దైవమిచ్చిన భార్య | Special Story Of Joe Biden Wife Jil Biden In Sakshi Family | Sakshi
Sakshi News home page

దైవమిచ్చిన భార్య

Published Wed, Nov 11 2020 4:11 AM | Last Updated on Wed, Nov 11 2020 5:01 AM

Special Story Of Joe Biden Wife Jil Biden In Sakshi Family

ప్రథమ మహిళలు ప్రత్యేకమైనవారు. జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ మరీ మరీ ప్రత్యేకమైనవారు. వ్యక్తిగా తనకు తాను ప్రత్యేకం. భార్యగా జో బైడెన్‌కు ప్రత్యేకం. కొత్త హోదాలో కూడా టీచర్‌గానే ఆమెఎప్పటిలా రోజూ కాలేజ్‌కి వెళ్లనున్నారు! జో బైడెన్‌కు ఆమె ప్రత్యేకం దేనికంటే..  తల్లిలేని తన పిల్లల కోసం, తన కోసం.. దైవం పంపిన భార్య.. జిల్‌ బైడెన్‌!

జిల్‌ బైడెన్‌ అమెరికా కొత్త ప్రథమ మహిళ! 2009–2017 మధ్య ఆమె అమెరికా ‘ద్వితీయ మహిళ’. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆ సమయంలో జో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉండటంతో బైడెన్‌ భార్య అయిన జిల్‌ బైడెన్‌ ద్వితీయ మహిళ అయ్యారు. ఈ ప్రథమ, ద్వితీయాలను పక్కన ఉంచితే, ఆమెకై ఆమెగా జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ బైడెన్‌ (జిల్‌ పూర్తి పేరు)కు అనేక గుర్తింపులు ఉన్నాయి. ‘జాకబ్స్‌’ అనేది ఆమెకు తండ్రి నుంచి సంక్రమించిన పేరు. పెళ్లయ్యాక జాకబ్స్‌ పక్కన ‘బైడెన్‌ ’ వచ్చి చేరింది. 

జిల్‌ బైడెన్‌ జో బైడెన్‌ రెండో భార్య. జో బైడెన్‌ జిల్‌ బైడెన్‌కు రెండో భర్త. వాళ్లిద్దరి ఏకైక సంతానం.. కూతురు యాష్లీ. జిల్‌కి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఓడిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌కీ ఏ మాత్రం సంబంధం లేని రెండు సంబంధాలు ఉన్నాయి! జిల్‌ బైడెన్‌ తండ్రి పేరు డొనాల్డ్‌ కార్ల్‌ జాకబ్స్‌. ఆ పేరులో డొనాల్డ్‌ అని ఉండటం ఒకటి. డొనాల్డ్‌ ట్రంప్‌కు గత ఎన్నికల విజయంలో, ఈ ఎన్నికల అపజయం లో కీలకంగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలోనే జిల్‌ బైడెన్‌ చిన్నతనం అంతా గడవడం ఇంకొకటి. జిల్‌ పుట్టింది మాత్రం న్యూజెర్సీలోని హ్యామన్‌టన్‌లో. ఇంట్లో అంతా ఆడపిల్లలే. ఐదుగురు సంతానంలో పెద్దమ్మాయి జిల్‌ ట్రేసీ. తండ్రి బ్యాంకర్‌. తల్లి బోనీ గృహిణి.

‘మమ్మీ మనకోసం పంపింది’
69 ఏళ్ల జిల్‌ బైడెన్‌ స్కూల్‌ చదువు 1969 లో పూర్తయింది. తర్వాత కాలేజీ, మోడలింగ్, ఆ సమయంలోనే మొదటి భర్తతో పరిచయం, ప్రేమ, పెళ్లి, ఐదేళ్లకు విడాకులు, ఆ తర్వాత రెండేళ్లకు 1977లో జో బైడెన్‌తో వివాహం. మొదటి భర్తతో పెళ్లయ్యే నాటికి జిల్‌ ట్రేసీకి పందొమ్మిదేళ్లు. వాళ్లిద్దరికీ పిల్లల్లేరు. జో బైడెన్‌ సోదరుడు ఫ్రాంక్‌ ద్వారా జోకి, జిల్‌కి పరిచయం. జోకి, జిల్‌కి పెళ్లయ్యేనాటికే జో రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ప్రభుత్వ టీచర్‌. తొలి చూపుల ప్రేమ తర్వాత ఇద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా ‘ఎ మ్యాన్‌ అండ్‌ ఎ ఉమన్‌’. సినిమా అయ్యాక ఆమెను ఇంట్లో దింపుతూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ‘గుడ్‌ నైట్‌’ చెప్పారు జో. 

ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆమె పెద్దగా అరిచి తల్లితో చెప్పిన మాట ‘మామ్‌.. ఐ ఫైనల్లీ మెట్‌ ఎ జంటిల్మన్‌’.. అని. ‘జంటిల్మన్‌’ అని చెప్పనైతే తల్లికి చెప్పిందే కానీ, జో ఐదుసార్లు ప్రపోజ్‌ చేశాక గానీ పెళ్లికి జిల్‌ ట్రేసీ ఓకే చెప్పలేదు. జో మొదటి భార్య, కూతురు అప్పటికి ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జో బైడెన్‌కి చనిపోయిన ఆ కూతురుతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వాళ్లిద్దరికీ జిల్‌ ట్రేసీనే తల్లయింది.

‘‘మమ్మీ మన కోసం జిల్‌ని పంపింది’’అని పిల్లలతో చెప్పేవారు జో బైడెన్‌. తర్వాత ఈ దంపతులకు యాష్లీ పుట్టింది. భర్తని, పిల్లల్ని చూసుకుంటూనే సైకియాట్రి ఆసుపత్రిలో పని చేస్తూ.. రెండు మాస్టర్స్‌ డిగ్రీలు చేశారు జిల్‌ బైడెన్‌. ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్‌ చేశారు. బోధన ఆమెకు ఇష్టమైన వృత్తి. చిన్న పిల్లల కోసం ఆమె ‘డోంట్‌ ఫర్గెట్, గాడ్‌ బ్లెస్‌ అవర్‌ ట్రూప్స్‌’ అని ఒక పుస్తకం రాశారు. మిలటరీలో పని చేస్తూ, బ్రెయిన్‌ క్యాన్సర్‌తో చనిపోయిన జో పెద్ద కుమారుడు బ్యూ బైడెన్‌ కుమార్తె నటాలీ (మనవరాలు) కోణంలో జిల్‌ ఈ పుస్తకం రాశారు. ఆమె రాసిన రెండో పుస్తకం ‘జోయీ : ది స్టోరీ ఆఫ్‌ జో బైడెన్‌’. తన భర్త చిన్ననాటి ఫొటోల పిక్చర్‌ బుక్‌ అది. జోయీ అంటే పిల్లాడు అని. అంత ప్రేమ ఆమెకు భర్త అంటే. 

పవర్‌ గర్ల్‌.. జిల్‌ ట్రేసీ
న్యూజెర్సీ నుంచి టీనేజ్‌లో ఫిలడెల్ఫియా రాగానే జిల్‌ ట్రేసీ ‘ఫిల్లీ గర్ల్‌’ అయింది. ఫిల్లీ గర్ల్‌ అంటే.. ఫిలడెల్ఫియా పవర్‌ గర్ల్‌ అని. పదహారేళ్ల వయసుకే ఫిలడెల్ఫియా స్పోర్ట్స్‌ టీమ్‌లోని కళ్లన్నీ జిల్‌ ట్రేసీ మీద పడ్డాయి. అబ్బాయిల ప్లేబాయ్‌ చూపుల్ని ట్రేసీ తన నొప్పించని మృదువైన నిరాకరణ నవ్వుతో పక్కకు తోసేసేది. అందం కాదు ట్రేసీలోని ఆకర్షణ. కటువుగా ఉండేది ఆమె. ఆ కటుత్వాన్ని అబ్బాయిలు ఇష్టడ్డారు. ‘టఫ్‌ కుకీ ఫిల్లీ గర్ల్‌’ అని పేరు కూడా పెట్టేశారు. పదిహేనేళ్ల వయసులో ట్రేసీ న్యూజెర్సీలో వెయిట్రెస్‌గా చిన్న ఉద్యోగాన్ని వెతుక్కున్నప్పుడే స్లాట్లాండ్‌ యాసలో ఆమె మాట్లాడే ఫిలడెల్ఫియా ఇంగ్లిష్‌కు సహచరులు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టేవారు. ట్రేసీకి తల్లి నుంచి వచ్చిన ఆకర్షణీయమైన యాస అది.


పద్దెనిమిదేళ్లకే ట్రేసీ డిగ్రీ పూర్తయింది. డిగ్రీ అవగానే పెళ్లి చేసుకుంది. బిల్‌ స్టీవెన్‌సన్‌ అతడి పేరు. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. ఫిలడెల్ఫియా స్పోర్ట్‌ టీమ్‌లో ఆమె మనసును గెలిచినవాడు. మనసును గెలిచాడే గానీ, మనసును తెలుసుకోలేకపోయాడు! అతడితో విడిపోయాక.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రార్థనామందిరంలో జో బైడెన్, జిల్‌ ట్రేసీల పెళ్లి జరిగింది. రెండోసారి పెళ్లి అయేనాటికి ఆమె వయసు 26. బైడెన్‌కు 34 ఏళ్లు. ఇప్పటికి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. చిన్న కొడుకు హంటర్‌ బైడెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌. కూతురు ఆష్లీ సోషల్‌ వర్కర్‌.

ట్రేసీతో పెళ్లయ్యేనాటికే జో బైడెన్‌ కౌంటీ కౌన్సిల్‌ సభ్యుడు. ఈ నలభై మూడేళ్ల కెరీర్‌ లో మొన్నటి వరకు అతడి అత్యున్నత స్థాయి.. అమెరికా ఉపాధ్యక్ష పదవి. బరాక్‌ ఒబామాతో కలిసి ఎనిమిదేళ్లు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అయ్యారు! జిల్‌ ట్రేసీ మాత్రం తనకెంతో ఇష్టమైన టీచింగ్‌ ప్రొఫెషన్‌లోనే ఉండిపోయారు. బైడెన్‌ ఉపాధ్యక్షుడు అయ్యాక కూడా ‘ద్వితీయ మహిళ హోదా’ను వార్డ్‌రోబ్‌లో పడేసి, రోజూ కాలేజ్‌కి వెళ్లి రావడం మాత్రం ఆమె మానలేదు. విల్లింగ్టన్‌లోని సెయింట్‌ మార్క్స్‌ హైస్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌గా ఆమె ఉద్యోగ జీవితం మొదలైంది.

ప్రస్తుతం ఆమె నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ప్రొఫెసర్‌. బైడెన్‌ ఒక్కో మెట్టూ రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే జిల్‌ ట్రేసీ అధ్యాపక వృత్తికి అవసరమైన ఒక్కో డిగ్రీ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆమెలోని ‘ఫిల్లీ గర్ల్‌’.. తనను ఆరాధించిన వారిని సున్నితంగా తృణీకరించిన విధంగానే వైట్‌ హౌస్‌ ఇచ్చే గొప్ప హోదా కన్నా, ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ అనే గుర్తింపునే ఎక్కువగా ఇష్టపడింది. 

విన్నింగ్‌ మేట్


జో బైడెన్‌ తన డెమోక్రాటిక్‌ పార్టీ వైస్‌–ప్రెసిడెంటుగా (రన్నింగ్‌ మేట్‌) భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ని ప్రకటించినప్పుడే ఆమె గెలుపు ఖాయమైంది! శనివారం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కమలా హ్యారిస్‌ అమెరికా మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్‌ మరొకసారి చరిత్రను సృష్టించబోతారని ఇప్పటినుంచే విశ్లేషణలు మొదలయ్యాయి. తండ్రి జమైకన్‌ అయినందు వల్ల అమెరికాలోని ఆఫ్రికన్‌ సంతతి వారి ఓట్లు రెండో మాట లేకుండా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కూడా కమలకే పడతాయని విశ్లేషకుల అంచనా. బాధితులైన స్త్రీలు, పిల్లల తరఫున కేసులు వాదించే న్యాయవాదిగా కూడా కమలకు అమెరికా అంతటా మంచి గుర్తింపు ఉంది. విలువలకు కట్టుబడిన రాజకీయ నాయకురాలు అని కూడా. ఇవి చాలు అమెరికా తన అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ను ఎన్నుకునేందుకు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement