెర్రిగా అభిమానించేవారి మూఢభక్తి గురించే అయినా అవి కొంతమంది మనోభావాలను గాయపరిచాయి. వెంటనే ఆ వీడియోను అగ్రిమా తొలగించింది. క్షమాపణలు చెప్పింది. తాజాగా మళ్లీ ఆ వీడియోను ఎవరో సర్క్యులేషన్‌లో పెట్టారు. మహారాష్ట్రకు చెందిన ఒక ఎం.ఎల్‌.ఏ అగ్రిమాను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేయడంతో మళ్లీ అందరి దృష్టి అగ్రిమాపై పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ధాక్రే దీనిపై పోలీసు విచారణకు ఆదేశించారు. కొందరు ఆమెను చంపుతామని బెదిరించారు. కాని వడోదరాకు చెందిన శుభమ్‌ మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాను ‘రేప్‌ చేస్తానని’ బెదిరిస్తూ వీడియో రిలీజ్‌ చేశాడు.
నిరసన
అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని, కాని స్త్రీలను హెచ్చరించాల్సి వచ్చినప్పుడల్లా రేప్‌ భాషను ఎందుకు వాడతారని శుభమ్‌ మిశ్రా వీడియో దరిమిలా దేశవ్యాప్త స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. అయితే శుభమ్‌ మిశ్రా ఈ బెదిరింపుపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాని వడోదరా పోలీసులు రంగంలోకి దిగి శుభమ్‌ మిశ్రాను అరెస్ట్‌ చేశారు. శుభమ్‌ పెట్టిన వీడియోను ‘సు మోటో’గా తీసుకున్నామనీ అతనిపై ఐ.పి.సి 294, 354 (ఏ), 504, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలియ చేసింది.

మహిళా కమిషన్‌ విచారణ
స్టాండప్‌ కమెడియన్‌ అగ్రిమా జాషువాకు వచ్చిన రేప్‌ బెదిరింపు దృష్టికి రావడంతోటే జాతీయ మహిళా కమిషన్‌ రంగంలోకి దిగింది. ‘మహిళలకు ఆన్‌లైన్‌ స్పేస్‌ కల్పించడంలో, సైబర్‌ సెక్యూరిటీని ఇవ్వడంలో, వారు స్వేచ్ఛగా సైబర్‌ స్పేస్‌ను వాడుకునేలా చేయడంలో జాతీయ మహిళా కమిషన్‌ రక్షణగా ఉంటుంది’ అని దాని చైర్‌పర్సన్‌ రేఖా శర్మ గుజరాత్‌ డి.జి.పికి లేఖ రాశారు.

మర్యాదగా వ్యవహరించాలి
సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే విషయాలు అనేకం జరుగుతుంటాయి. భావోద్వేగాల తక్షణ స్పందనను కోరుతుంటాయి. ఆ సమయంలో సంయమనం పాటించాలి. ముఖ్యంగా స్త్రీల విషయంలో మాట్లాడే భాష ప్రజాస్వామికంగా, సమస్థాయిలో, చర్చకు యోగ్యంగా ఉండాలి. లేని పక్షంలో బాధితులు ఊరుకున్నా చట్టం ఊరుకోదని ఈ ఉదంతం తెలియచేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement