బావ అంటే బావ అనుకునే పరిచయం నాది, వంగపండుది. అది ఎలా అయిందో చెబుతాను. 50 ఏళ్ల క్రితం వంగపండు ప్రసాదరావుతో పరిచయం జరిగింది. నక్సల్‌బరి ఉద్యమంలో మా ఇద్దరి స్నేహం బలపడింది. నేను ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి అప్పుడప్పుడే కాలు పెడుతున్న సమయం అది. అక్కడ అప్పటికే వంగపండు చాలా ఫేమస్. బొబ్బిలిలో ప్రదర్శన ఇవ్వటం కోసం వెళ్లాం. స్టేజి మీద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే సమయానికి పోలీసులు వచ్చారు. అప్పుడు నేను ఆ ప్రాంతానికి కొత్త. ‘ఒరేయ్ బావా.. నీ గొంగళి, గజ్జెలు ఇడిíసిపెట్టకు’ అని నాకు వంగపండు చెప్పిండు. ఆయన వెనక ఆయన దారిలోనే పోయాను. అక్కడ ఓ పోలీసాయన ఆపితే ‘మేమేం చేశాం, పాట పాడుతున్నాం. అంతేకదా’ అని ఎదురు తిరిగి వాదన పెట్టినాడు.
ఆయన నా వైపు చూసి ‘వీడెవడు’ అని అడిగాడు. అప్పుడు ప్రసాద్ తడుముకోకుండా ‘మా బావ’ అన్నాడు. అలా అక్కడినుండి తప్పించుకుని లాడ్జ్‌కి పోయాము. అక్కడ మహాకవి శ్రీశ్రీ ఉన్నారు. అప్పుడు శ్రీశ్రీగారు మమ్మల్ని ఉద్దేశించి ‘నేను ఎక్కడికి వెళ్లలేకపోయానో మీ పాటతో మీరు అక్కడికి చేరారు. రేపటి రోజు మీదేరా’ అన్నారు. అంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఏముంటుంది? అప్పుడు మా బావ శ్రీకాకుళం యాసలో శ్రీశ్రీగారితో ‘ప్రోగ్రామ్ పోయినాదండి’ అన్నాడు. నేను నవ్వుతుంటే ‘ఏంట్రా బావా..∙నవ్వుతున్నావు’ అని నన్ను చూసి చమత్కరించాడు. మా ఇద్దరినీ చూసి మీ కాంబినేషన్ బావుందని శ్రీశ్రీగారు అన్నారు. ‘మీ ఇద్దరూ ఉండగా మీటింగ్ ఎలా అయిపోద్ది, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం’ అని మూడు తెల్లపేపర్లు తెప్పించారాయన. అందులో నక్సలైట్లు, దేశభక్తులు అని రాసి మా మెడలో వేసి ఆయన కూడా ఒకటి తగిలించుకుని ‘ఇక పదండి పోదాం’ అని బయలుదేరారు శ్రీశ్రీగారు. మాతో పాటు భూషణం అనే రచయిత, చలసాని ప్రసాద్ తదితరులు ఉన్నారు. అక్కడికెళ్లేసరికి స్టేజ్ లేదు, కూలిపోయింది.
అక్కడ ఏ స్టేజ్ లేకపోయినా వంగపండు ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అంటూ ముందు బయలుదేరితే మేమంతా ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా...’ అంటూ కోరస్ పాడుతూ ఆయన్ను ఫాలో అయ్యాం. అప్పటివరకు చెల్లాచెదురైన జనమంతా మా పాటలో కలిశారు. భావం భౌతికశక్తిగా మారినప్పుడు అది దిశను ఇస్తుంది. పాలకవర్గాల రాజకీయ అధికారం పౌరసమాజం భావాల్లో ఉంటుంది. ఆ భావాలను మార్చటమే కవి, వాగ్గేయకారుడు, కళాకారుడు చేయాల్సిన పని. మా బావ ఆ పనిని చక్కగా చేశాడు. మేం పాడని పాటలేదు, ఆడని ఆట లేదు. వరంగల్‌లో పన్నెండు లక్షలమందిని పొద్దుగాల నుండి తెల్లారే వరకు కూర్చోపెట్టగలిగామంటే పాట భౌతికశక్తిగా మారింది. సినిమా పరిశ్రమలో ఆర్. నారాయణమూర్తి మాతో ఎన్నో పాటలు రాయించి, మా వేలు పట్టుకు నడిపించారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...’ అనగానే గుండెకు హత్తుకుని నీవు రాయవే.. నా సినిమాలో ఈ పాట పెడదాం అని భరోసా ఇచ్చే మనిషి ఎవరుంటారు? నారాయణమూర్తి మాకు భరోసా ఇచ్చారు. వంగపండుకు కూడా తన సినిమాలన్నిటిలో అవకాశం ఇచ్చి ఈ రోజు వంగపండు పాటను ప్రపంచం మొత్తానికి వినపడేలా చేశారాయన. తెలుగు అక్షరం ఉన్నంతవరకు వంగపండు పాట ఉంటుంది, వంగపండు ఉంటారు.
ప్రజల యాసలో జీవితాన్ని పలికించారు..
చిన్న చిన్న పదాలతో, ప్రకృతిలో కనిపించే పశుపక్ష్యాదులతో, ప్రజల భాషలోని యాసతో జీవితత్వాన్ని చెప్పారు. శ్రీకాకుళ ఉద్యమం తరువాత తెలంగాణ బాట పట్టిన వంగపండు జగిత్యాల జైత్రయాత్రతో సహా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1990లో నిజాం కళాశాలలో జరిగిన జననాట్యమండలి బహిరంగసభలో వంగపండు ఆట, పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment