
‘పిల్లలు ఎలా ఉన్నారో’ అని ఆ టీచర్‌కు బెంగ వచ్చింది. ‘వాళ్ళకు ధైర్యం చెప్పాలి’ అని కూడా అనిపించింది. ‘చదువు మీద ధ్యాస మళ్లించాలి’ అని నిశ్చయించుకుంది. తమిళనాడు కడలూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని నడువీరపట్టు అనే ఊరి హైస్కూల్‌లో తమిళ టీచరుగా పని చేస్తున్న వి.మహలక్ష్మి ఈ కరోనా కాలంలో తన విద్యార్థులే తనకు ముఖ్యం అనుకుంది. అనుకున్నదే తడవు వారి ఇళ్లకు బయలుదేరింది. ఆమె పని చేసే స్కూల్లో 700 మంది విద్యార్థులు ఉన్నారు. మహలక్ష్మి ప్రస్తుతం పదో క్లాసుకు వచ్చిన పిల్లలను కలవడం ముఖ్యం అనుకుంది. గత రెండు వారాలుగా రోజూ ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి కలుస్తోంది.
‘వీరంతా తొమ్మిది పరీక్షలు రాయకుండానే పదికి ప్రమోట్ అయ్యారు. అయితే స్కూళ్లు నడవడం లేదు. ప్రయివేటు స్కూళ్ల ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాని మా గవర్నమెంట్ స్కూల్లో చదివే పేదపిల్లలకు టీవీ, స్మార్ట్ ఫోన్లు లేవు. వీరంతా డీలా పడిపోతారని నాకు అనిపించింది. పైగా పెద్దవాళ్లు వీళ్లను పనిలో పెడితే అసలుకే మోసం వస్తుంది. అందుకే వీరందరినీ ఇంటింటికీ వెళ్లి కలుస్తున్నాను’ అని చెప్పింది మహలక్ష్మి. మహలక్ష్మి గత రెండు వారాలుగా ఇంట్లో ఉదయం పూట పని ముగించుకుని ఊరిలోని పిల్లల ఇళ్లకు బయలుదేరుతోంది. పిల్లలతో తల్లిదండ్రులతో మాట్లాడుతోంది.
‘వారికి పనులు చెప్పకండి. చదువు వైపు ధ్యాస పెట్టేలా చేయండి’ అని వారికి హితవు చెబుతోంది. దాంతోపాటు కరోనా జాగ్రత్తలు కూడా. ‘నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. కష్టపడి టీచర్ అయ్యాను. పేదపిల్లల కష్టాలు నాకు తెలుసు. అందుకే వారిని కలిసి చదువు మీద శ్రద్ధ నిలబడేలా చేస్తున్నాను. ఫోన్లు ఉన్నవారందరితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టి ఉత్సాహపరుస్తున్నాను. వాళ్లకు అవసరమైన విషయాలు యూట్యూబ్ చానెల్ ద్వారా ఎలా చూడాలో చెబుతున్నాను. చదువు కంటే ముందు పిల్లలతో బంధం ఏర్పడటం నాకు ముఖ్యం’ అంటోంది మహాలక్ష్మి. ఇలాంటి టీచర్లే దేశానికి సరస్వతి రక్ష.
Comments
Please login to add a commentAdd a comment