మౌనంగా ఉండనివ్వదు సన్మీ. మౌనం బ్యాడ్ హ్యాబిట్ అంటుంది! ఏదో ఒకటి చెప్పు.. ఏదో ఒకటి చెయ్యి.. నీకు రానిదే నీ ప్రావీణ్యం.. ఇదీ.. సన్మీ ‘పాప్’ ఫిలాసఫీ! భారతీయతకు ‘కొరియా’గ్రఫీ చేసింది. అక్షింతలు వేయించుకుంది. సారీ చెప్పేసి.. బీట్ మార్చుకుంది.
పాప్ సంగీతంలో ‘సంప్రదాయం’ ఉండదు. పద్ధతి తప్పిన మాట, పాట, ఆట ఉంటాయి. ‘పద్ధతేంటి మీ బొంద’ అని నోటి దగ్గరి మైక్‌ని ముఖం మీదకి విసిరికొట్టినంత పని చేస్తారు ఈ ‘పాప్’ పిల్లలు ఏ దేశమేగినా, ఎందు కాలిడినా! సన్మీ.. దక్షిణ కొరియా గాయని. పాడటం ఒక్కటే కాదు. పాటలు రాస్తుంది. చేప పిల్లలా ఎగిరి పడుతుంది. సంగీతంలో శ్రుతులు, లయలు రుచించని అశాస్త్రీయ శాకాహారుల విస్తరికి బాస్ గిటార్‌తో ఒక చుక్క మీన్ కొళంబు (చేపల పులుసు)ను అంటించి పోతుంది సన్మీ.
ప్రధాన భోజనానికి ముందరి స్టార్టర్! తదుపరి గరిటె వడ్డింపు కోసం తనెక్కడుందా అని చూస్తే.. స్టేజ్ ఖాళీ. వెతుక్కోవాలి.. ఆరోజు పున్నమి కనుకైతే ఆ గుండ్రటి గోళంలో! అక్కడి నుంచి ఏ సముద్రంలోనో వాయుగుండం పుట్టించడానికి కిందికి జారిపోతుంది. తమిళ్, కన్నడ, మలయాళం.. ఎవరి రథం ముగ్గులు వాళ్లవి మన దగ్గర. ఇండియా, జాంబియా.. అన్నీ ఒకటే ఈ కొరియన్ అమ్మాయి సన్మీకి. అందుకే ఇప్పుడు తిట్లు తింటోంది. భారతీయ సంప్రదాయ నృత్యాలను సన్మీ తన స్టెయిల్లో అభినయించేసరికి ఒక నిముషం కూడా భరించలేకపోయారు మనవాళ్లు.
ఒక్క రోజులోనే దక్షిణ కొరియా నుంచి రెండు ఉత్పాతాలు! ఒకరెవరో ఆ దేశం నుంచి వెళ్లి.. ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసైనా లేని కిమ్ గారి ఉత్తర కొరియాలో కలకలం రేపారు. ఇంకొకరు సన్మీ. జూలై 26న ట్విట్టర్‌లో ఆమె పెట్టిన టిక్ టాక్ వీడియో భారతదేశంలో శాస్త్రీయ నృత్యాభిమానులకు వేళాకోళం వెక్కిరింపులా అనిపించి అశాంతి జ్వాలలు రేపింది. ఎక్కడ చూశారో మరి! సన్మీ, ఆమె ఇద్దరు మిత్రురాళ్లు మన కూచిపూడిని, భరతనాట్యాన్ని వాళ్ల చేతి వేళ్లతో డాన్స్ చేయించారు! ఆ వీడియో చూసి మన నెటిజన్‌లు కోపంతో చిందులేశారు.
కొరియాకు, ఇండియాకు మధ్య ఇప్పటికైతే ఏం లేదు. వీళ్ల వల్ల వచ్చేస్తుందా అన్నంత అయింది. ‘‘సారీ.. నా తెలియనితనానికి నన్ను మన్నించండి..’’ అని ట్వీట్ చేసింది సన్మీ. ‘‘ఒక కారణం కానీ, ఒక ఉద్దేశం కానీ లేకుండా మేమిలా విదేశీ నృత్యాలను అభినయించాం’’అని కూడా వివరణ ఇచ్చింది. ఈ పాప్ అర్టిస్టులు ఇంతే. మనోభావాల్ని చూసుకోరు. సంస్కృతాన్ని సంస్కృతంలా ఉండనివ్వకుండా మాండలికం బట్టలు తొడిగి, ‘చల్’ మని హిప్ మీద ఒకటి కొట్టి ఆల్బమ్ షూట్ చేసేసుకుంటారు.
సన్మీ.. మ్యూజికల్లీ.. ఎ వండర్ గర్ల్స్. లీ సన్ మి.. అసలు పేరు. ‘వండర్ గర్ల్స్’ అని దక్షిణ కొరియాలో నలుగురమ్మాయిల కె–పాప్, రెట్రో, పాప్ రాక్ గ్రూపు ఒకటి ఉంది. అందులో ఒకమ్మాయి సన్మీ. అంతా ఒక ఈడు వాళ్లు. బిలో థర్టీస్. 2013లో సోలోగా తను తెచ్చిన ‘ఫుల్ మూన్’ సింగిల్‌తో సన్మీ ఎవరా అని చూసింది పాప్ ప్రపంచం. ‘మౌనం మంచిదని చెప్పకు. నిండు పున్నమి రోజు నన్ను చూడ్డానికి రా..’ అని అంటుంది సన్మీ అందులో. వెన్నెల్ని తోడేసే మీగడ పెరుగులాంటి ప్రేమ గీతం అది! ఇదిగో టిక్‌టాక్ వచ్చాకే.. మధ్య మధ్యలో ఇలాంటి వన్ మినిట్ అభినయ గీతాలాపనలు చేస్తోంది సన్మీ.సన్మీ (ఎడమ) చేత సారీ చెప్పించిన ‘ఇండియన్’ డాన్స్ వీడియో ఇదే.
Comments
Please login to add a commentAdd a comment