అంతరిక్షం కూడా ఆయన పేరు దాచుకుంది | Special Story About Singer Pandit Jasraj | Sakshi
Sakshi News home page

అంతరిక్షం కూడా ఆయన పేరు దాచుకుంది

Published Tue, Aug 18 2020 2:45 AM | Last Updated on Tue, Aug 18 2020 2:55 AM

Special Story About Singer Pandit Jasraj - Sakshi

సంగీతాన్ని భాషగా చేసుకుని ప్రపంచంతో సంభాషించాడు. గానాన్ని సందేశంగా చేసుకొని జనులందరికీ సమ అనుభూతులు కలిగించాడు. ఆయన పేరు చెప్తే ఈ దేశం గుర్తుకొస్తుంది. ఈ దేశం పేరు చెప్తే ఆయన పేరు తలుస్తారు. పండిట్‌ జస్‌రాజ్‌. భారతీయ సంగీత పరంపరను విశ్వవ్యాప్తం చేసిన గానవారధి. సమకాలికులకు గురువు. శిష్యులకు సంగీత సూర్యుడు. శోకస్వరాలలో ముంచి సెలవు తీసుకున్నాడు.

భారతీయ సంగీత జగత్తులో అంతరిక్షాన్ని తాకిన ఘనత పండిట్‌ జస్‌రాజ్‌కే దక్కుతుంది. ‘నాసా’ పూనికతో ఆయన పేరు అంతరిక్షానికీ చేరుకుంది. అమెరికన్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ (జేపీఎల్‌) సౌర మండలానికి వెలుపల ఉన్న ఒక చిన్న గ్రహానికి పండిట్‌ జస్‌రాజ్‌ పేరును గత ఏడాది సెప్టెంబరులో నామకరణం చేసింది. పండిట్‌ జస్‌రాజ్‌ ప్రతిభా సంపత్తికి ఇదొక అరుదైన గుర్తింపు.

హర్యాణ బాలుడు
పండిట్‌ జస్‌రాజ్‌ 1930 జనవరి 28న హర్యానాలోని హిసార్‌ జిల్లా పిలిమండోరిలో ఒక సంగీత కుటుంబంలో పుట్టారు. తండ్రి పండిట్‌ మోతీరామ్‌ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. జస్‌రాజ్‌కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు మోతీరామ్‌కు హైదరాబాద్‌ నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నుంచి ఆస్థాన విద్వాంసుడిగా రమ్మంటూ ఆహ్వానం వచ్చింది. దురదృష్టవశాత్తు నిజాం ఆస్థానంలో చేరాల్సిన రోజునే ఆయన పరమపదించారు.

జస్‌రాజ్‌ పెద్దన్న పండిట్‌ మణిరామ్‌ అప్పటికే సంగీతాభ్యాసాన్ని పూర్తి చేసుకుని కచేరీలు చేస్తుండేవాడు. తండ్రికి నిజాం ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు. ఆయనతోపాటే కుటుంబమంతా హైదరాబాద్‌ తరలివచ్చింది. పండిట్‌ జస్‌రాజ్‌ బాల్యం, యవ్వనం హైదరాబాద్‌లోనే గడిచాయి. పండిట్‌ జస్‌రాజ్‌ మరో అన్న పండిట్‌ ప్రతాప్‌ నారాయణ్‌ కూడా సంగీత విద్వాంసుడే. హైదరాబాద్‌ వచ్చేశాక మణిరామ్‌ తన ఇద్దరు తమ్ముళ్లకూ సంగీత పాఠాలు నేర్పించేవాడు. జస్‌రాజ్‌కు తబలా వాద్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవాడు. 

బేగం అఖ్తర్‌ గాన ప్రభావం
చిన్నారి జస్‌రాజ్‌ రోజూ స్కూలుకు వెళుతున్నాని ఇంటి నుంచి బయలుదేరేవాడు. కాని దారిలో కోఠీ ఉండేది. అందులో బేగం అఖ్తర్‌ రికార్డులను ప్లే చేసేవారు. బేగం అఖ్తర్‌ పాడిన ‘దీవానా బనానా హైతో దీవానీ బనాదే’ అనే పాటను జస్‌రాజ్‌ ప్రతిరోజూ వినేవాడు. ‘ఆమె పాటే సంగీతంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది’ అని చెప్పుకున్నాడు. 

తబలా నుంచి గాత్రానికి
 జస్‌రాజ్‌ మొదట తన సోదరుడు మణిరామ్‌జీ పర్యవేక్షణలో తబలా నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ముఖ్యగాయకునికే తప్ప వాద్యకారులకు ఏ విలువా ఉండేది కాదు. లాహోర్‌కు ఒకసారి బాల జస్‌రాజ్‌ కచేరీ కోసం వెళితే ముఖ్యగాయకునికి వేదిక కల్పించి తబలా ఏర్పాటు వేదిక కింద చేశారు. దీంతో జస్‌రాజ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత ఒకసారి రేడియోలో ఒక పండితుడు భీంప్లాస్‌ రాగాన్ని అద్భుతంగా ఆలపించాడట. దాని గురించి మరో ఇద్దరు గాత్ర విద్వాంసులు చర్చించుకుంటూ ఉంటే జస్‌రాజ్‌ కల్పించుకుని అభిప్రాయం చెప్పాడు. అది విన్న గాత్ర విద్వాంసులు ‘జస్‌రాజ్‌. నువ్వు తోలు మీద దరువేసే వాద్యకారుడివి. నీకు ఇవన్నీ ఎందుకు చెప్పు’ అన్నారట. ‘ఆరోజే నిశ్చయించుకున్నాను నేను ఎలాగైనా గవయ్యా (గాయకుడు) అవ్వాలని’ అన్నాడు జస్‌రాజ్‌.

కలకత్తా పయనం
స్వాతంత్య్రం వచ్చాక నిజాం సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో పండిట్‌ మణిరామ్‌ సోదరులతో పాటు కలకత్తాకి మకాం మార్చారు. కలకత్తా చేరుకున్నాక జస్‌రాజ్‌ రేడియోలో పాటలు పాడటం ప్రారంభించారు. అయితే, తరచుగా గుజరాత్‌లోని సనంద్‌కు రాకపోకలు సాగిస్తూ, అక్కడ ‘మేవాతి ఘరానా’ సంప్రదాయంలోని మెలకువలను నేర్చుకున్నారు. అప్పట్లోనే ఆయన సనంద్‌ సంస్థానాధీశుడు మహారాజా జయవంత్‌సింగ్‌ వాఘేలా ఎదుట తొలి కచేరీ చేశారు. అయితే అది అంతఃపుర కచేరీ. 

బాంబే బదిలి
బాంబేలో ఒక కచేరీ సందర్భంగా 1960లో తొలిసారిగా తన కాబోయే జీవిత భాగస్వామి మధురా శాంతారామ్‌ను కలుసుకున్నారు. ఆమె ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్‌ కుమార్తె. మధురా శాంతారామ్‌తో 1962లో వివాహం తర్వాత మరుసటి ఏడాదిలోనే మకాంను బాంబేకు మార్చారు. నేపాల్‌ రాజు త్రిభువన్‌ బీర్‌ బిక్రమ్‌ షా ఆస్థానంలో 1952లో తొలిసారిగా నిండుసభలో వేదికపై కచేరీ చేసి శ్రోతలను మెప్పించారు పండిట్‌ జస్‌రాజ్‌. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మేవారీ ఘరానాకు చెందిన గులాం ఖాదిర్‌ ఖాన్, ఆగ్రా ఘరానాకు చెందిన స్వామి వల్లభ్‌దాస్‌ దాముజీల వద్ద సుశిక్షితుడైన పండిట్‌ జస్‌రాజ్‌ దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా కచేరీలు చేశారు.

భార్య వైపు నుంచి సినీ అనుబంధం ఏర్పడటంతో కొన్ని సినిమాలకూ పనిచేశారు. వసంత్‌దేశాయ్‌ స్వరకల్పనలో ‘లడ్కీ సహ్యాద్రి కీ’ (1966) సినిమాలో ‘వందనా కరో’ అనే పాట పాడారు. అదే ఆయన తొలి సినీగీతం. ‘బీర్బల్‌ మై బ్రదర్‌’ (1975)లో పండిట్‌ భీమ్‌సేన్‌ జోషితో కలిసి పాడారు. ఇటీవలి కాలంలో విక్రమ్‌ భట్‌ తీసిన హారర్‌ మూవీ 1920 (2008) సినిమాలో ‘వాదా తుమ్‌సే హై వాదా’ పాడారు. జస్‌రాజ్‌ భార్య మధురా శాంతారమ్‌ 2009లో ‘సంగీత మార్తాండ్‌ పండిట్‌ జస్‌రాజ్‌’ పేరిట బయోపిక్‌ తీశారు. తర్వాత ఆమె 2010లో ‘ఆయీ తుఝా ఆశీర్వాద్‌’ అనే మరాఠీ సినిమా తీశారు. అందులో లతా మంగేష్కర్‌తో కలసి జస్‌రాజ్‌ ఒక మరాఠీ గీతాన్ని ఆలపించారు. 

చాదస్తాలు లేని సంగీతకారుడు
సంగీతం విశ్వజనీనమైన కళ అని త్రికరణశుద్ధిగా నమ్మిన జస్‌రాజ్‌ తన తొలినాళ్లలోనే శాస్త్రీయ సంగీత కచేరీ సంప్రదాయాల్లోని అన్ని చాదస్తాలకూ తిలోదకాలిచ్చేశారు. ఆయన తన కచేరీల్లో రకరకాల ఘరానాలకు చెందిన స్వరవిన్యాసాలు చేసేవారు. ఛాందసులు ఈ పద్ధతిని విమర్శించేవారు. స్వరమాధుర్యమే ముఖ్యం అనుకునే శ్రోతలు మాత్రం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. శుద్ధ శాస్త్రీయ సంగీతంతో పామరులను ఆకట్టుకోవడం తేలిక కాదని తలచి, కాస్త తేలికపాటి ‘హవేలీ సంగీతాన్ని’ కూడా వినిపించేవారు. శాస్త్రీయ కచేరీల్లో ‘హవేలీ సంగీతానికి’ ప్రాచుర్యం తెచ్చిన ఘనత పండిట్‌ జస్‌రాజ్‌కే దక్కుతుంది. అంతేకాదు, జుగల్‌బందీ కచేరీల్లోనూ ఆయన తనదైన ప్రత్యేక శైలిని సృష్టించారు.

ఇద్దరు గాయకులు లేదా గాయనీ గాయకులు వేర్వేరు రాగాల్లోని ఒకే మూర్చనను ఆలపించే ఆ జుగల్‌బందీ శైలి ‘జస్‌రంగీ’గా ప్రాచుర్యం పొందింది. పండిట్‌ జస్‌రాజ్‌ ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ (1975), పద్మభూషణ్‌ (1990), పద్మవిభూషణ్‌ (2000) అవార్డులతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు (1987), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ (2010) సహా ఆయనకు అనేక పురస్కారాలు, బిరుదులు, సత్కారాలు లభించాయి. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన ఒక సమున్నత శిఖరం. ఆయన విద్వత్తు ఒక చెరగని సంతకం. – దాసు

రసావతారుడు పండిట్‌ జస్‌రాజ్‌
భారతీయ సంగీత శిఖరం ఒరిగిపోయింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత మేరువు పండిట్‌ జస్‌రాజ్‌ అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాన్‌సేన్‌ ఎలా పాడుతారో మనకు తెలియదు. గంధర్వులు, కిన్నరులు, నారద, తుంబురులనే వారు అసలు ఉన్నారో లేరో మన మేధకు, అవాహనకు అందదు. వీరందరూ ఉండే ఉంటారు...  వీరి రూపంలో వచ్చారేమో అనిపించే సంగీత స్వరూపం, రసావతారుడు పండిట్‌ జస్‌రాజ్‌. జయహో! మాతా! అని జస్‌ రాజ్‌ గొంతు నుండి వినగానే ప్రేక్షకులు అనిర్వచనీయమైన భావ తరంగాల్లోకి వెళ్లి పోతారు. ఏ రాగం ఎత్తుకుంటే ఆ రాగదేవత జస్‌రాజ్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. రాగమై, గానమై ప్రాణమై ధ్వనిస్తుంది. జస్‌రాజ్‌ తాను లీనమై పాడుతూ, వినేవారిని తన్మయులను చేస్తూ, తనలో లీనం చేసుకుంటారు. సంగీతాన్ని ప్రతిభా ప్రదర్శనగా ఏనాడూ చెయ్యలేదు.

నేలపై పద్మాసనం వేసుకొని అనంతమైన ఆకాశంవైపు చూస్తూ అనంతమైన శక్తి స్వరూపానికి నాదమయమైన అర్చన చేసిన యోగి పండిట్‌ జస్‌ రాజ్‌. దుర్గాదేవిని, శ్రీకృష్ణపరమాత్మను ఉఛ్వాస నిశ్వాసలలో నిలుపుకొని గానం చేసిన భక్తి సామ్రాజ్య సమ్రాట్‌ జస్‌రాజ్‌. ఇంట్లో రెండు తంబురలు పెట్టుకొని నాదోపాసన చేస్తున్నా లక్షల మంది ప్రేక్షకుల మధ్య కచేరీ చేస్తున్నా పండిట్‌ జీ తీరు ఒకటే. పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, పండిట్‌ శివ్‌ కుమార్‌ శర్మ, ఎల్‌ సుబ్రహ్మణ్యం మొదలైన దిగ్గజ వాయిద్య విద్వాంసులతో జుగల్‌ బందీ, త్రిగళ్‌ బందీ చేసే సమయంలోనూ ఎక్కడా నువ్వా? నేనా? అనే ప్రదర్శన ఉండదు. యోగముద్రలో కూర్చొని ఒక మౌని గానం చేస్తున్నట్లు ఉంటుంది పండిట్‌ జస్‌రాజ్‌ సంగీత కచేరీ విధానం. 

జస్‌ రాజ్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి భజన్స్‌. శ్లోకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని కోట్లమంది వీటిని వింటూ వుంటారు. డిజిటల్, సీడీ, డివిడి వివిధ  రూపాల్లో నిక్షిప్తమై ఉన్న ఈ సంపద భారతీయ సంగీత ఖజానా. జస్‌రాజ్‌ గొంతులోనే ఒక ప్రత్యేకమైన మాధుర్యం, మత్తు, ప్రేమతత్త్వం ఉన్నాయి. సంగీతం కోసం భక్తి కాదు. భక్తి కోసమే సంగీతం అని భావించి, గానంలో తరించి దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని తరింప జేసిన సంగీతమూర్తి జస్‌రాజ్‌. దర్బారీ, అహిర్‌ భైరవ్, విలక్షణ తోడి, భాగేశ్రీ, భూప్, మాల్కౌన్స్, కావేరి, యమన్‌.. ఇలా ఏ రాగంలో పాడుతున్నా, వినేవారిని రసలోకాల్లో విహరింపజేసే ప్రతిభామూర్తి, సంగీతజ్ఞుడు, పండితుడు, కళామూర్తి, పరమ భక్తుడు పండిట్‌ జస్‌రాజ్‌.

మేవాతీ ఘరానాకు చెందిన వీరి సంగీత విద్యా వికాసం అన్యులకు అసాధ్యం. త్రివేణి, ముల్తానీ, బేహడ, గౌడాగిరి మల్హర్, పూర్వీ రాగాలు జస్‌ రాజ్‌ గొంతులో, గానంలో కొంగ్రొత్త సొగసులు వలికిస్తాయి. చిదానంద రూప శివోహం శివోహం, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద్‌ దామోదర మాధవేతి, మేరో అల్లా, శ్రీ కృష్ణ మధురాష్టకం అద్భుత భక్తి సంగీత శిఖర సదృశాలు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హృదయం మధురం... అని  ఆయనే పాడినట్లు జస్‌రాజ్‌ గానం మధురం. ఆయన సంగీతం చరితం అఖిలం మధురం. 

ఆయన ప్రతి ఏటా హైదరాబాద్‌ లో, కార్తీకమాసంలో సంగీత సమారోహ్‌ నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్‌లో  చివరగా 2014లో విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కవుల కళా పీఠం జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. ఆ సందర్భంగా జస్‌రాజ్‌ మాట్లాడుతూ తెలుగు నా మాతృభాష అని చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలు రెండుగా ఏర్పడినా తెలుగువారంతా ఒక్కటే అని పండిట్‌ జస్‌రాజ్‌ తెలుగు నేలపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. పండిట్‌ జస్‌రాజ్‌ కేవలం గాయకకళామూర్తి కాదు, భక్తాగ్రేసరుల ప్రతిరూపం. పరమ భాగవతోత్తముడు పండిట్‌ జస్‌ రాజ్‌. ఒక మహా అవతారం అనంతనాదంలో విలీనమైంది. – మాశర్మ 

పండిట్‌ జస్‌రాజ్‌ అస్తమయం
న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మవిభూషణ్‌ పండిట్‌ జస్‌రాజ్‌ (90) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీలో తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ‘బాపూజీ ఇక లేరు’అని ఆయన కూతురు దుర్గ వెల్లడించారు. భిన్న రాగాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ శ్రోతలను మైమరపించిన భారత సంగీత దిగ్గజాల్లో ఒకరైన జస్‌రాజ్‌ది ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌. మేవాతి ఘరానా శైలికి చెందిన గాయకుడు. ఆయనకు భార్య మధుర, కుమారుడు సారంగ్‌దేవ్‌ పండిట్, కూతురు దుర్గా జస్‌రాజ్‌లు ఉన్నారు. అమెరికాకు వెళ్లిన జస్‌రాజ్‌ కరోనా మూలంగా లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే ఉండిపోయారు.

‘సంగీత మార్తాండ్‌ పండిట్‌ జస్‌రాజ్‌ గారు సోమవారం ఉదయం 5.15కు గుండెపోటుతో మరణించారని బాధాతప్త హృదయాలతో తెలియజేస్తున్నాం. స్వర్గంలో కృష్ణభగవానుడు ఆయనకు ప్రేమతో స్వాగతం పలుకుగాక. అక్కడ పండిట్‌ జస్‌రాజ్‌ ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అంటూ ఇక తన స్వామి కోసమే పాడతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం’అని పండిట్‌ జస్‌రాజ్‌ కుటుంబం ముంబైలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్‌రాజ్‌ చివరిసారిగా తన గానామృతాన్ని వినిపించారు. వారణాసిలోని సంకటమోచన్‌ హనుమాన్‌ ఆలయం కోసం హనుమాన్‌ జయంతి రోజున ఫేస్‌బుక్‌ లైవ్‌లో పాడారు. 

‘పండిట్‌ జస్‌రాజ్‌ మృతి భారతీయ సంగీతానికి తీరనిలోటు. అసమాన గాయకుడే కాకుండా ఎందరినో తీర్చిదిద్దిన గురువు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement